పీఎఫ్‌ ఖాతా కొనసాగించాలా?

నేను రెండేళ్ల క్రితం పదవీ విరమణ చేశాను. నా పీఎఫ్‌ ఖాతాలో రూ.22 లక్షలను ఇప్పటికీ కొనసాగిస్తున్నాను. పీఎఫ్‌ జమ అగిన మూడేళ్ల తర్వాత వడ్డీ చెల్లించరు కదా.

Published : 08 Dec 2023 00:23 IST

  • నేను రెండేళ్ల క్రితం పదవీ విరమణ చేశాను. నా పీఎఫ్‌ ఖాతాలో రూ.22 లక్షలను ఇప్పటికీ కొనసాగిస్తున్నాను. పీఎఫ్‌ జమ అగిన మూడేళ్ల తర్వాత వడ్డీ చెల్లించరు కదా. ఇప్పుడు ఈ మొత్తాన్ని తీసుకోవాలని అనుకుంటున్నాను. మంచి రాబడి వచ్చేలా ఎక్కడ పెట్టుబడి పెట్టాలి?

కృష్ణ

మీ భవిష్య నిధి ఖాతాలోని డబ్బు మూడేళ్లు పూర్తయ్యాకే తీసుకోండి. మీకు ఈ డబ్బుతో కనీసం అయిదేళ్ల పాటు అవసరం లేదనుకుంటే.. ఈ మొత్తాన్ని బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌, హైబ్రిడ్‌ ఈక్విటీ ఫండ్లలో జమ చేయండి.   నెలనెలా ఆదాయం కావాలనుకుంటే.. క్రమానుగతంగా మీకు కావాల్సిన మొత్తాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి. ఈ ఫండ్లలో మదుపు చేసినప్పుడు కాస్త నష్టభయం ఉంటుందని గమనించాలి.

  • మా అమ్మాయి వయసు 14. తన భవిష్యత్‌ అవసరాలకు ఉపయోగపడేలా కనీసం 8 ఏళ్లపాటు నెలకు రూ.30వేల వరకూ మదుపు చేయాలనే ఆలోచన ఉంది. దీనికోసం  ప్రణాళిక ఎలా ఉండాలి?

లావణ్య

ముందుగా మీ అమ్మాయి భవిష్యత్‌ అవసరాల కోసం తగిన రక్షణ కల్పించండి. దీనికోసం కుటుంబంలో ఆర్జించే వ్యక్తి పేరుమీద తగిన మొత్తానికి జీవిత బీమా తీసుకోవాలి. మీరు మదుపు చేయాలనుకుంటున్న మొత్తాన్ని డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లలో మదుపు చేయండి. మీ అమ్మాయి ఉన్నత చదువుకు డబ్బు అవసరమయ్యే రెండు మూడేళ్ల నుంచే ఈక్విటీ ఫండ్లలో నుంచి క్రమంగా డబ్బును వెనక్కి తీసుకొని, సురక్షిత పథకాలకు మళ్లించాలి. మీరు నెలకు రూ.30వేల చొప్పున 8 ఏళ్లపాటు క్రమం తప్పకుండా మదుపు చేస్తే.. 12 శాతం రాబడితో రూ.49,59,236 చేతికి వచ్చే అవకాశం ఉంది.

  • నెలకు రూ.10 వేల వరకూ మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను. మరో రూ.4వేలు కావాలనుకున్నప్పుడు వెనక్కి తీసుకునే పథకాల్లో జమ చేయాలనుకుంటున్నాను. దీనికోసం ఎలాంటి పథకాలను ఎంచుకోవాలి? కనీసం 15 ఏళ్లపాటు మదుపు చేస్తే ఎంత మొత్తం జమ అవుతుంది?

రాకేశ్‌

మీరు మదుపు చేయాలనుకుంటున్న రూ.10 వేలను క్రమానుగత పెట్టుబడి విధానంలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టండి. కనీసం అయిదేళ్లపాటు పెట్టుబడిని కొనసాగించండి.

నెలకు రూ.10వేల చొప్పున 15 ఏళ్లపాటు మదుపు చేస్తే 12 శాతం సగటు రాబడితో రూ.50,10,393 అయ్యేందుకు అవకాశం ఉంది. ఇక రూ.4వేలను బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లలో మదుపు చేయండి. కనీసం రెండేళ్ల తర్వాతే ఈ పెట్టుబడిని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయండి.

తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని