ఇంటికెళ్లిన వారు నగదు ఇవ్వలేరా?

ఇంటింటికీ పింఛన్ల పంపిణీని జటిలం చేయడమే ప్రభుత్వ ఉద్దేశంలా కనిపిస్తోంది. గుంటూరు జిల్లాలోని కాకుమాను మండలంలో మూడు గంటల వ్యవధిలోనే పింఛనర్ల ఇళ్లను యంత్రాంగం చుట్టివచ్చింది.

Published : 01 May 2024 09:10 IST

పింఛన్ల పంపిణీపై జగన్‌ మొండివైఖరి
సులువైన పరిష్కారంపై మొగ్గు చూపని సర్కారు
బ్యాంకుల్లో జమ చేస్తామని మూడు గంటల్లోనే ఇంటింటికీ వెళ్లి చెప్పిన కాకుమాను సిబ్బంది
రాష్ట్రమంతటా ఇదే వ్యవధిలో డబ్బులు అందించలేరా?


జిల్లా: గుంటూరు మండలం: కాకుమాను
పింఛనుదారులు: 6,992 మంది
సచివాలయాలు: 13, సిబ్బంది: 94 మంది
కాకుమానులో పింఛనుదారుల ఇళ్లకు వెళ్లి బ్యాంకుల్లో నగదు జమ చేస్తామని సచివాలయ ఉద్యోగులు చెప్పారు. దీనికి పట్టిన సమయం 3 గంటలే. ఇలా వెళ్లిన వారు అదే చేత్తో అక్కడే పింఛను నగదు అందించొచ్చు.


ఈనాడు, అమరావతి, కాకుమాను, న్యూస్‌టుడే: ఇంటింటికీ పింఛన్ల పంపిణీని జటిలం చేయడమే ప్రభుత్వ ఉద్దేశంలా కనిపిస్తోంది. గుంటూరు జిల్లాలోని కాకుమాను మండలంలో మూడు గంటల వ్యవధిలోనే పింఛనర్ల ఇళ్లను యంత్రాంగం చుట్టివచ్చింది. అలా వెళ్లినవారు అక్కడే పింఛనునూ అందించవచ్చు. రాష్ట్రవ్యాప్తంగానూ ఇలాగే చేయవచ్చు. అభాగ్యులు, పండుటాకులకు ఇబ్బంది కలగకుండా తక్కువ వ్యవధిలో ఇంటివద్దే అందించవచ్చు. ఈ చిన్న విషయం 40 ఏళ్ల సర్వీసున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికిగానీ, ఐదేళ్లు పాలించిన సీఎం జగన్‌కుగానీ తెలియకపోవడం సిగ్గుచేటు. కాకుమాను మండలంలో ఒక్కో ఉద్యోగికి సగటున 74 మంది పింఛనుదారులు వచ్చారు. నగదు జమ గురించి భరోసానిచ్చిన వారికి డబ్బులు అందజేయడానికి మరో గంట, రెండు గంటల సమయం పట్టవచ్చు. లేదా రెండు రోజుల్లోనైనా పూర్తి చేస్తారు. పింఛనుదారుల వేలిముద్ర తీసుకుని పింఛను ఇవ్వడమే అదనపు భారమవుతుంది. ఈ విషయాన్నే నెల రోజులుగా విపక్షాలు ప్రస్తావిస్తూనే ఉన్నాయి. అయినా వైకాపా ప్రభుత్వం చెవికెక్కించుకోకుండా మండుటెండల్లో వృద్ధులను బయటకు రప్పించే రాక్షస క్రీడను కొనసాగిస్తూనే ఉంది.

ఇంటింటికీ పంపిణీ సాధ్యమని కలెక్టర్లు ముందే చెప్పారు..

గత నెల 1న పింఛను పంపిణీకి ముందు సీఎస్‌ జవహర్‌రెడ్డి నిర్వహించిన సమావేశంలో మెజారిటీ కలెక్టర్లు సచివాలయ సిబ్బందితో ఇంటింటికీ పింఛన్లు ఇవ్వవచ్చని ముక్తకంఠంతో చెప్పారు. ఈ సూచనను పెడచెవిన పెట్టి వైకాపాకు వంతపాడేలా పింఛనుదారులను గ్రామ, వార్డు సచివాలయాలకు రప్పించారు. ఇప్పుడు దానికి మించి బ్యాంకుల వద్దకు రప్పించేలా దారుణమైన ఆదేశాలిచ్చారు. గుంటూరు జిల్లా అధికారుల  ప్రయత్నంతో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఎంత సులువో ప్రస్తుతం తేటతెల్లమైంది. బ్యాంకుల్లో నగదు జమ కారణంగా ఎలాంటి ఆందోళనకు గురికావొద్దంటూ ఇళ్లకు వెళ్లి చెప్పాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే సిబ్బంది సమాచారమిచ్చారని కాకుమాను ఎంపీడీవో రామకృష్ణ తెలిపారు.

సచివాలయ ఉద్యోగులు ఊరంతా తిరిగినట్టే..

రాష్ట్రంలో 65.49 లక్షల మంది పింఛనుదారులుంటే 48.92 లక్షల మంది ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. మిగిలిన 16.57 లక్షల మంది ఇళ్లకు వెళ్లి సచివాలయ ఉద్యోగులు పింఛన్లు ఇవ్వాలి. సచివాలయాలవారీగా ఈ జాబితాలను ఇప్పటికే పంపారు. దాదాపు ప్రతి సచివాలయం పరిధిలోనూ ఇంటింటికీ వెళ్లి ఇవ్వాల్సిన పింఛన్లు ఉన్నాయి. వీటిని అక్కడున్న పది మంది ఉద్యోగులు పంచుకుని ఇళ్లవద్దకెళ్లాలని నిర్దేశించారు. ఇంటింటికీ వెళ్లి పింఛను పంపిణీ చేసేవారికి ఇళ్లకు అటుఇటుగానే బ్యాంకుల్లో నగదు జమయ్యే పింఛనుదారులు ఉంటారు. అంత దూరం వెళ్లిన వారికి పక్కనుండే ఇతర పింఛనుదారులకు నగదు ఇవ్వడం కష్టమేమీ కాదు. ఎలాగూ సచివాలయ సిబ్బందిని ఇళ్ల వద్దకు పంపుతున్నారు. వారితోనే అందరికీ ఇప్పించవచ్చు.

  • వైయస్సార్‌ జిల్లా ముద్దనూరు సచివాలయం-2 పరిధిలో 540 మంది పింఛనర్లు ఉండగా, ఇళ్లకు వెళ్లి పింఛను అందించాల్సినవారు 188 మంది ఉన్నారు. ఆ సచివాలయం పరిధిలో పది మంది ఉద్యోగులున్నారు. సగటున ఒక్కొక్కరికీ 18 మంది పింఛనుదారులు వస్తారు. ఈ సచివాలయం పరిధి రెండు కి.మీ.కు మించి ఉండదు. 188 మందికి పింఛను ఇవ్వాలంటే ఉద్యోగులు గ్రామాన్ని చుట్టి రావాల్సిందే. కాస్త సమయం తీసుకుని ఇదే సమయంలో మిగతావారికి అందించవచ్చు.
  • విజయనగరం జిల్లా కోరుకొండ సచివాలయం పరిధిలో 670 మంది పింఛనుదారులున్నారు. వీరిలో 182 మందికి ఇంటింటికీ పింఛన్లు ఇవ్వాలి. ఈ సచివాలయం పరిధి కిలోమీటరే. విజయనగరం మండలం రాకూడు సచివాలయం పరిధిలోనూ అంతే. ఇక్కడ 483 మంది పింఛనుదారులుండగా 113 మందికి ఇళ్ల వద్దకు వెళ్లి ఇవ్వాలి. 3 కి.మీ.పరిధిలో అందరు పింఛనుదారులు ఉన్నారు.
  • నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు-1 సచివాలయం పరిధిలో 450 మంది పింఛనుదారులు ఉన్నారు. ఇందులో 116 మందికి ఇళ్ల వద్ద పింఛను ఇవ్వాలి. ఈ సచివాలయం పరిధి రెండు కి.మీ.లు. 116 మందికి ఇచ్చే సమయంలోనే మిగతావారికి ఇవ్వవచ్చు.

ఇది ఇక్కట్ల పాలు చేయడమే...

  • కర్నూలు జిల్లా నందవరం మండలం గురజాల గ్రామ సచివాలయాల పరిధిలో 449 మంది పింఛనుదారులు ఉన్నారు. వీరిలో 80 శాతం మందికి బ్యాంకుల్లో నగదు జమ చేయనున్నారు. ఆ నగదును తీసుకోవాలంటే 15 కి.మీ.దూరంలోని నందవరానికి రావాల్సిందే.
  • నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో మండలకేంద్రం మినహా ఎక్కడా బ్యాంకు సౌకర్యం లేదు. ఈ మండలంలో 6,059 మంది పింఛనుదారులున్నారు. బ్యాంకుల్లో నగదు తీసుకోవాలంటే 15 కి.మీ.కుపైగా ప్రయాణించాల్సిందే.
  • పోడలి, గార్నాయుడుపేట, గుజ్జన్నపేట, చిత్తాపురం గ్రామాలకు చెందిన 435 మంది ఖాతాలు శ్రీకాకుళంలోని ఓ బ్యాంకుకు అనుసంధానమయ్యాయి. చిత్తాపురం నుంచి శ్రీకాకుళం వెళ్లాలంటే 45 కి.మీ. ప్రయాణించాల్సిందే. ఇదే జిల్లాలోని వాల్తేరు, జీఎస్‌పురం పింఛనుదారులు 15 కి.మీ.దూరంలోని మండవకురిటికిలో బ్యాంకుకు వెళ్లి నగదు తీసుకోవాలి.

ప్రత్యామ్నాయంగా తపాలాశాఖ లేదా?

ఏ అధికారి అయినా ప్రజలకు సమస్య వస్తే సులభ పరిష్కార మార్గం అనుసరిస్తారు. సీఎస్‌ జవహర్‌రెడ్డి మాత్రం వైకాపాకు వంతపాడేలా పింఛను పంపిణీని ఎంత సమస్యాత్మకంగా మార్చవచ్చో అంతా చేస్తున్నారు. ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి ఒకవేళ సరిపడా సచివాలయ సిబ్బంది లేరని క్షణం అనుకున్నా.. ప్రత్యామ్నాయంగా పోస్టాఫీసులున్నాయి. ఒకప్పుడు వీటి ద్వారానే ఇంటింటికీ అందించేవారు. ఈ విషయం సీఎస్‌కు తెలుసు కదా? పింఛనుదారుల పేరుపై మనియార్డర్‌ తీసి నేరుగా ఇళ్లకే నగదు అందించవచ్చు కదా? ఇబ్బంది పెట్టవద్దంటే ఇలాంటి మరెన్నో మార్గాలూ కనిపిస్తాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని