Oyo IPO: ఓయో ఐపీఓ పరిమాణం తగ్గనుందా?

OYO IPO: మార్కెట్‌ తీవ్ర ఒడుదొడుకుల్లో చలిస్తుండడం.. మరోవైపు కొత్తతరం టెక్‌ కంపెనీల్లో ప్రతికూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఓయో ఐపీఓ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది.

Published : 27 Mar 2023 17:26 IST

దిల్లీ: ఓయో పేరిట ఆతిథ్య సేవలను అందిస్తోన్న ‘ఒరావెల్‌ స్టేస్‌ లిమిటెడ్‌’ మరోసారి ఐపీఓ (OYO IPO)కి దరఖాస్తు చేసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వారం వ్యవధిలో సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించే అవకాశం ఉందని సమాచారం. అయితే, ఐపీఓ పరిమాణాన్ని మూడింతలకు తగ్గించాలని నిర్ణయించినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కంపెనీ వర్గాలు తెలిపాయి.

మార్కెట్‌ తీవ్ర ఒడుదొడుకుల్లో చలిస్తుండడం.. మరోవైపు కొత్తతరం టెక్‌ కంపెనీల్లో ప్రతికూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఐపీఓ విషయంలో ఓయో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈసారి ‘ఆఫర్‌ ఫర్‌ సేల్‌’ కింద ఎలాంటి షేర్లను విక్రయించబోదని తెలుస్తోంది. రూ.8,430 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఓయో 2021లోనే ఐపీఓకి దరఖాస్తు చేసుకుంది. కానీ, వివిధ కారణాల వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా తగిన మార్పులు చేసి మళ్లీ ముసాయిదా పత్రాలను సమర్పించాలని సెబీ గత డిసెంబరులో ఆదేశించింది.

మామాఎర్త్‌ ఐపీఓ ప్రణాళికల్లో మార్పూ లేదు..

చర్మ సంరక్షణ ఉత్పత్తుల సంస్థ మామాఎర్త్‌.. ఐపీఓ ప్రతిపాదనలను ఉపసంహరించుకుంటోందని వస్తున్న వార్తల్ని కంపెనీ సీఈఓ వరుణ్‌ అలఘ్‌ తిప్పికొట్టారు. అవన్నీ ఆధారం లేని వదంతులు మాత్రమేనని చెప్పారు. ఐపీఓ విషయంలో తమ ప్రణాళికలు ఇంకా సజీవంగానే ఉన్నాయని తెలిపారు. నియంత్రణా సంస్థలు, బ్యాంకర్లతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఐపీఓ పరిమాణంలోనూ ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని