Sam Bankman Fried: ‘కింగ్‌ ఆఫ్‌ క్రిప్టో’ బ్యాంక్‌మన్‌ ఫ్రీడ్‌ అరెస్ట్‌

ప్రముఖ క్రిప్టో సంస్థ ఎఫ్‌టీఎక్స్‌ దివాలాతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది నష్టపోయారు.

Updated : 13 Dec 2022 14:06 IST

న్యూయార్క్‌: దివాలా తీసిన క్రిప్టో (cryptocurrency) సంస్థ ఎఫ్‌టీఎక్స్‌ (FTX) మాజీ సీఈఓ శామ్‌ బ్యాంక్‌మన్‌ ఫ్రీడ్‌ (Sam Bankman-Fried)ను సోమవారం బహమాస్‌లో పోలీసులు అరెస్టు చేశారు. అమెరికా ప్రభుత్వం, బహమాస్‌ దర్యాప్తు సంస్థల అభ్యర్థన మేరకు ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు అక్కడి పోలీసు అధికారులు తెలిపారు. ఎఫ్‌టీఎక్స్‌ (FTX) పతనం తర్వాత ఆయనపై ఇరు దేశాల్లో పలు ఆర్థిక నేరాల కింద అభియోగాలు ఉన్న విషయం తెలిసిందే.

‘హౌస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కమిటీ’ ముందు హాజరుకావాల్సిన ఒకరోజు ముందే ఫ్రీడ్‌ (Sam Bankman-Fried)ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం. ఆయన్ని వెంటనే అమెరికాకు అప్పగిస్తామని బహమాస్‌ అటార్నీ జనరల్‌ ర్యాన్‌ పిండర్‌ తెలిపారు. అలాగే తాము కూడా ప్రత్యేకంగా దర్యాప్తు కొనసాగిస్తామని పేర్కొన్నారు. చట్టాలను ఉల్లంఘించి, ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేస్తూ ఎఫ్‌టీఎక్స్‌ (FTX) పతనానికి కారణమైన వారందరినీ చట్టం ముందు నిలబెట్టడానికి యూఎస్‌తో కలిసి పనిచేస్తామని బహమాస్‌ ప్రధాని ఫిలిప్‌ డేవిస్‌ తెలిపారు. మరోవైపు అమెరికా సెక్యూరిటీ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ సైతం ఆయనపై కేసు నమోదు చేస్తామని తెలిపింది. అమెరికా సెక్యూరిటీ నిబంధనల్ని ఫ్రీడ్‌ (Sam Bankman-Fried) ఉల్లంఘించినట్లు పేర్కొంది.

ఎఫ్‌టీఎక్స్‌ (FTX) బహమాస్‌ కేంద్రంగా పనిచేస్తోంది. సంస్థ పతనం తర్వాత ఫ్రీడ్‌ (Sam Bankman-Fried) ఆ దేశ రాజధాని నాసావూలోని తన విలాసవంతమైన భవంతిలోనే నివసిస్తున్నారు. ఎఫ్‌టీఎక్స్‌ నవంబరు 11న దివాలా ప్రక్రియకు దరఖాస్తు చేసుకుంది. అప్పటి వరకు ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్రిప్టో (cryptocurrency) ఎక్స్ఛేంజీ. కస్టమర్ల డిపాజిట్లను ఈ సంస్థ తమ పెట్టుబడి కంపెనీ అలమెడా రీసెర్చ్‌తో కలపడంతో వివాదం మొదలైంది.

బ్యాంక్‌మన్‌ ఫ్రీడ్‌ (Sam Bankman-Fried)ను ఓ దశలో ‘కింగ్‌ ఆఫ్‌ క్రిప్టో’గా అభివర్ణించారు. ఎఫ్‌టీఎక్స్‌ (FTX) పతనానికి ముందు వాషింగ్టన్‌లోని ప్రముఖ వ్యక్తుల్లో ఒకరిగా పేరుగాంచారు. వామపక్ష, ప్రజాస్వామ్య భావజాలం ఉన్న రాజకీయపరమైన కార్యక్రమాలకు ఆయన మిలియన్ల డాలర్లు విరాళంగా ఇచ్చి వార్తల్లో నిలిచారు. ఒక్క నెల వ్యవధిలోనే కథ పూర్తిగా అడ్డం తిరిగింది. సరికొత్త డిజిటల్‌ ఫైనాన్స్‌ యుగ వైతాళికుడిగా పేరుగాంచిన ఫ్రీడ్‌ (Sam Bankman-Fried) ఇప్పుడు ఊచలు లెక్కెట్టాల్సిన పరిస్థితి తలెత్తింది.

ఎఫ్‌టీఎక్స్‌ దివాలా వల్ల ప్రపంచమంతటా 10 లక్షల మందికి పైగా క్రిప్టో (cryptocurrency) మదుపరులు తీవ్రంగా నష్టపోయారు. దివాలా తీయకుండా ఆపడానికి కావాల్సిన 800 కోట్ల డాలర్లను బ్యాంక్‌మన్‌ ఫ్రీడ్‌ (Sam Bankman-Fried) సేకరించలేకపోయారు. ఈ ఏడాది జనవరిలో ఎఫ్‌టీఎక్స్‌ మార్కెట్‌ విలువను 3,200 కోట్ల డాలర్లుగా లెక్కగట్టారు. నేడు ప్రపంచమంతటా విస్తరించిన 134 ఎఫ్‌టీఎక్స్‌ అనుబంధ సంస్థల నెత్తిపై 5,000 కోట్ల డాలర్ల అప్పులు ఉన్నాయి. 2019లో స్థాపితమైన ఎఫ్‌టీఎక్స్‌లో వెంచర్‌ పెట్టుబడిదారులు, పింఛన్‌ నిధులు, కంపెనీలు, ఇతర భారీ మదుపరులు వందల కోట్ల డాలర్లు గుమ్మరించారు. చివరకు ఎఫ్‌టీఎక్స్‌ ఉద్యోగులు సైతం మదుపు చేశారు. నిరుడు చేతిలో డబ్బు తిరగక ఇబ్బంది పడుతున్న ఇతర క్రిప్టో (cryptocurrency) ఎక్స్ఛేంజీలకు ఎఫ్‌టీఎక్స్‌ 740 కోట్ల డాలర్లను రుణంగా ఇచ్చింది. ఇప్పుడు తానే బోల్తా పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని