Ajay Goel: ఆరు నెలల్లోనే వేదాంతకు తిరిగొచ్చిన అజయ్‌ గోయల్‌

Ajay Goel: 2021 అక్టోబర్‌ 23 నుంచి 2023 ఏప్రిల్‌ 9 వరకు వేదాంత సీఎఫ్‌ఓగా పనిచేశారు. తాజాగా మళ్లీ అదే సంస్థలో.. అదే హోదాలో ఆయన చేరనున్నారు.

Published : 24 Oct 2023 12:32 IST

దిల్లీ: ప్రముఖ ఆర్థిక నిపుణుడు అజయ్‌ గోయల్‌ (Ajay Goel).. మైనింగ్‌ దిగ్గజం వేదాంత (Vedanta)లో తిరిగి చేరనున్నారు. చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. కంపెనీ పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళిక కీలక దశలో ఉన్న తరుణంలో ఆయన పునరాగమనం చేయడం గమనార్హం. అక్టోబర్‌ 30 నుంచి ఆయన విధుల్లో చేరనున్నట్లు కంపెనీ ప్రకటించింది. గోయల్‌ (Ajay Goel) ఈ ఏడాది ఏప్రిల్‌లోనే కంపెనీని వీడి ఎడ్యుటెక్‌ కంపెనీ బైజూస్‌ (BYJU'S)లో చేరారు.

దేశంలోనే ప్రముఖ చార్టర్డ్‌ అకౌంటెంట్‌, కంపెనీ సెక్రటరీగా పేరుగాంచిన అజయ్‌ గోయల్‌ అంతర్జాతీయ స్థాయి కంపెనీల్లో పనిచేశారు. జనరల్‌ ఎలక్ట్రిక్‌, నెస్లే, కోకా కోలా సహా మరికొన్ని కంపెనీల్లో కీలక హోదాల్లో విధులు నిర్వర్తించారు. 2021 అక్టోబర్‌ 23 నుంచి 2023 ఏప్రిల్‌ 9 వరకు వేదాంత (Vedanta) సీఎఫ్‌ఓగా పనిచేశారు. తాజాగా మళ్లీ అదే హోదాలో చేరనున్నారు. వేదాంత (Vedanta)ను ఆరు నమోదిత కంపెనీలుగా విభజించనున్నట్లు గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. కంపెనీ పూర్తి సామర్థ్యాన్ని వెలికి తీయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. లోహ, విద్యుత్తు, అల్యూమినియం, ఆయిల్ అండ్‌ గ్యాస్‌ వ్యాపారాలను విభజించి ప్రత్యేక నమోదిత సంస్థలుగా లిస్ట్‌ చేయనున్నారు.

వేదాంత (Vedanta)ను వీడి బైజూస్‌ (BYJU'S)లో సీఎఫ్‌ఓగా చేరిన గోయల్‌ కేవలం ఆరు నెలలు మాత్రమే అక్కడ పనిచేశారు. బైజూస్‌ ఇంకా సెప్టెంబరు త్రైమాసిక ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. మరోవైపు రుణాల చెల్లింపులో కంపెనీ తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. కార్యకలాపాల నిర్వహణకు కావాల్సిన నిధుల సమీకరణలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ తరుణంలో ఆయన కంపెనీని వీడడం  పెద్ద ఎదురు దెబ్బ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని