Q-A: నెలకు రూ.10వేలు వచ్చేలా

ప్రస్తుతం యూఎస్‌ఏలో ఉంటున్నాను. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు డీమ్యాట్‌ ఖాతా ద్వారా కొన్ని షేర్లు, మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేశాను.

Updated : 06 Jan 2023 12:31 IST

1) ప్రస్తుతం యూఎస్‌ఏలో ఉంటున్నాను. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు డీమ్యాట్‌ ఖాతా ద్వారా కొన్ని షేర్లు, మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేశాను. ఇప్పుడు నేను ఎన్‌ఆర్‌ఐని కాబట్టి, కొత్తగా షేర్లను కొనొచ్చా? డీమ్యాట్‌ ఖాతాలో నా వివరాలేమైనా మార్చాలా?

వంశీ

మీరు మన దేశంలో ఉన్నప్పుడు ‘రెసిడెంట్‌ ఇండియన్‌’గా డీమ్యాట్‌ ఖాతా ప్రారంభించారు. ప్రస్తుతం మీరు ఎన్‌ఆర్‌ఐ. కాబట్టి, డీమ్యాట్‌ ఖాతాలో ముందుగా మీ కేవైసీని ‘నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్‌’గా మార్చుకోవాలి. ఈ ఖాతాకు అనుసంధానంగా ఉన్న బ్యాంకు ఖాతానూ ఎన్‌ఆర్‌ఓ కిందకు మార్చుకోవాలి. కొన్ని మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలు మాత్రమే అమెరికాలో ఉన్న వారికి పెట్టుబడి కోసం అనుమతిస్తున్నాయి. మీ జాబితాలో అనుమతి ఉన్న వాటిని కొనసాగిస్తూ, అనుమతి లేని ఫండ్ల నుంచి పెట్టుబడిని వెనక్కి తీసుకోండి. కేవైసీ అప్‌డేట్‌ అయ్యాకే షేర్లలో లావాదేవీలు చేసుకునేందుకు వీలవుతుంది.


2) నెలకు రూ.10వేలు మదుపు చేయాలనేది ఆలోచన. మూడేళ్ల తర్వాత ఇందులో నుంచి కొంత మొత్తం వెనక్కి తీసుకుంటాను. నష్టభయం కాస్త మధ్యస్థంగా ఉండేలా ఎలాంటి పథకాలను ఎంచుకోవాలి?

 చంద్రశేఖర్‌

పెట్టుబడులు ఎప్పుడూ దీర్ఘకాలిక దృష్టితో ఉండాలి. మీరు మూడేళ్ల తర్వాత పెట్టుబడిని వెనక్కి తీసుకుంటాను అంటున్నారు. కాబట్టి, నష్టభయం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌, ఈక్విటీ హైబ్రీడ్‌ ఫండ్లను దీనికోసం పరిశీలించవచ్చు. సాధారణంగా ఇందులో అయిదేళ్లపాటు మదుపు చేస్తే మంచి రాబడికి అవకాశం ఉంటుంది.


3) మా అబ్బాయి వయసు 5. అతని పేరుమీద ప్రతి నెలా రూ.8,000 వరకూ మదుపు చేయాలనే ఆలోచన. అతని ఉన్నత చదువులు, ఇతర ఖర్చులకు ఉపయోగపడేలా ఎలాంటి పెట్టుబడి పథకాలను ఎంపిక చేసుకోవాలి?

 దీప్తి

ముందుగా మీ అబ్బాయి భవిష్యత్‌ అవసరాలకు తగిన ఆర్థిక రక్షణ కల్పించండి. దీనికోసం కుటుంబంలో ఆర్జించే వ్యక్తి పేరుమీద తగిన మొత్తానికి టర్మ్‌ పాలసీ తీసుకోండి. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మొత్తాన్ని డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లలోకి మళ్లించండి. కనీసం 12 ఏళ్లపాటు నెలకు రూ.8వేల చొప్పున మదుపు చేస్తే 12 శాతం సగటు రాబడితో దాదాపు రూ.23,16,780 అయ్యేందుకు అవకాశం ఉంది.


4) నా వయసు 40. పదవీ విరమణ అవసరాల కోసం నెలకు రూ.6వేల వరకూ మదుపు చేయాలనే ఆలోచనతో ఉన్నాను. డిఫర్డ్‌ యాన్యుటీ పాలసీలను ఎంచుకోవడం మంచిదేనా? దీనివల్ల దీర్ఘకాలంలో ఎంత మేరకు ప్రయోజనం ఉంటుంది?

 సుధీర్‌

మీ పదవీ విరమణకు కనీసం 20 ఏళ్ల వ్యవధి ఉందనుకుందాం. మీరు డిఫర్డ్‌ యాన్యుటీ పథకాలను ఎంచుకునే బదులు పదవీ విరమణ నాటికి కొంత నిధిని సమకూర్చుకునేందుకు ప్రయత్నించండి. దీనికోసం నెలకు రూ.4వేలను ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయండి. మిగతా రూ.2వేలను పీపీఎఫ్‌లో జమ చేయండి. దీనివల్ల సగటున 11 శాతం రాబడి అందుకునే వీలుంటుంది. క్రమం తప్పకుండా మదుపు చేస్తే 20 ఏళ్లలో రూ.46,22,603 వరకూ నిధి సమకూరుతుంది. ఆ తర్వాత మీరు సిస్టమేటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌ ద్వారా నెలనెలా కొంత మొత్తాన్ని తీసుకోవచ్చు. లేదా ఈ మొత్తంతో వెంటనే పింఛను ఇచ్చే ఇమ్మీడియట్‌ యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేసేందుకు వాడుకోవచ్చు.


5) నా వయసు 56. నేను ఇప్పుడు టర్మ్‌ పాలసీ తీసుకునేందుకు వీలవుతుందా? పదవీ విరమణ తర్వాత నెలకు రూ.10 వేలు పింఛను వచ్చేలా ఎంత మొత్తం మదుపు చేయాల్సి ఉంటుంది?

కృష్ణ

ఆరోగ్య సమస్యలేమీ లేకపోతే మీరు టర్మ్‌ పాలసీ తీసుకునేందుకు ఎలాంటి అభ్యంతరాలూ ఉండవు. మీ కుటుంబ బాధ్యతలు తీరేంత వరకూ వ్యవధిని ఎంచుకోవచ్చు. మంచి క్లెయిం చెల్లింపుల చరిత్ర ఉన్న బీమా సంస్థను ఎంచుకోండి. పాలసీ తీసుకునే సమయంలో మీ ఆరోగ్య, ఆర్థిక, ఇతర సమాచారాలు ఎలాంటి తప్పులు లేకుండా పేర్కొనండి. మీకు నెలకు రూ.10వేల వరకూ పింఛను రావాలంటే కనీసం 6 శాతం రాబడినిచ్చే పథకాల్లో రూ.20లక్షల వరకూ పెట్టుబడి పెట్టాలి. 7 శాతం ఇచ్చే పథకాలను ఎంచుకుంటే రూ.17.50 లక్షల వరకూ మదుపు చేయాల్సి ఉంటుంది.

తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని