Sony- Zee: విలీన ఒప్పందం రద్దు.. సోనీకి NCLT నోటీసులు

Sony- Zee merger: విలీన ఒప్పందం రద్దు విషయంలో సోనీకి ఎన్‌సీఎల్‌టీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 12కు వాయిదా వేసింది.

Published : 30 Jan 2024 16:29 IST

ముంబయి: విలీన ఒప్పందం రద్దు విషయంలో సోనీపై జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను ది నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) విచారణకు స్వీకరించింది. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (ZEEL) షేర్‌ హోల్డర్‌ మ్యాడ్‌మెన్‌ ఫిల్మ్‌ వెంచర్స్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సోనీకి NCLT నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో సమాధానం ఇవ్వాలని సూచించింది. తదుపరి విచారణను మార్చి 12కు వాయిదా వేసింది.

మరోవైపు సోనీపై సింగపూర్‌ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌లో దాఖలు చేసిన పిటిషన్‌ జనవరి 31న అత్యవసర విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ వార్తల నేపథ్యంలో జీ షేర్ల కొనుగోళ్లలో ఉత్సాహం కనిపించింది. ఓ దశలో 8 శాతానికి పైగా లాభపడిన షేర్లు.. చివరికి 5.72 శాతం లాభంతో రూ.171 వద్ద ముగిశాయి.

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌తో తమ భారత అనుబంధ సంస్థ కల్వర్‌ మ్యాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (గతంలో సోనీ పిక్చర్స్‌) కుదుర్చుకున్న 10 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.83,000 కోట్ల) విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు జపాన్‌కు చెందిన సోనీ గ్రూపు కార్పొరేషన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం రద్దుపై జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ NCLTని ఆశ్రయించింది. సోనీతో కుదిరిన ఒప్పందాన్ని పునరుద్ధరించేలా ఆదేశించాలంటూ ఎన్‌సీఎల్‌టీ, ముంబయి బెంచ్‌ను కోరింది. ఇదే అంశంపై సింగపూర్‌ ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ (SIAC)ను సైతం జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఆశ్రయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని