Stock Market Closing Bell: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market Closing Bell: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల సోమవారం లాభాల్లో ముగిశాయి...

Published : 08 Aug 2022 15:57 IST

ముంబయి: ఉదయం స్వల్ప తడబాటుతో ట్రేడింగ్‌ ప్రారంభించిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు కాసేపటికే పుంజుకొని ఇంట్రాడే గరిష్ఠాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు ప్రారంభంలో మార్కెట్లను కొంత కలవరపెట్టాయి. కానీ, దేశీయంగా ఉన్న సానుకూలతలు సూచీలకు దన్నుగా నిలిచాయి. మరోవైపు అమెరికాలో ఉద్యోగాల కల్పన అంచనాలను మించడంతో అంతర్జాతీయంగా మార్కెట్ల సెంటిమెంటును పెంచింది. దీంతో ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు సానుకూలంగా కదలాడాయి. ఐరోపా మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మరోవైపు చమురు ధరలు దిగిరావడం, ఎఫ్‌ఐఐల కొనుగోళ్లు ఊపందుకోవడం సూచీలకు కలిసొచ్చింది. బలమైన కార్పొరేట్‌ ఫలితాలు ర్యాలీకి దన్నుగా నిలిచాయి.

* నిఫ్టీ ఉదయం 17,401.50 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించింది. ఇంట్రాడేలో 17,548.80 వద్ద గరిష్ఠాన్ని, 17,359.75 కనిష్ఠాన్ని తాకింది. చివరకు 122.75 పాయింట్ల లాభంతో 17,520.25 వద్ద స్థిరపడింది. 58,417.71 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 58,934.90 - 58,266.65 మధ్య కదిలింది. చివరకు 465.14 పాయింట్లు ఎగబాకి 58,853.07 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.79.63 వద్ద ట్రేడయ్యింది.

* సెన్సెక్స్‌ 30 సూచీలో ఎంఅండ్ఎం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ, డాక్టర్‌ రెడ్డీస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, రిలయన్స్‌, మారుతీ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఎస్‌బీఐ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, నెస్లే ఇండియా, విప్రో, పవర్‌గ్రిడ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, సన్‌ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టాల్లో స్థిరపడ్డాయి.

మార్కెట్‌లోని ఇతర విశేషాలు..

* జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఎస్‌బీఐ ఏకీకృత నికర లాభాలు ఏడు శాతం తగ్గడంతో కంపెనీ షేర్లు ఈరోజు ఇంట్రాడేలో 3 శాతానికి పైగా కుంగాయి. చివరకు 2.06 శాతం నష్టపోయి రూ.520.10 వద్ద స్థిరపడ్డాయి.

* ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ రుణాలను ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, యెస్‌ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌లు అధిక రిస్క్‌ రుణాలుగా గుర్తించాయి. దీంతో కంపెనీ షేర్లు ఈరోజు 3.84 శాతం మేర నష్టపోయి రూ.47.60 వద్ద ముగిశాయి.

* ఎంఎంవేవ్‌, ఎఫ్‌డబ్ల్యూఏ, సీపీఈ ఉత్పత్తుల కోసం హెచ్‌ఎఫ్‌సీఎల్‌ లిమిటెడ్‌తో క్వాల్‌కామ్‌ టెక్నాలజీస్‌ ఒప్పందం కుదుర్చుకొంది. ఈ నేపథ్యంలో హెచ్‌ఎఫ్‌సీఎల్‌ షేర్లు ఈరోజు 5.95 శాతం లాభపడ్డాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని