నెలకు రూ.20వేలతో..

నాలుగేళ్ల క్రితం ఆన్‌లైన్‌లో రూ.40 లక్షల టర్మ్‌ పాలసీ తీసుకున్నాను. ఇప్పుడు నా వయసు 49. మరో రూ.60 లక్షల వరకూ పాలసీ తీసుకోవచ్చా?

Updated : 12 Jan 2024 05:55 IST

  • నాలుగేళ్ల క్రితం ఆన్‌లైన్‌లో రూ.40 లక్షల టర్మ్‌ పాలసీ తీసుకున్నాను. ఇప్పుడు నా వయసు 49. మరో రూ.60 లక్షల వరకూ పాలసీ తీసుకోవచ్చా? నాకు నెలకు రూ.95 వేలు వస్తున్నాయి. రూ. కోటి పాలసీకి నేను అర్హుడినేనా?

శర్మ

  • సాధారణంగా బీమా సంస్థలు పాలసీ నిబంధనలు రూపొందించేటప్పుడు కొన్ని వివరాలను ప్రత్యేకంగా చూస్తాయి. మీ వయసు ఆధారంగా వార్షికాదాయంలో 10 -12 రెట్ల వరకూ బీమా పాలసీని ఇచ్చే అవకాశం ఉంటుంది. మీ వేతనం రూ.95 వేలు అంటున్నారు కాబట్టి, మీరు రూ.కోటి విలువైన పాలసీని తీసుకోవచ్చు. ఇప్పటికే మీకు పాలసీ ఉన్న సంస్థ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న మరో కంపెనీని ఎంచుకోండి. కొత్త పాలసీని మీకు 65 ఏళ్లు వచ్చే వరకూ వ్యవధి ఉండేలా తీసుకోండి. కొత్త పాలసీని తీసుకునేటప్పుడు పాత పాలసీకి సంబంధించిన వివరాలు తప్పనిసరిగా తెలియజేయాలి. మీ ఆహార, ఆరోగ్య, ఆర్థిక వివరాలనూ ఎలాంటి తప్పుల్లేకుండా దరఖాస్తులో పేర్కొనడం మర్చిపోవద్దు.

  • మూడేళ్ల తర్వాత సొంతిల్లు కొనాలనే ఆలోచన ఉంది. రూ.60 లక్షల వరకూ గృహరుణం తీసుకోవాలని ఆలోచన. అప్పటి వరకూ నెలకు రూ. లక్ష వరకూ పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాం. దీనికోసం ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి?

 శ్రీకాంత్‌

  • మీకు మూడేళ్ల వ్యవధి ఉంది కాబట్టి, పెట్టుబడి సురక్షితంగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. మీరు మదుపు చేయాలనుకుంటున్న మొత్తాన్ని బ్యాంకులో రికరింగ్‌ డిపాజిట్‌ చేసుకోండి. కాస్త నష్టభయం ఉన్నా ఇబ్బంది లేదు అనుకుంటే.. బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లను పరిశీలించవచ్చు. మీరు గృహరుణం తీసుకున్నప్పుడు దానికి అనుబంధంగా లోన్‌ కవర్‌ టర్మ్‌ పాలసీ తీసుకోవడం మర్చిపోవద్దు.

  • నేను పనిచేస్తున్న చోట బృంద ఆరోగ్య బీమా పాలసీలో భాగంగా రూ.5 లక్షల వరకూ రక్షణ ఉంది. ఇప్పుడు నేను సొంతంగా మరో పాలసీ తీసుకోవాలా? టాపప్‌ సరిపోతుందా?

ప్రవీణ్‌

  • బృంద ఆరోగ్య బీమా పాలసీ కొన్ని నిబంధనల మేరకు రక్షణ కల్పిస్తుంది. మీరు ఆ సంస్థలో ఉద్యోగం చేస్తున్నన్ని రోజులే బీమా వర్తిస్తుంది. ఉద్యోగం మారినప్పుడు రక్షణ కోల్పోతారు. కాబట్టి, బృంద పాలసీని ఎప్పుడూ ప్రాథమిక పాలసీగా భావించకూడదు. కాబట్టి, మీరు సొంతంగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకునే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత దానిపైన టాపప్‌ పాలసీని తీసుకోవడం ఉత్తమం.

  • మా అమ్మాయి వయసు 8. తన పేరు మీద నెలకు రూ.20 వేల వరకూ మదుపు చేద్దామని అనుకుంటున్నాం.12 ఏళ్ల పాటు మదుపు చేసేందుకు అనువైన పథకాలేమున్నాయి? ఎంత మొత్తం జమ అవుతుంది?

శ్వేత

  • ముందుగా మీ అమ్మాయి భవిష్యత్‌ ఆర్థిక అవసరాలకు తగిన రక్షణ కల్పించండి. దీనికోసం కుటుంబ పెద్దపై తగినంత మొత్తానికి జీవిత బీమా పాలసీ తీసుకోండి. దీనికోసం టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని ఎంచుకోండి. రూ.20 వేలను డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌) ద్వారా మదుపు చేయండి.  12 ఏళ్లపాటు నెలకు రూ.20వేల చొప్పున మదుపు చేస్తే సగటు వార్షిక రాబడి 12 శాతం అంచనాతో రూ.57,91,950 అయ్యేందుకు అవకాశం ఉంది.

తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని