పదేళ్లలో రూ.30 లక్షలు కావాలంటే

మా అమ్మాయి వయసు 13. మరో పదేళ్ల తర్వాత తన పెళ్లి, ఇతర ఖర్చుల కోసం కనీసం రూ.30లక్షలు అవసరం అవుతాయి అనుకుంటున్నాం.

Updated : 23 Dec 2022 04:37 IST


* మా అమ్మాయి వయసు 13. మరో పదేళ్ల తర్వాత తన పెళ్లి, ఇతర ఖర్చుల కోసం కనీసం రూ.30లక్షలు అవసరం అవుతాయి అనుకుంటున్నాం. దీనికోసం నెలకు నేను ఎంత మేరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఏయే పథకాలు ఎంచుకోవాలి? 

రజిత 

ముందుగా మీ అమ్మాయి భవిష్యత్‌ ఆర్థిక అవసరాలకు తగిన రక్షణ కల్పించండి. దీనికోసం కుటుంబంలో ఆదాయం ఆర్జించే వ్యక్తి పేరుమీద తగిన మొత్తానికి టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని తీసుకోండి. మీరు పదేళ్లలో రూ.30లక్షలు జమ చేయాలంటే.. పెట్టుబడులపై కనీసం 11 శాతం రాబడి వచ్చేలా చూసుకుంటూ నెలకు రూ.15,000 వరకూ మదుపు చేయాలి. మంచి డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లను ఎంచుకొని, పెట్టుబడులు ప్రారంభించండి. వీటిల్లో కాస్త నష్టభయం ఉంటుంది. కాబట్టి, మీకు డబ్బులు అవసరం ఉన్న మూడేళ్ల ముందునుంచీ ఇందులో ఉన్న మొత్తాన్ని కాస్త సురక్షిత పథకాలకు మళ్లించండి.


* మా కార్యాలయం నుంచి రూ.3 లక్షల ఆరోగ్యబీమా పాలసీ ఉంది. దీనికి అదనంగా మరో పాలసీ తీసుకోవాలా? టాపప్‌ పాలసీ తీసుకుంటే సరిపోతుందా?

రాజేశ్‌

సంస్థ నుంచి అందే బృంద బీమా పాలసీకి కొన్ని పరిమితులు ఉంటాయి. మీరు ఉద్యోగం మారినప్పుడు ఈ బీమా రక్షణ దూరం అయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి, సంస్థ అందించే బృంద ఆరోగ్య బీమా ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా మరో పాలసీని తీసుకోండి. రూ.3లక్షలకు మించి ఆసుపత్రి బిల్లు అయినప్పుడు మీపై ఆర్థిక భారం లేకుండా ఉంటుంది. టాపప్‌ పాలసీ తీసుకున్నప్పుడు ముందుగా కొంత మొత్తం తప్పనిసరి మినహాయింపు తర్వాతే పరిహారం ఇస్తుంది. కాబట్టి, సొంతంగా ఒక పూర్తి స్థాయి వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడమే మేలు.


* గృహరుణం తీసుకునేందుకు ఇది సరైన సమయమేనా? కొన్నాళ్లు వేచి చూడాలా? నెలకు రూ.25వేల వరకూ ఈఎంఐ చెల్లించగలను. నాకు ఎంత మేరకు రుణం వస్తుంది?                

మహిపాల్‌ 

కొన్ని నెలలుగా ఆర్‌బీఐ రెపో రేటు పెంచుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో గృహరుణ వడ్డీ రేట్లు పెరిగాయి. వచ్చే మూడు నుంచి ఆరు నెలల్లో మరింత పెరిగే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. ఏడాది తర్వాత ఇందులో కాస్త దిద్దుబాటు రావచ్చు. మీకు ఇల్లు తీసుకోవాలనే ఆలోచన ఉంటే ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు. రెపో ఆధారిత రుణ వడ్డీ రేటు (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌)ను ఎంచుకోండి. ప్రస్తుతం గృహరుణాలపై వడ్డీ రేటు 8.75 శాతం ఉంది. మీరు 20 ఏళ్ల వ్యవధిని ఎంచుకుంటే దాదాపు రూ.28లక్షల వరకూ గృహరుణం లభిస్తుంది. పూర్తి వివరాల కోసం బ్యాంకును సంప్రదించండి.


తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని