Q-A: ఆరోగ్య బీమా టాపప్‌ సరిపోతుందా?

మా అబ్బాయి పేరుమీద నెలకు రూ.15వేల వరకూ వరకూ మదుపు చేద్దామని అనుకుంటున్నా. కనీసం 10 ఏళ్లపాటు పెట్టుబడి పెట్టేందుకు అనువైన పథకాలేమున్నాయి? ఎంత మొత్తం జమయ్యే అవకాశం ఉంది?

Updated : 08 Feb 2023 20:26 IST

* మా అబ్బాయి పేరుమీద నెలకు రూ.15వేల వరకూ వరకూ మదుపు చేద్దామని అనుకుంటున్నా. కనీసం 10 ఏళ్లపాటు పెట్టుబడి పెట్టేందుకు అనువైన పథకాలేమున్నాయి? ఎంత మొత్తం జమయ్యే అవకాశం ఉంది?
చంద్రమౌళి
* ముందుగా మీ అబ్బాయి భవిష్యత్‌ అవసరాలకు తగిన రక్షణ కల్పించండి. దీనికోసం మీ పేరుపైన మీ వార్షికాదాయానికి 10-12 రెట్ల విలువైన టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని తీసుకోండి. పెట్టుబడులు ఎప్పుడూ మీ పేరుమీదే ఉండేలా చూసుకోవాలి. డబ్బు జమైన తర్వాత మీ అబ్బాయి అవసరాలకు వినియోగించుకోవచ్చు. మీకు పదేళ్ల వ్యవధి ఉంది కాబట్టి, మీ పెట్టుబడిపై మంచి రాబడినిచ్చే పథకాలను ఎంచుకోవాలి. దీనికోసం డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లను పరిశీలించవచ్చు. నెలకు రూ.15వేల చొప్పున 10 ఏళ్లపాటు మదుపు చేస్తే సగటున 12 శాతం వార్షిక రాబడి అంచనాతో రూ.31,58,772 జమయ్యే అవకాశముంది.


* మూడు నెలల క్రితం ఉద్యోగంలో చేరాను. బృంద ఆరోగ్య బీమా పాలసీలో రూ.5లక్షల వరకూ రక్షణ ఉంది. సొంతంగా ఒక పాలసీ తీసుకోవడం కన్నా, రూ.5లక్షలకు పైన టాపప్‌ తీసుకోవడం మంచిదని చెప్పారు. నిజమేనా?

 సాయిప్రకాశ్‌
* టాపప్‌ పాలసీ తీసుకున్నప్పుడు సాధారణంగా రూ.5లక్షల బిల్లు వస్తే ఆ పైన ఉన్న మొత్తానికే టాపప్‌ పాలసీ పరిహారాన్నిస్తుంది. సంస్థ ఇచ్చే బీమా పాలసీ మీరు ఉద్యోగంలో ఉన్నన్ని రోజులే వర్తిస్తుంది. ఉద్యోగం మారినా, కోల్పోయినా ఈ రక్షణ దూరం అవుతుంది. ఆ సమయంలో మీ కుటుంబ అనారోగ్య సమస్యలు వస్తే మీ జేబు నుంచి ఆ మొత్తాన్ని భరించాల్సి వస్తుంది. కాబట్టి, మీరు ప్రత్యేకంగా ఒక బీమా పాలసీ తీసుకొని, దానిపై టాపప్‌ చేసుకుంటే మంచిది.


* సొంతిల్లు కొనాలని అనుకుంటున్నాం. రూ.50లక్షల వరకూ రుణ అర్హత ఉంది. మాకు రూ.40 లక్షల వరకూ చాలు. అదనంగా రుణం తీసుకోవడం మంచిదేనా? రూ.10లక్షలను ఎక్కడైనా మదుపు చేస్తే మంచి రాబడి వస్తుందా?

 శ్వేత
* మన దగ్గరున్న మిగులు డబ్బుతోనే పెట్టుబడులు పెట్టాలి. అప్పు చేసి మదుపు చేయాలనుకోవడం పొరపాటు. ప్రస్తుతం గృహరుణ వడ్డీ రేట్లు 9 శాతం వరకూ ఉన్నాయి. మున్ముందు ఇంకా పెరిగే అవకాశాలు లేకపోలేదు. అప్పు చేసి పెట్టుబడి పెట్టినప్పుడు కనీసం 10-12 శాతం రాబడిని ఆర్జించాలి. అన్ని వేళలా ఇది సాధ్యం కాదు. పైగా కాస్త నష్టభయం భరించాలి. దీనికన్నా.. మీరు రూ.40లక్షల రుణమే తీసుకోండి. రూ.10లక్షలకు చెల్లించాల్సిన ఈఎంఐ ఎంతో లెక్కించండి. ఆ విలువ మేరకు మీరు మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేయడం మంచిది.


* నేను చిరు వ్యాపారిని. ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌)లో వీలున్నప్పుడల్లా కొంత మొత్తం జమ చేయొచ్చా? దీనికన్నా మెరుగైన పథకాలేమైనా అందుబాటులో ఉన్నాయా?

 వెంకట్‌
* దీర్ఘకాలంపాటు పొదుపు చేసుకునేందుకు అవకాశం ఉన్న సురక్షిత పథకం ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌). దీనికి ప్రభుత్వ హామీ ఉంటుంది. దీనిపై వచ్చిన వడ్డీకి ఎలాంటి పన్నూ ఉండదు. 15 ఏళ్లపాటు పొదుపును కొనసాగించాలి. ప్రస్తుతం వార్షిక వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. ఇందులో ఏడాదికి 12 సార్లు డబ్బు జమ చేయొచ్చు. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మొత్తంలో సగం పీపీఎఫ్‌లో జమ చేయండి. మిగతా మొత్తాన్ని మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టుకోవచ్చు.
తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని