నెలకు రూ.20వేలు రావాలంటే..

జాతీయ పింఛను పథకంలో నెలకు రూ.10,000 జమ చేయాలని అనుకుంటున్నాను.

Updated : 03 Nov 2023 00:46 IST

జాతీయ పింఛను పథకంలో నెలకు రూ.10,000 జమ చేయాలని అనుకుంటున్నాను. ఇది మంచి పథకమేనా? ఇది కాకుండా బీమా సంస్థలు అందించే యాన్యుటీ పాలసీలు తీసుకోవచ్చా? నా వయసు 49. ఏ పథకాలను ఎంచుకోవాలి?

దయాకర్‌

జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌) మంచి పథకమే. ఇందులో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50వేల వరకూ జమ చేసి, సెక్షన్‌ 80సీసీడీ కింద పన్ను మినహాయింపు పొందేందుకు వీలుంది. ఇంతకన్నా అధికంగానూ జమ చేయొచ్చు. కానీ, పన్ను మినహాయింపు రూ.50వేలకే పరిమితం. మీరు ఏడాదికి రూ.50వేలు ఎన్‌పీఎస్‌లో జమ చేయండి. మిగతా మొత్తాన్ని డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో ఎస్‌ఐపీ ద్వారా మదుపు చేయండి. పదవీ విరమణ చేసిన తర్వాత ఈ రెండు పథకాల్లో జమైన మొత్తంతో అప్పటి పరిస్థితులను బట్టి, బీమా సంస్థల నుంచి ఇమ్మీడియట్‌ యాన్యుటీ పథకాలను కొనుగోలు చేయొచ్చు. మీకు అనుగుణంగా ఉన్న ఇతర పథకాల్లోనూ పెట్టుబడి పెట్టుకోవచ్చు.

ఇటీవలే ఉద్యోగంలో చేరాను. నెలకు రూ.8 వేల వరకూ పెట్టుబడి పెట్టి, 10 ఏళ్ల తర్వాత వెనక్కి తీసుకోవాలనేది ఆలోచన. ఎలాంటి పథకాల్లో మదుపు చేయాలి? ఎంత మొత్తం వస్తుంది?

 శ్రీవిద్య

పదేళ్ల సమయం ఉంది కాబట్టి, అధిక రాబడినిచ్చేలా పెట్టుబడి ప్రణాళిక వేసుకోవచ్చు. దీనికి డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేయొచ్చు. మీరు 10 ఏళ్లపాటు నెలకు రూ.8వేల చొప్పున పెట్టుబడి పెడితే.. 12 శాతం సగటు వార్షిక రాబడితో రూ.16,84,678 అయ్యేందుకు అవకాశం ఉంది. పెట్టుబడులను ఎప్పుటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలి.

ఏడాదిన్నరలో పదవీ విరమణ చేయబోతున్నాను. ఇప్పటి నుంచి నెలకు రూ.50వేల వరకూ పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను. రిటైర్‌ అయ్యాక వీటికి మరో రూ.10 లక్షలు కలిపి, ఆ తర్వాత నెలకు రూ.20వేల చొప్పున వెనక్కి తీసుకోవాలని అనుకుంటున్నాను. దీనికోసం ఏం చేయాలి?

 హరికృష్ణ

మీకు ఏడాదిన్నర సమయం ఉంది కాబట్టి, మీరు మదుపు చేసే మొత్తమే అప్పటికి రూ.9లక్షలు అవుతుంది. నెలకు రూ.50వేల చొప్పున 9 శాతం రాబడినిచ్చే పథకాల్లో మదుపు చేస్తే రూ.9,60,000 అవుతాయి. దీనికి మీరు రూ.10లక్షలు జమ చేస్తే రూ.19,60,000. మీకు నెలకు రూ.20వేలు అంటే ఏడాదికి రూ.2,40,000 అవసరం. మీ దగ్గర ఉన్న మొత్తంపై 12.25 శాతం రాబడి వస్తే నెలకు రూ.20వేలు అందుకోవచ్చు. కానీ, ఇది సాధ్యం కాదు. మీ దగ్గర రూ.30లక్షలు ఉంటే.. 8 శాతం రాబడితో మీరు అనుకుంటున్న మొత్తాన్ని సులభంగా సాధించవచ్చు. వీలైతే పెట్టుబడి పెంచుకునేందుకు ప్రయత్నించండి. పదవీ విరమణ నాటికి మీ దగ్గర ఉన్న డబ్బును సగం సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీంలో జమ చేయండి. మిగతా మొత్తాన్ని బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లలో మదుపు చేసి, ఎస్‌డబ్ల్యూపీ రూపంలో అవసరమైన మేరకు తీసుకోవచ్చు.

నా వయసు 33. ప్రైవేటు ఉద్యోగిని. మూడేళ్ల మా అమ్మాయి భవిష్యత్‌ అవసరాల కోసం నెలకు రూ.8వేల వరకూ మదుపు చేద్దామని ఆలోచిస్తున్నాను. ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి? 

సుధీర్‌

ముందుగా మీ పాప భవిష్యత్‌ అవసరాలకు తగిన రక్షణ కల్పించండి. అందుకోసం మీ పేరుపైన తగిన మొత్తానికి టర్మ్‌ పాలసీ తీసుకోండి. మీరు పెట్టే పెట్టుబడి విద్యా ద్రవ్యోల్బణాన్ని మించి ఉండేలా చూసుకోండి. మీ పెట్టుబడి మొత్తం నుంచి రూ.3వేలను సుకన్య సమృద్ధి యోజనలో జమ చేయండి. మిగతా మొత్తాన్ని ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడి పెట్టండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే 15 ఏళ్లలో 10.5 శాతం సగటు రాబడితో రూ.31,73,763 చేతికి వచ్చే అవకాశం ఉంది.

తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని