Updated : 03 Jan 2022 06:15 IST

Bandi Sanjay: బండి సంజయ్‌ జాగరణ దీక్ష భగ్నం

కార్యాలయ తలుపులు పగలగొట్టి అరెస్టు చేసిన పోలీసులు
తోపులాటలో గాయపడ్డ నాయకులు, కార్యకర్తలు

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ను కార్యాలయం నుంచి తరలిస్తున్న పోలీసులు

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీల కోసం విడుదల చేసిన జీవో 317ను సవరించాలని డిమాండ్‌ చేస్తూ భాజపా చేపట్టిన జాగరణ దీక్షను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. ఆదివారం రాత్రి కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయం వద్ద వేదికను ఏర్పాటు చేసి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆధ్వర్యంలో చేపట్టాలనుకున్న ఈ దీక్షకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. ఎలాగోలా కార్యాలయంలోకి చేరుకున్న సంజయ్‌ గేటుకు తాళం వేసుకొని దీక్ష ప్రారంభించారు. రాత్రి 10.30 గంటలకు పోలీసులు తలుపులు పగలగొట్టి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరు సరికాదని.. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని సంజయ్‌ హెచ్చరించారు.

జాగరణ దీక్షకు మద్దతుగా జిల్లాల నుంచి వస్తున్న నాయకుల్ని పోలీసులు ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకుని ఠాణాలకు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు, భాజపా నాయకులకు మధ్య పలుమార్లు తోపులాటలు జరిగాయి. బలవంతంగా వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో కొందరు నాయకులు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. రాష్ట్ర అధ్యక్షుడు వస్తున్నారంటూ కార్యకర్తలంతా సమీపంలోని ఓ రోడ్డువైపునకు ఒక్కసారిగా పరుగెత్తారు. దీంతో పోలీసులు కూడా వారి వెనకాలే వెళ్లడంతో మరోమార్గం నుంచి వచ్చిన సంజయ్‌ను నాయకులు, కార్యకర్తలు కార్యాలయం లోపలికి ఎత్తుకుని తీసుకెళ్లారు. కార్యకర్తలు గేటుకు తాళం వేయగా.. సంజయ్‌ జాగరణ దీక్షను ప్రారంభించారు. దీంతో కార్యకర్తల్ని నిలువరించి.. పోలీసులు కార్యాలయ గేటు తాళాన్ని పగలగొట్టారు. అప్పటికే లోపల ఉన్న శ్రేణులు తమ నాయకుడిని అరెస్టు చేస్తే పెట్రోల్‌ పోసుకుంటామని హెచ్చరించడంతో ముందస్తు చర్యల్లో భాగంగా అగ్నిమాపక శకటాన్ని తెప్పించి కార్యాలయం లోపల నీళ్లు చల్లించారు. రాత్రి 10:30 గంటలకు గేటును దాటి తలుపులు, అద్దాలు బద్దలుకొట్టి లోపలికి వెళ్లి సంజయ్‌ను బలవంతంగా అరెస్ట్‌ చేసి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆయన తలకు గాయమైనట్లు పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి. సంజయ్‌ని మానకొండూర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించగా అక్కడే దీక్ష కొనసాగిస్తున్నట్లు తెలిసింది.

ఎంపీ కార్యాలయ ద్వారాలు పగలగొడుతున్న పోలీసులు

ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి: సంజయ్‌

ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీవితాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి పోయే రోజులు దగ్గర పడ్డాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికార గర్వంతో సీఎం ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, శాంతియుతంగా తాము చేస్తున్న జాగరణ దీక్షను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేసీఆర్‌, కేటీఆర్‌ల కార్యక్రమాలకు కొవిడ్‌ నిబంధనలు వర్తించవా..? అని అడిగారు. తన పార్లమెంట్‌ కార్యాలయం వద్ద పోలీసులు దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీడియా సిబ్బంది గాయపడ్డారని.. ప్రజాస్వామ్యయుతంగా చేస్తున్న దీక్షను బలవంతంగా ఆపడం సరైనది కాదన్నారు. పోలీసుల ప్రవర్తనను పార్లమెంట్‌ దృష్టికి తీసుకెళ్తానని.. సభాహక్కుల ఉల్లంఘన నోటీసుల్ని ఇచ్చేలా చూస్తామని సంజయ్‌ తెలిపారు.  

* సంజయ్‌ అరెస్టును భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌ తీవ్రంగా ఖండించారు. సంజయ్‌ పట్ల పోలీసులు క్రూరంగా, అమానవీయంగా వ్యవహరించారని మండిపడ్డారు.

* సంజయ్‌ అరెస్టు పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘కేసీఆర్‌ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోంది. సంజయ్‌ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎంపీ. కనీస గౌరవం లేకుండా.. గేటు విరగ్గొట్టి పోలీసులు లోపలికి వెళ్లడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. నిరసన హక్కుని రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోంది’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.


Read latest Ap top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని