చదువుల ఖర్చులు తట్టుకునేలా...

బంగారం, వెండిలో మదుపు చేసేందుకు ఈటీఎఫ్‌లు మంచివేనా? వీటికి ప్రత్యామ్నాయంగా ఏం చేయొచ్చు? నెలకు రూ.10వేలు మదుపు చేస్తే 8 ఏళ్ల తర్వాత ఎంత మొత్తం వస్తుంది?    

Published : 24 Feb 2023 00:15 IST

* బంగారం, వెండిలో మదుపు చేసేందుకు ఈటీఎఫ్‌లు మంచివేనా? వీటికి ప్రత్యామ్నాయంగా ఏం చేయొచ్చు? నెలకు రూ.10వేలు మదుపు చేస్తే 8 ఏళ్ల తర్వాత ఎంత మొత్తం వస్తుంది?    

రాజేశ్వరి

* బంగారం, వెండిలో ఈటీఎఫ్‌ల రూపంలో మదుపు చేసేందుకు అవకాశం ఉంది. బంగారంలో గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్లూ అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్‌ అవసరాల కోసం వీటిని ఎంచుకోవచ్చు. పెట్టుబడి గురించి అనుకుంటే ఇవి అంత ప్రయోజనకరం కాదు. ఇలాంటప్పుడు బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌, హైబ్రిడ్‌ ఈక్విటీ ఫండ్లను పరిశీలించవచ్చు. 8 ఏళ్ల వ్యవధి ఉంది కాబట్టి, మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది. నెలకు రూ10వేల చొప్పున 8 ఏళ్లపాటు మదుపు చేస్తే 10 శాతం రాబడి అంచనాతో రూ.13,72,300 అయ్యేందుకు అవకాశం ఉంది.


* మూడేళ్ల మా అమ్మాయి పేరు మీద నెలకు రూ.15వేల వరకూ పెట్టుబడి పెట్టాలనేది ఆలోచన. దీనికోసం నా ప్రణాళిక ఎలా ఉండాలి?

సుధాకర్‌

* ముందుగా మీ అమ్మాయి భవిష్యత్‌ అవసరాలకు తగిన రక్షణ కల్పించండి. ఇందుకోసం మీ పేరుపై తగిన మొత్తానికి జీవిత బీమా పాలసీని తీసుకోండి. ప్రస్తుతం విద్యా ద్రవ్యోల్బణం అధికంగా ఉంది. భవిష్యత్తులోనూ ఇది పెరిగే అవకాశాలే ఎక్కువ. మీరు ఎక్కడ మదుపు చేసినా.. విద్యా ద్రవ్యోల్బణానికి మించిన రాబడి వచ్చేలా చూసుకోవాలి. మరో 15 ఏళ్ల తర్వాత మీ అమ్మాయి ఉన్నత చదువుల కోసం డబ్బు అవసరం. కాబట్టి, మీరు డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లలో మదుపు చేయండి. కాస్త నష్టభయం ఉన్నప్పటికీ మంచి రాబడి వచ్చే అవకాశాలు ఎక్కువ. నెలకు రూ.15వేలు కనీసం 15 ఏళ్లు మదుపు చేస్తే 12 శాతం రాబడితో రూ.67,10,348 అయ్యే వీలుంది.


* నెలకు రూ.40వేల జీతం వస్తోంది. టర్మ్‌ పాలసీ తీసుకోవాలనేది ఆలోచన. నా వయసు 28. ఎంత మొత్తానికి పాలసీ తీసుకోవాలి? ప్రతి నెలా రూ.5 వేల వరకూ మదుపు చేయాలంటే ఏ పథకాలు ఎంచుకోవాలి?

పవన్‌

* మీ వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల వరకూ ఉండేలా జీవిత బీమా పాలసీ తీసుకోవాలి. తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ ఇచ్చే టర్మ్‌ పాలసీలను ఇందుకోసం పరిశీలించవచ్చు. మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు కంపెనీల నుంచి బీమా పాలసీలను తీసుకోండి. వ్యక్తిగత ప్రమాద బీమా, ఆరోగ్య బీమా పాలసీలూ ఉండాలి. పెట్టుబడి పెట్టాలనుకుంటున్న రూ.5వేలలో రూ.3వేలను డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లలో సిప్‌ చేయండి. మిగతా రూ.2వేలను పీపీఎఫ్‌లో జమ చేయండి.


* నా వయసు 65. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వ్యవధి ముగిసి, రూ.2లక్షలు వెనక్కి వచ్చాయి. వీటిని తిరిగి ఎఫ్‌డీ చేయాలా? కనీసం 9 శాతం రాబడినిచ్చేలా ఏదైనా ఇతర పథకాలున్నాయా?

మోహన్‌

* సురక్షితంగా ఉంటూ 9 శాతం రాబడినిచ్చే పథకాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. సీనియర్‌ సిటిజన్లకు ప్రస్తుతం కొన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 7.50శాతం వరకూ వడ్డీనిస్తున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీంను పరిశీలించవచ్చు. ఇందులో 8 శాతం వడ్డీ లభిస్తోంది.

తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని