Twitter: ట్విటర్ ‘బ్లూ టిక్‌’ ఇక మూడు రంగుల్లో.. ఎవరికి ఏ రంగు?

ట్విటర్‌ బ్లూటిక్‌ సేవల్లో మార్పులు చేస్తున్నట్లు ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు. ఇకపై వ్యక్తులు, ప్రభుత్వాలు, సంస్థలకు వేర్వేరు రంగుల్లో టిక్‌ మార్క్‌లను కేటాయించనున్నట్లు తెలిపారు.

Updated : 25 Nov 2022 15:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పలుమార్లు వాయిదా పడుతూ వస్తోన్న ట్విటర్‌ ‘బ్లూ టిక్‌’ (Twitter Blue Tick) చందా సేవలు వచ్చేవారం నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే ఈ సేవల పునరుద్ధరణలో కీలక మార్పు తీసుకొస్తున్నట్లు సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌ శుక్రవారం ప్రకటించారు. వెరిఫైడ్‌ ఖాతాలకు వేర్వేరు రంగుల్లో ఈ టిక్‌ మార్క్‌లను కేటాయించనున్నట్లు వెల్లడించారు. వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వ ఖాతాలకు స్పష్టమైన తేడా ఉండేలా వేర్వేరు రంగులతో ఈ బ్యాడ్జ్‌లను ఇవ్వనున్నట్లు తెలిపారు.

‘‘వచ్చే శుక్రవారం (డిసెంబరు 2) నుంచి తాత్కాలిక ప్రాతిపదికన ‘వెరిఫైడ్‌’ ప్రక్రియను ప్రారంభించనున్నాం. కంపెనీలకు గోల్డ్‌, ప్రభుత్వ ఖాతాలకు గ్రే, వ్యక్తులకు (సెలబ్రిటీలు అయినా కాకపోయినా) బ్లూ టిక్‌ ఇవ్వనున్నాం. ఖాతాదారుల వివరాలను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే ఈ వెరిఫైడ్‌ టిక్‌ను కేటాయిస్తాం’’ అని మస్క్‌ ట్వీట్ చేశారు. దీనిపై పూర్తి వివరాలను వచ్చేవారం వెల్లడిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా విద్వేష వార్తల కట్టడి గురించి మస్క్‌ ట్వీట్‌ చేశారు. హింసను ప్రేరేపించే ఖాతాలను సస్పెండ్‌ చేస్తామని స్పష్టం చేశారు.

మస్క్‌ చేతికి ట్విటర్‌ రాకముందు.. ప్రభుత్వ అధిపతులు, క్రికెటర్లు, సినీ తారలు, ఇతర సెలబ్రిటీల ఖాతా వివరాలను తనిఖీ చేశాకే బ్లూటిక్‌ (Blue Tick) ఇచ్చేవారు. అయితే ఈ సంస్థను కొనుగోలు చేసిన తర్వాత మస్క్‌.. ఈ ఫీచర్‌లో మార్పులు చేశారు. బ్లూటిక్‌ సేవలకు నెలకు 8 డాలర్ల ఫీజు ప్రకటించి, ఎటువంటి తనిఖీలు చేపట్టకుండా ఇచ్చేశారు. దీంతో నకిలీ ఖాతాలు భారీగా కనిపించాయి. వీటిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఈ సేవలను నిలిపివేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని