Used phones: సెకండ్‌ హ్యాండ్‌ స్మార్ట్‌ఫోన్లను పెరిగిన గిరాకీ: రీసెర్చ్‌ నివేదిక

Used phones: 5జీ అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది కొత్త ఫోన్లకు అప్‌గ్రేడ్‌ అవుతున్నారు. దీంతో కనీసం మూడేళ్లు వినియోగించిన సెకండ్‌హ్యాండ్‌, రీఫర్బిష్డ్‌ 4జీ ఫోన్లకు మంచి గిరాకీ కనిపిస్తోందని రీసెర్చ్‌ నివేదిక పేర్కొంది.

Published : 19 Oct 2023 12:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో సెకండ్‌హ్యాండ్‌ ఫోన్ల (Used phones)కు ఈ ఏడాది గిరాకీ పుంజుకుందని ఓ ప్రముఖ నివేదిక తెలిపింది. అదే సమయంలో కొత్త స్మార్ట్‌ ఫోన్ల (smartphones) విక్రయాలు తగ్గినట్లు వెల్లడించింది. ‘కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌’ ఏజెన్సీ నివేదిక ప్రకారం ఈ ఏడాది సెకండ్‌ హ్యాండ్‌, రీఫర్బిష్డ్‌ ఫోన్లు (తిరిగి విక్రయానికి సిద్ధం చేసిన పాత ఫోన్లు) దాదాపు 3.5-4.5 కోట్లు అమ్ముడవుతాయని అంచనా. ఇది గతేడాదితో పోలిస్తే 15 శాతం అధికం. అదే సమయంలో కొత్త స్మార్ట్‌ఫోన్ల (smartphones) విక్రయాలు ఐదు శాతం తగ్గుతాయి. గత ఏడాది 15.1 కోట్ల కొత్త ఫోన్లు అమ్ముడయ్యాయి.

మరోవైపు ఏప్రిల్‌-జూన్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ల (smartphones) ఎగుమతులు మూడు శాతం తగ్గాయి. అయితే, జనవరి-మార్చిలో నమోదైన 19 శాతం క్షీణతతో పోలిస్తే మాత్రం మెరుగుపడినట్లే లెక్క. మరోవైపు వినియోగ ఫోన్ల విక్రయాలకు గిరాకీ పుంజుకోవడానికి అవి అందుబాటులో ధరలో లభ్యమవుతుండడం కాదని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ సహ- వ్యవస్థాపకుడు నీల్‌ షా వెల్లడించారు. వినియోగదారుల కొనుగోళ్ల తీరులో మార్పు రావడమే అందుకు కారణమన్నారు. కొంత మంది ఫీచర్‌ ఫోన్ల నుంచి స్మార్ట్‌ఫోన్‌కు మారాలనుకోవడం, ఎంట్రీ లెవెల్‌ స్మార్ట్‌ఫోన్‌ (smartphones) వాడుతున్న వాళ్లు దాన్ని అప్‌గ్రేడ్‌ చేసుకోవాలనుకోడం ఈ విక్రయాలకు దోహదం చేస్తున్నట్లు తెలిపారు.

5జీ అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది కొత్త ఫోన్లకు అప్‌గ్రేడ్‌ అవుతున్నారు. దీంతో కనీసం మూడేళ్లు వినియోగించిన సెకండ్‌హ్యాండ్‌, రీఫర్బిష్డ్‌ 4జీ ఫోన్లకు మంచి గిరాకీ కనిపిస్తోందని రీసెర్చ్‌ నివేదిక పేర్కొంది. తక్కువ ధరకు ప్రీమియం ఫీచర్లు వస్తుండడంతో ఎంట్రీ లెవెల్‌ ఫోన్లు వినియోగిస్తున్న వారంతా వాటిని కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది. భారత్‌లో దాదాపు 80 కోట్ల ఫోన్లు ఉన్నాయి. వీటిలో 20 కోట్లు ఫీచర్‌ ఫోన్లేనని నివేదిక వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని