15 శాతం రాబడి సాధ్యమేనా?
బంగారం, వెండిలో మదుపు చేయడానికి ఈటీఎఫ్‌లు మంచివేనా? వీటివల్ల నష్టభయం ఉంటుందా?
* బంగారం, వెండిలో మదుపు చేయడానికి ఈటీఎఫ్‌లు మంచివేనా? వీటివల్ల నష్టభయం ఉంటుందా?
శ్రీనివాస్
* పెట్టుబడి మొత్తాన్ని ఒకే చోట మదుపు చేయడం ఎప్పుడూ మంచిది కాదు. బంగారం, వెండిలాంటి పెట్టుబడులను కేవలం వైవిధ్యం కోసం మాత్రమే ఎంచుకోవాలి. పెట్టుబడి మొత్తంలో 10 శాతానికి మించి దీనికి కేటాయించకూడదు. ఈ లోహాల్లో నేరుగా పెట్టుబడి పెట్టినా, ఈటీఎఫ్‌ల మార్గం ఎంచుకున్నా.. మార్కెట్‌లో ధరల గమనాన్ని బట్టి, మీ పెట్టుబడి విలువ మారుతుంది. ఈటీఎఫ్‌లో మదుపు చేయాలంటే డీమ్యాట్ ఖాతా ఉండాలి.
* నా వయసు 56. మరో నాలుగేళ్ల వరకూ నెలకు రూ.25వేలు మదుపు చేయాలని అనుకుంటున్నాను. ఈ మొత్తం పదవీ విరమణ తర్వాత ఉపయోగపడాలి. దీనికోసం ఏం చేయాలి? ఒకేసారి మొత్తం డబ్బును తీసుకోకుండా పింఛనులాగా రావాలంటే ఎలా?
ప్రసాద్
* ఇంకా నాలుగేళ్ల వ్యవధి ఉందంటున్నారు కాబట్టి, కొంచెం నష్టభయం తక్కువగా ఉన్న బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ లేదా హైబ్రీడ్ ఈక్విటీ ఫండ్లను ఎంచుకొని క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేయండి. మీ పదవీ విరమణ తర్వాత క్రమానుగతంగా నెలనెలా కొంత డబ్బు పింఛనులా వచ్చే ఏర్పాటు చేసుకోవచ్చు.
* నేను 17 ఏళ్ల క్రితం ఎండోమెంట్ పాలసీని తీసుకున్నాను. ఏడాదికి రూ.16 వేలు ప్రీమియం. మూడేళ్ల నుంచి ఈ పాలసీకి ప్రీమియం చెల్లించడం లేదు. ఇప్పుడు ఈ పాలసీని పూర్తిగా రద్దు చేసుకోవాలా? ప్రీమియం చెల్లించి తిరిగి పునరుద్ధరించుకోవడం మంచిదా?
కల్యాణ్
* ఇప్పటికే 15 ఏళ్లు ప్రీమియం చెల్లించారు కాబట్టి, మీ పాలసీకి మంచి బోనస్ కలిసి ఉంటుంది. ఈ సమయంలో పాలసీని రద్దు చేసుకోవడం మంచిది కాదు. నష్టపోతారు. అందువల్ల ముందుగా బాకీ ఉన్న ప్రీమియాన్ని చెల్లించి, మీ పాలసీని పునరుద్ధరించుకోండి. మీ కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించేందుకు మీ వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల వరకూ టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా బీమా పాలసీని తీసుకోండి.
* మా అమ్మాయి వయసు 15. తనకు ఆరేడేళ్ల తర్వాత ఉపయోగపడేలా ఒకేసారి రూ.10 లక్షల వరకూ మదుపు చేయాలని అనుకుంటున్నాం. డబ్బు రెట్టింపు అయ్యేలా ఎలాంటి పథకాలను ఎంచుకోవాలి?
మాధవి
* ఆరేడేళ్ల తర్వాత డబ్బు అవసరం అంటున్నారు కాబట్టి, మీరు ఈక్విటీ ఆధారిత పెట్టుబడులను పరిశీలించవచ్చు. దీనికోసం డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవచ్చు. ఆరు నుంచి ఏడేళ్లలో మీ డబ్బు రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయి. అయితే, కొంత నష్టభయాన్నీ భరించాల్సి వస్తుంది. మీరు రూ.10లక్షలను ఒకేసారి వీటిలో మదుపు చేయొద్దు. ముందుగా లిక్విడ్ ఫండ్లలో ఈ మొత్తాన్ని జమ చేయండి. ఆ తర్వాత 6 నుంచి 9 నెలల వ్యవధిలో క్రమానుగత బదిలీ విధానంలో ఈక్విటీ ఫండ్లలో మదుపు చేయండి. డబ్బు అవసరమైన రెండేళ్ల ముందు నుంచీ క్రమానుగతంగా ఈక్విటీల్లో నుంచి వెనక్కి తీసుకొని, డెట్ ఫండ్లలోకి మళ్లించాలి. ఇలా చేయడం వల్ల మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు అవకాశాలున్నాయి. ఎప్పటికప్పుడు మీ పెట్టుబడులను సమీక్షించుకోవడం మర్చిపోవద్దు.
* నెలకు రూ.20వేల వరకూ మదుపు చేయాలని ఆలోచన. కనీసం 15 శాతం వరకూ రాబడి రావాలంటే ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి?
అనిల్
* గతంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు 15 శాతం రాబడి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. కానీ, భవిష్యత్తులోనూ ఇలాంటి రాబడులు వస్తాయనే అంచనాలు వేయలేం. ప్రస్తుత పరిస్థితుల్లో 11-12 శాతం వరకూ రాబడిని ఆశించవచ్చు. మీకు అధిక రాబడి రావాలంటే నష్టభయం భరించాల్సి ఉంటుంది. మీ పెట్టుబడి జాబితాల్లో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఫండ్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. దీర్ఘకాలంలో ఇవి మంచి రాబడిని అందించేందుకు అవకాశం ఉంది. అదే సమయంలో నష్టభయమూ అధికంగానే ఉంటుందని గమనించాలి.
తుమ్మ బాల్‌రాజ్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
ఆక్సిటోసిన్ లవ్ హార్మోన్ కాదా?.. శాస్త్రవేత్తల పరిశోధనల్లో కీలక విషయాలు..
-
Politics News
Bachula Arjunudu: తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడికి తీవ్ర అస్వస్థత
-
Politics News
Andhra News: ప్రభుత్వ ఉద్యోగివా.. వైకాపా కార్యకర్తవా?
-
India News
మైనర్లను పెళ్లాడిన వారికి కటకటాలే.. వేలమంది భర్తలకు శిక్ష తప్పదు: అస్సాం సీఎం హెచ్చరిక
-
Politics News
Vatti Vasanth Kumar: మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ కన్నుమూత
-
India News
Mughal Garden: మొగల్ గార్డెన్స్ ఇక.. ‘అమృత్ ఉద్యాన్’