ఫండ్లలో.. 18 శాతం రాబడి వస్తుందా?

ఆదాయపు పన్ను మినహాయింపు కోసం నెలకు రూ.5 వేల వరకూ మదుపు చేయాలనే ఆలోచనతో ఉన్నాను. ఈఎల్‌ఎస్‌ఎస్‌, ఎన్‌పీఎస్‌ ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలి? మరో 10 ఏళ్ల తర్వాత ఎంత మొత్తం వచ్చేందుకు అవకాశం ఉంటుంది?

Updated : 28 Oct 2022 04:22 IST


ఆదాయపు పన్ను మినహాయింపు కోసం నెలకు రూ.5 వేల వరకూ మదుపు చేయాలనే ఆలోచనతో ఉన్నాను. ఈఎల్‌ఎస్‌ఎస్‌, ఎన్‌పీఎస్‌ ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలి? మరో 10 ఏళ్ల తర్వాత ఎంత మొత్తం వచ్చేందుకు అవకాశం ఉంటుంది?

- రాఘవేంద్ర

దాయపు పన్ను చట్టం సెక్షన్‌ 80సీ కింద నిర్ణీత పెట్టుబడి పథకాల్లో మదుపు చేసి, రూ.1,50,000 వరకూ మినహాయింపు పొందవచ్చు. ఇందులో ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌) ఒకటి. మీరు వీటిలో నెలనెలా సిప్‌ చేయొచ్చు. ఈ పరిమితి మించిన తర్వాత సెక్షన్‌ 80సీసీడీలో భాగంగా రూ.50వేల వరకూ జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌)లో మదుపు చేయొచ్చు. మీరు రూ.5వేలను క్రమం తప్పకుండా ఈఎల్‌ఎస్‌ఎస్‌లో మదుపు చేస్తే.. 12 శాతం రాబడి అంచనాతో 10 ఏళ్ల తర్వాత రూ.10,52,924 వచ్చేందుకు అవకాశం ఉంటుంది.


ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ నుంచి రూ.4 లక్షలు వెనక్కి తీసుకొని, ఏదైనా మ్యూచువల్‌ ఫండ్‌ పథకంలో మదుపు చేయాలని అనుకుంటున్నాను. అయిదేళ్ల తర్వాత డబ్బు వెనక్కి తీసుకుంటాను. మంచి రాబడి వచ్చే అవకాశం ఉంటుందా?

- మురళి

క్విటీ ఆధారిత పెట్టుబడుల్లో మదుపు చేసినప్పుడు కనీసం 5-7 ఏళ్లపాటు వేచి చూడాలి. మీరు మదుపు చేయాలనుకుంటున్న మొత్తం రూ.4లక్షలను ముందుగా లిక్విడ్‌ ఫండ్లలో జమ చేయండి. వచ్చే ఆరు నుంచి తొమ్మిది నెలలపాటు క్రమానుగత బదిలీ విధానంలో ఈక్విటీ ఫండ్లకు మళ్లించండి. వచ్చే ఏడాది కాలంపాటు మార్కెట్‌లో కాస్త హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. ఆ తర్వాత మార్కెట్ల పనితీరు బాగుంటుందనే అంచనాలున్నాయి. కాబట్టి, స్వల్పకాలంలో నష్టం కనిపించినా ఆందోళన చెందకండి.


నా భర్త ప్రమాదంలో మరణించారు. బీమా పరిహారం రూ.5లక్షలు వచ్చాయి. వీటిని 14 ఏళ్ల మా పాప భవిష్యత్తు అవసరాల కోసం మదుపు చేయాలనే ఆలోచనతో ఉన్నాను. ఎలాంటి పథకాలను ఎంచుకోవాలి?

- శ్రావణి

ముందుగా మీ పాప ఆర్థిక అవసరాలకు తగిన రక్షణ కల్పించండి. మీరు ఉద్యోగం చేస్తుంటే.. మీ పేరుపైన తగిన మొత్తానికి టర్మ్‌ పాలసీ తీసుకోండి. మరో ఆరేళ్ల తర్వాత డబ్బుతో అవసరం ఉంది అనుకుంటే.. అప్పటి వరకూ హైబ్రీడ్‌ ఈక్విటీ ఫండ్లలో మదుపు చేయండి. ఇందులో కనీసం 11 శాతం రాబడిని ఆశించవచ్చు. ఆరేళ్ల తర్వాత మీ చేతికి రూ.9,35,207 వచ్చే అవకాశం ఉంది.


నెలకు రూ.25వేల వరకూ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయాలనే ఆలోచనతో ఉన్నాను. 15 ఏళ్లపాటు మదుపు చేస్తే కనీసం 18 శాతం వరకూ రాబడి అందుతుందా? ఎంత మొత్తం రావచ్చు?

- సుధీర్‌

దాదాపు 15 ఏళ్లపాటు మదుపు చేయడం దీర్ఘకాలం కిందే లెక్క. మీ పెట్టుబడి వృద్ధి చెందేందుకు ఇది దోహదం చేస్తుంది. ఈక్విటీ ఆధారిత పథకాల్లో 11 నుంచి 13 శాతం వరకూ రాబడిని ఆశించవచ్చు. గతంలో ఇంతకు మించిన రాబడి వచ్చిన సందర్భాలున్నాయి. కానీ, భవిష్యత్తులో 18 శాతం రాబడి వస్తుందని చెప్పడం సాధ్యం కాదు. మీరు 15 ఏళ్లపాటు నెలకు రూ.25వేలు డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లలో మదుపు చేస్తే.. 13 శాతం రాబడి అంచనాతో రూ.1.21 కోట్ల వరకూ జమ అవుతాయి.


నేను ఇటీవలే ఉద్యోగంలో చేరాను. వయసు 23. నెలకు రూ.8వేల వరకూ మదుపు చేయగలను. నా ఆర్థిక ప్రణాళిక ఎలా ఉంటే బాగుంటుంది?

- మనోజ్‌

మీపై ఆధారపడిన వారుంటే.. మీ వార్షికాదాయానికి 10-12 రెట్ల టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోండి. వ్యక్తిగత ప్రమాద బీమా, డిజేబిలిటీ ఇన్సూరెన్స్‌లనూ పరిశీలించండి. కంపెనీ బృంద బీమా అందిస్తున్నా.. సొంతంగా మరో పాలసీ తీసుకునే ప్రయత్నం చేయండి. మూడు నుంచి ఆరు నెలల పాటు ఖర్చులకు సరిపడా మొత్తాన్ని అత్యవసర నిధిగా ఉంచుకోండి. మీరు మదుపు చేయాలనుకుంటున్న రూ.8వేలలో రూ.3వేలను పీపీఎఫ్‌లో జమ చేయండి. మిగతా మొత్తాన్ని క్రమానుగత పెట్టుబడి విధానంలో డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లలో మదుపు కొనసాగించండి.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని