నెలకు రూ.25వేలు వచ్చేలా...

Updated : 07 Oct 2022 06:41 IST

* ఆదాయపు పన్ను మినహాయింపు కోసం రూ.60 వేల వరకూ మదుపు చేయాల్సి వస్తోంది. జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌) ఎంచుకుంటే బాగుంటుందని అంటున్నారు. ఇది కాకుండా యులిప్‌ తీసుకుంటే మంచిదేనా? నాకు 52 ఏళ్లు. నేను ఏ పథకాలను ఎంచుకోవాలి?

- మధుకర్‌

ఆదాయపు పన్ను సెక్షన్‌ 80సీలో రూ.1,50,000 వరకూ పన్ను మినహాయింపు కోసం వివిధ పెట్టుబడి పథకాల్లో మదుపు చేయొచ్చు. మీరు ఈ సెక్షన్‌ పరిమితికి మించి మదుపు చేయాలనుకుంటే.. సెక్షన్‌ 80సీసీడీలో భాగంగా జాతీయ పింఛను పథకాన్ని (ఎన్‌పీఎస్‌)ను ఎంచుకోవచ్చు. ఇందులో రూ.50వేల వరకూ పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ మీరు సెక్షన్‌ 80సీలో భాగంగానే మదుపు చేయాలనుకుంటే.. ఎన్‌పీఎస్‌కు బదులుగా ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలను (ఈఎల్‌ఎస్‌ఎస్‌) ఎంచుకోవచ్చు. మీ వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల బీమా ఉండాలి. దీనికోసం టర్మ్‌ పాలసీని ఎంచుకోవచ్చు. దీనికి చెల్లించిన ప్రీమియానికీ సెక్షన్‌ 80సీ పరిమితి మేరకు మినహాయింపు వర్తిస్తుంది.


* నేను వ్యక్తిగత రుణం తీసుకోవాలని అనుకుంటున్నాను. ఈ రుణంతోపాటు తప్పనిసరిగా బీమా తీసుకోవాలని బ్యాంకు అంటోంది. ఇలా తీసుకోవడం మంచిదేనా?

- కిశోర్‌

సాధారణంగా బ్యాంకులు రుణాలు ఇచ్చేటప్పుడు దానికి అనుబంధంగా ఒక బీమా పాలసీ తీసుకోవాలని సూచిస్తుంటాయి. ఇదేమీ తప్పనిసరి కాదు. మీకు ఇప్పటికే బీమా పాలసీలుంటే వాటి గురించి తెలియజేయొచ్చు. వ్యక్తిగత రుణానికి ఎలాంటి హామీ ఉండదు కాబట్టి, బ్యాంకులు రుణగ్రహీతను లోన్‌ కవర్‌ టర్మ్‌ పాలసీ తీసుకోవాలని చెబుతుంటాయి. ఇది కాకుండా.. ఏదైనా పెట్టుబడికి సంబంధించిన పాలసీని తీసుకోవాలని ఒత్తిడి చేస్తే మీరు ఫిర్యాదు చేయొచ్చు. ఒకసారి బ్యాంకుతో పూర్తి వివరాలు చర్చించండి.


* నేను ఇటీవలే ఉద్యోగంలో చేరాను. నెలకు రూ.28వేలు చేతికి వస్తున్నాయి. నా వయసు 23. మూడేళ్లపాటు నెలకు రూ.18వేలు పెట్టుబడి పెట్టాలని అలోచిస్తున్నాను. దీనికోసం ఏం చేయాలి?

- ప్రణీత

మీకు మూడేళ్ల సమయం ఉంది కాబట్టి, సురక్షిత పథకాలను ఎంచుకోవడమే ఉత్తమం. మధ్యలో తీసుకునే అవకాశమూ ఉండేలా చూసుకోవాలి. దీనికోసం బ్యాంకులో రికరింగ్‌ డిపాజిట్‌ ఖాతాను ప్రారంభించి, అందులో జమ చేయండి. వీటిపై 5-6 శాతం వరకూ రాబడి అందుతుంది.


* నా వయసు 64. రూ.8లక్షలను పెట్టుబడి పెట్టి, నెలనెలా వడ్డీ తీసుకోవాలని అనుకుంటున్నాను. డెట్‌ ఫండ్లలో మదుపు చేసి, నెలకు రూ.10 వేలు తీసుకోవచ్చా? పెట్టుబడి నష్టపోతామా? ఏం చేయాలి?

-ఆది నారాయణ

ప్రస్తుతం డిపాజిట్లపై వడ్డీ రేటు, డెట్‌ ఫండ్లపై వచ్చే రాబడి కాస్త మెరుగ్గానే ఉంది. అయినప్పటికీ 5.5 - 6 శాతం వరకే రాబడిని ఆశించవచ్చు. డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లలో స్వల్ప నష్టభయం ఉంటుందని మర్చిపోవద్దు. రూ.8లక్షల పెట్టుబడిపైన నెలకు రూ.10వేలు రావాలంటే సగటున 15 శాతం రాబడి రావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో డిపాజిట్లు, డెట్‌ ఫండ్లలో ఇంత రాబడి రావడం అసాధ్యం. మీరు పెట్టాలనుకుంటున్న పెట్టుబడి మొత్తాన్ని సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీంలో జమ చేయండి. ఇందులో రూ.8 లక్షల పైన మూడు నెలలకోసారి రూ.14,800 వడ్డీ అందుతుంది. ఇది పూర్తిగా సురక్షితమైన పథకం.


* మరో 13 నెలల్లో పదవీ విరమణ చేయబోతున్నాను. నెలకు కనీసం రూ.25 వేలు వచ్చేలా ఏదైనా పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాను. దీనికోసం ఎంత మొత్తం మదుపు చేయాలి?

- భాస్కర్‌

సురక్షితంగా ఉండే పథకాల్లోనే మీ పెట్టుబడి ఉండాలని భావిస్తే.. సగటున 6 శాతం రాబడి అంచనాతో.. రూ.50లక్షలను పెట్టుబడి పెట్టాలి. అప్పుడు నెలకు రూ.25వేలు అందుకోగలరు. దీనికోసం పోస్టాఫీసు సీనియర్‌ సిటిజన్‌ స్కీం, పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కం స్కీం, ప్రధానమంత్రి వయ వందన యోజన, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఎంచుకోవచ్చు. నష్టభయాన్ని తట్టుకుంటూ, కాస్త అధిక రాబడి ఆశిస్తే రూ.15 లక్షల వరకూ బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లలో మదుపు చేసి, మిగతా రూ.35 లక్షలను సురక్షిత పథకాల్లో మదుపు చేసుకోవచ్చు.


- తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని