5జీ వచ్చేసింది హైదరాబాద్‌ సహా 8 నగరాల్లో

హైదరాబాద్‌ సహా దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 5జీ సేవలు శనివారం నుంచే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు భారతీ ఎయిర్‌టెల్‌ వెల్లడించింది. దీంతో దేశంలో ఈ సేవలను ప్రారంభించిన తొలి టెలికాం కంపెనీగా భారతీ ఎయిర్‌టెల్‌ నిలిచినట్లు సంస్థ ఛైర్మన్‌ సునీల్‌ భారతీ మిత్తల్‌ తెలిపారు.

Published : 02 Oct 2022 02:17 IST

2024 మార్చికల్లా దేశవ్యాప్తంగా

ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్‌ మిత్తల్‌

హైదరాబాద్‌ సహా దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 5జీ సేవలు శనివారం నుంచే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు భారతీ ఎయిర్‌టెల్‌ వెల్లడించింది. దీంతో దేశంలో ఈ సేవలను ప్రారంభించిన తొలి టెలికాం కంపెనీగా భారతీ ఎయిర్‌టెల్‌ నిలిచినట్లు సంస్థ ఛైర్మన్‌ సునీల్‌ భారతీ మిత్తల్‌ తెలిపారు.

* ప్రధాని దిల్లీలో ఎయిర్‌టెల్‌ 5జీ సేవలను ప్రారంభించిన వెంటనే హైదరాబాద్, దిల్లీ, ముంబయి, వారణాసి, చెన్నై, బెంగళూరు సహా 8 నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు వెల్లడించారు.

* వచ్చే మార్చి నాటికి దేశంలోని అనేక నగరాలు 5జీ పరిధిలోకి వస్తాయని, 2024 మార్చి నాటికి దేశమంతా విస్తరిస్తామని వెల్లడించారు. ‘టెక్నాలజీని దేశ ప్రగతికి అనుసంధానం చేయడంలో ప్రధాని మోదీకి ఎంతో అవగాహన ఉంది. సాంకేతికతను నిశితంగా అర్థం చేసుకునే నాయకుడు ఉన్నందుకు మేము గర్విస్తున్నాం’ అని పేర్కొన్నారు. దేశంలో 4జీ సాంకేతికత అభివృద్ధి-విస్తరణకు రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ చేసిన కృషినీ సునీల్‌ మిత్తల్‌ అభినందించారు. ‘ముకేశ్‌ 4జీని తీసుకొచ్చినప్పుడు దాన్ని అందుకోవడానికి మేము పరుగులు పెట్టాల్సి వచ్చింది. 4జీ వల్లే కొవిడ్‌ సందర్భంలోనూ దేశం ఒక్క నిమిషం కూడా ఆగలేదు. నిరంతరాయంగా సేవలు కొనసాగాయి’ అని మిత్తల్‌ వెల్లడించారు. స్టార్టప్‌లు ప్రారంభించాలన్న ప్రధాని పిలుపు మేరకు అవతరించిన సంస్థల్లో, ప్రతి నెలా కొన్ని యూనికార్న్‌లుగా (రూ.8,000 కోట్ల విలువైన) మారుతున్నాయని గుర్తు చేశారు. 5జీ వల్ల వేల సంఖ్యలో కొత్త సంస్థలు, డజన్ల కొద్దీ కొత్త యూనికార్న్‌లూ వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

టారిఫ్‌లపై

కంపెనీ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ రణదీప్‌ సింగ్‌ సెఖోన్‌ మాట్లాడుతూ.. ఎయిర్‌టెల్‌ 5జీ సేవలు, ఇప్పటి 4జీ ధరలతో ప్రస్తుతం లభిస్తాయని, కొత్త టారిఫ్‌లను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. ‘మొబైల్‌ టవర్లలో కొన్ని 5జీ పరికరాలను బిగించాల్సి ఉంది. ఈ పనిని క్రమంగా పూర్తి చేస్తున్నాం. ఈ పరికరాలున్న టవర్‌లకు దగ్గరగా ఉన్న 5జీ మొబైల్‌ ఫోన్ల వినియోగదారులు ఈ సేవలు వినియోగించుకోవచ్చు’ అని తెలిపారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని