Obesity: అధిక పన్నులతో ఊబకాయానికి చెక్‌!

దేశంలో స్థూలకాయ సమస్య అధికమవుతున్న నేపథ్యంలో దాని కట్టడికి నీతి ఆయోగ్‌ సిద్ధమవుతోంది...

Published : 27 Feb 2022 16:50 IST

సమస్య కట్టడికి నీతి ఆయోగ్‌ పరిశీలనలో ప్రతిపాదన

దిల్లీ: దేశంలో స్థూలకాయ సమస్య అధికమవుతున్న నేపథ్యంలో దాని కట్టడికి నీతి ఆయోగ్‌ సిద్ధమవుతోంది. చక్కెర, కొవ్వు, ఉప్పు స్థాయిలు అధికంగా ఉండి ఊబకాయానికి కారణమయ్యే ఆహారపదార్థాలపై అధిక పన్ను విధించే యోచనలో ఉన్నట్లు వార్షిక నివేదిక పేర్కొంది. ఈ సమస్య కట్టడికి ఉన్న అవకాశాలన్నింటినీ నీతి ఆయోగ్‌ పరిశీలిస్తున్నట్లు తెలిపింది. 

భారత్‌లో పిల్లలు, వయోజనులు, మహిళల్లో ఊబకాయ సమస్య అధికమవుతోందని నివేదిక వెల్లడించింది. దీని నివారణకు తీసుకోవాల్సిన విధానపరమైన చర్యలపై జూన్‌ 24, 2021న నీతి ఆయోగ్‌ సభ్యుడి (ఆరోగ్యం) నేతృత్వంలో సమావేశం జరిగినట్లు తెలిపింది. స్థూలకాయ సమస్యకు కారణమయ్యే ఆహారపదార్థాల ప్యాకింగ్‌పై ముందు భాగంలో లేబులింగ్‌, మార్కెటింగ్‌ సహా అధిక పన్నుల వంటి ప్రత్యామ్నాయాలపై సమీక్ష నిర్వహించినట్లు పేర్కొంది. ప్రస్తుతం నాన్‌-బ్రాండెడ్‌ నమ్‌కీన్లు, భుజియాలు, వెజిటెబుల్‌ చిప్స్‌ సహా ఇతర చిరుతిళ్లపై 5 శాతం జీఎస్టీ వర్తిస్తోంది. బ్రాండెడ్‌ వాటిపై 12 శాతం జీఎస్టీని విధిస్తున్నారు.

‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5’ వివరాల ప్రకారం.. 2015-16లో 20.6 శాతం మహిళలు ఊబకాయంతో బాధపడుతుంటే అది 2019-20కి 24శాతానికి చేరుకుంది. అదే పురుషుల్లో ఈ సమస్య 18.4 శాతం నుంచి 22.9 శాతానికి పెరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని