టర్మ్‌... యులిప్‌ ఏది మేలు?

 నా వయసు 36. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలు తీసుకోలేదు. రూ.50లక్షల విలువైన టర్మ్‌ పాలసీ తీసుకోవడంతోపాటు, నెలకు రూ.10వేల వరకూ మదుపు చేయాలని ఆలోచన. వీటికి బదులుగా యులిప్‌ తీసుకుంటే బాగుంటుందని అంటున్నారు.

Updated : 05 Jan 2024 06:09 IST

 నా వయసు 36. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలు తీసుకోలేదు. రూ.50లక్షల విలువైన టర్మ్‌ పాలసీ తీసుకోవడంతోపాటు, నెలకు రూ.10వేల వరకూ మదుపు చేయాలని ఆలోచన. వీటికి బదులుగా యులిప్‌ తీసుకుంటే బాగుంటుందని అంటున్నారు. నిజమేనా?

- రవి

  •  మీ వార్షికాదాయానికి కనీసం 10 నుంచి 12 రెట్ల వరకూ జీవిత బీమా పాలసీ ఉండేలా చూసుకోవాలి. దీనికోసం తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ కల్పించే టర్మ్‌ పాలసీని పరిశీలించవచ్చు. మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు కంపెనీల నుంచి పాలసీలు తీసుకోండి. ఇక మీరు మదుపు చేయాలనుకుంటున్న మొతాన్ని ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలోకి మళ్లించండి. యూనిట్‌ ఆధారిత బీమా పాలసీలు (యులిప్‌)లతో పోలిస్తే ఇదే మంచిది. తక్కువ ఖర్చులు, రుసుములు ఉంటాయి. అవసరమైనప్పుడు వెంటనే పెట్టుబడిని ఉపసంహరించుకునే వీలూ ఉంటుంది. దీర్ఘకాలంలో మంచి రాబడికీ అవకాశం ఉంటుంది.

నేను త్వరలోనే పదవీ విరమణ చేయబోతున్నాను. ఈపీఎఫ్‌లో రూ.28 లక్షల వరకూ ఉన్నాయి. పదవీ విరమణ తర్వాత నాకు వచ్చే ప్రయోజనాలను మంచి రాబడి వచ్చేలా ఎలా మదుపు చేయాలి?

- సత్యనారాయణ

  • మీకు నెలకు ఎంత మొత్తం డబ్బు అవసరం అవుతుందో ముందు లెక్క  చూసుకోండి. మీ దగ్గర రూ.28 లక్షలే ఉండి, ఇతర ఆదాయ మార్గాలేమీ లేకపోతే.. ఈ డబ్బు మీ అవసరాలకు సరిపోకపోవచ్చు. పదవీ విరమణ తర్వాత కనీసం 20 ఏళ్లపాటు ఆదాయం వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి. మీ పదవీ విరమణ ప్రయోజనాలు అందిన తర్వాత.. రూ.10 లక్షలను పోస్టాఫీసు పెద్దల పొదుపు పథకంలో జమ  చేయండి. మిగతా మొత్తాన్ని బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లలో మదుపు చేయండి. ఇందులో కాస్త నష్టభయం ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో సురక్షిత పథకాలతో పోలిస్తే మంచి రాబడి అందుతుంది.

మా అమ్మాయి వయసు 11. తన పేరుమీద నెలకు రూ.25వేల వరకూ పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాం. కనీసం 13 ఏళ్ల తర్వాత ఈ డబ్బుతో అవసరం ఉంటుంది. కొంత మేరకు బంగారంలోనూ మదుపు చేయాలని ఆలోచన. దీనికోసం ఎలాంటి ప్రణాళిక ఉండాలి?

- శ్రీకాంత్‌

  • ముందుగా మీ అమ్మాయి భవిష్యత్‌ అవసరాలకు తగిన రక్షణ కల్పించేందుకు ప్రయత్నించండి. దీనికోసం మీ పేరుపైన తగినంత జీవిత బీమా పాలసీని తీసుకోండి. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న రూ.25వేల నుంచి రూ.5వేలను బంగారం ఫండ్లకి కేటాయించండి. మిగతా రూ.20వేలను డైవర్సిఫైడ్‌ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయండి. ఇలా చేయడం వల్ల 13 ఏళ్లలో 11 శాతం సగటు రాబడితో రూ.87,28,475 అయ్యేందుకు అవకాశం ఉంది. మీకు డబ్బు అవసరమయ్యే మూడేళ్ల ముందు నుంచీ ఈ మొత్తాన్ని సురక్షిత పథకాల్లోకి మళ్లిస్తూ ఉండాలి.

నేను చిరు వ్యాపారిని. ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడంతోపాటు, నెలకు రూ.10వేల వరకూ సురక్షితంగా ఉండే పథకాల్లో మదుపు చేయాలని అనుకుంటున్నాను. పీపీఎఫ్‌ ఎంచుకోవచ్చా?

- పూర్ణచంద్ర

  • ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం మంచి విషయమే. మీ కుటుంబానికి అంతటికీ కలిపి వర్తించేలా కనీసం రూ.5 లక్షల వరకూ పాలసీ ఉండాలి. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మొత్తంలో రూ.3వేలను ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌)లో జమ చేయండి. మిగతా రూ.7వేలను హైబ్రిడ్‌ ఈక్విటీ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేయండి. ఇలా 15 ఏళ్లపాటు క్రమం తప్పకుండా చేస్తే.. 10.5 శాతం రాబడి అంచనాతో రూ.43,83,760 అయ్యే అవకాశం ఉంది.

తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని