LIC IPO: మే 4న ఎల్ఐ‌సీ ఐపీఓ.. 17న లిస్టింగ్‌.. 10 పాయింట్లలో పూర్తి వివరాలు

మే 17న ఎల్‌ఐసీ షేర్లు (LIC Shares) స్టాక్‌ మార్కెట్‌లో నమోదు కానున్నాయి.....

Updated : 04 May 2022 08:44 IST

దిల్లీ‌: మదుపర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) పబ్లిక్‌ ఇష్యూ (LIC IPO) తేదీలను ప్రభుత్వం ఏప్రిల్‌ 27న అధికారికంగా ప్రకటించింది. ముందుగా వచ్చిన సమాచారం ప్రకారం.. షేర్ల సబ్‌స్క్రిప్షన్‌ ప్రక్రియ మే 4న ప్రారంభమై మే 9న ముగియనుంది. మే 17న ఎల్‌ఐసీ షేర్లు (LIC Shares) స్టాక్‌ మార్కెట్‌లో నమోదు కానున్నాయి. మంగళవారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు  ‘పెట్టుబడులు- ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం’ (DIPAM‌) కార్యదర్శి తుహిన్‌కాంత పాండే వెల్లడించారు. 

  1. సంస్థలో 3.5 శాతం వాటాకు సమానమైన 22.13 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా ప్రభుత్వం రూ.21,000 కోట్లు ఆర్జించనుంది. భారత ఈక్విటీ మార్కెట్‌ చరిత్రలో ఇదే అతిపెద్ద ఐపీఓ (IPO).
  2. ధరల శ్రేణిని ఒక్కో షేరుకు రూ.902-949గా నిర్ణయించారు. కనీసం 15 షేర్లకు బిడ్‌ వేయాల్సి ఉంటుంది. అంటే గరిష్ఠ ధర వద్ద మదుపర్లు కనీసం రూ.14,235 పెట్టుబడిగా పెట్టాలి. విజయవంతమైన బిడ్డర్ల డీమ్యాట్‌ ఖాతాల్లోకి షేర్లు మే 16న బదిలీ అవుతాయి. మే 17న  స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో షేర్లు నమోదు కానున్నాయి.
  3. రిటైల్‌ విభాగంలో తన పాలసీదారులు కోసం ఎల్‌ఐసీ ప్రత్యేకంగా షేర్లను జారీ చేయనుంది. ఇందుకోసం ఇష్యూ పరిమాణంలో 2.21 కోట్ల (0.35%) షేర్లను కేటాయించింది. వీరికి ఒక్కో షేరుపై రూ.60 రాయితీ సైతం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లూ పాలసీలకు ప్రీమియం చెల్లిస్తున్న పాలసీదారులు ఎల్‌ఐసీలో వాటాదారులుగా మారేందుకు అవకాశం లభించింది.
  4. తమ ఉద్యోగుల కోసం కూడా ఎల్‌ఐసీ ప్రత్యేకంగా 15.81 లక్షల (0.025%) షేర్లను కేటాయించింది. వీరికి ఒక్కో షేరుపై రూ.45 రాయితీ దక్కనుంది. రిటైల్‌ మదుపర్లకు కూడా ఇంతే మొత్తంలో రాయితీ లభించనుంది.
  5. 50 శాతం షేర్లు క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్లకు (QIBs) కేటాయించారు. దీంట్లో 60 శాతం వాటాను యాంకర్‌ ఇన్వెస్టర్లకు రిజర్వు చేశారు. నాన్‌-ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వె స్టర్లకు 15 శాతం, రిటైల్‌ మదుపర్లకు 15 శాతం వాటాలను కేటాయించారు.
  6. ఎల్‌ఐసీ విలువ (LIC IPO)ను రూ.6 లక్షల కోట్లుగా లెక్కగట్టారు. ఏకీకృత వాటాదారుల విలువగా పరిగణించే సంస్థ ఎంబెడెడ్‌ విలువను సెప్టెంబరు 30, 2021 నాటికి రూ.5.4 లక్షల కోట్లుగా అంచనా వేశారు. 
  7. తొలుత ఫిబ్రవరిలో వేసిన ప్రణాళిక మేరకు ఎల్‌ఐసీలో 5 శాతం వాటాకు సమానమైన 31.6 కోట్ల షేర్లను ఐపీఓ (IPO)లో విక్రయించి రూ.63,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, మార్కెట్‌లో పరిస్థితులు సానుకూలంగా లేకపోవడంతో పరిమాణాన్ని రూ.21,000 కోట్లకు తగ్గించారు.
  8. రూ.లక్ష కోట్లకు పైగా విలువ చేసే కంపెనీలు ఐపీఓకి వస్తే కనీసం 5 శాతం వాటాలను విక్రయించాలని సెబీ నిబంధనలు తెలియజేస్తున్నాయి. దీని నుంచి మినహాయింపు కోరుతూ సెబీకి ప్రభుత్వం గతవారం దరఖాస్తు చేసుకుంది.
  9. ఫిబ్రవరి 13న ఎల్‌ఐపీ పబ్లిక్‌ ఇష్యూ (LIC Public offer) కోసం సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది. మార్చిలో అనుమతి లభించింది. మే 12 వరకు ఐపీఓని ప్రారంభించేందుకు ఎల్‌ఐసీకి గడవు ఉంది. ఈ ఐపీఓ ద్వారా సమకూరే నిధులన్నీ పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ప్రభుత్వ ఖజానాకు చేరనున్నాయి. 2022-23లో మొత్తం పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.65,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
  10. ఎల్‌ఐసీకి 13 లక్షల మంది వ్యక్తిగత ఏజెంట్లు ఉన్నారు. 29 కోట్ల మంది పాలసీదారులకు సేవలందిస్తోంది. జనవరి 2022 నాటికి కొత్త బిజినెస్‌ ప్రీమియం వసూలులో ఈ సంస్థ మార్కెట్‌ వాటా 61.6 శాతం. 2021-22 ఆర్థిక సర్వే ప్రకారం.. 2020లో జీవిత బీమా కొనుగోలు 3.2 శాతం పెరిగింది. ఇది ప్రపంచ సగటుకు దాదాపు సమానం. ఈ రంగంలో 2019-2023 మధ్య ఏటా 5.3 శాతం వృద్ధి నమోదు కానుందని అంచనా.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని