అమీర్‌పేటలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దారుణహత్య

హైదరాబాద్‌ అమీర్‌పేటలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దారుణహత్యకు గురయ్యారు. ధరంకరం రోడ్డులో మేనమామ ఇంట్లో ఉంటున్న కేశన చంద్రశేఖర్‌రాజు (25)ను

Published : 12 Oct 2020 01:16 IST

అమీర్‌పేట: హైదరాబాద్‌ అమీర్‌పేటలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దారుణహత్యకు గురయ్యారు. ధరంకరం రోడ్డులో మేనమామ ఇంట్లో ఉంటున్న కేశన చంద్రశేఖర్‌రాజు (25)ను అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో కత్తులతో పొడిచి చంపారు. భార్య తరఫు బంధువులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు లభ్యమైన సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ధరంకరం రోడ్డులోని పద్మశ్రీ అపార్ట్‌మెంట్‌ వద్ద ఈరోజు ఉదయం జరిగిన హత్య కేసు వివరాలను ఎస్సార్‌ నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదులు మీడియాకు తెలిపారు. గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన కేశన చంద్రశేఖర్‌రాజుతో మచిలీపట్నానికి చెందిన లక్ష్మీగౌరి(22)కి 2019 ఫిబ్రవరి 23న వివాహం జరిగింది. నగరంలోని ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న చంద్రశేఖర్‌రాజు భార్యతో కలిసి ఆల్విన్‌కాలనీలో కాపురం పెట్టాడు. ఈ క్రమంలో భార్య ఈ ఏడాది జూన్‌ 1న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త, అతడి తల్లిదండ్రులు వరకట్నం కోసం వేధించడం వల్లే లక్ష్మీగౌరి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రశేఖర్‌రాజుతో పాటు అతడి తల్లిదండ్రులు వెంకట కృష్ణారావు, ఝాన్సీలక్ష్మిపై 304-బి కింద జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో జైలుకు వెళ్లిన చంద్రశేఖర్‌రాజు ఇటీవల బెయిలుపై విడుదలయ్యాడు.

మాటువేసి..

ప్రతి వారం బాలానగర్‌ ఏసీపీ కార్యాలయానికి వెళ్లి హాజరు వేయాల్సి ఉండటంతో తల్లి, సోదరుడితో కలిసి చంద్రశేఖర్‌రాజు ధరంకరం రోడ్డులోని పద్మశ్రీ అపార్ట్‌మెంట్‌లో మేనమామ ఇంట్లో 40 రోజులుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం చికెన్‌ తీసుకొచ్చేందుకు కిందికి వచ్చిన చంద్రశేఖర్‌రాజుపై అప్పటికే మాటువేసిన నలుగురు వ్యక్తులు అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లోనే కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలతో రక్తం అధికంగా పోవడంతో చంద్రశేఖర్‌రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. హత్యను ప్రత్యక్షంగా చూసిన వారు ఎస్సార్‌ నగర్‌ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని బంజారాహిల్స్‌ ఏసీపీ కె.ఎస్‌.రావు, ఇన్‌స్పెక్టర్‌ సైదులు, డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ అజయ్‌కుమార్, ఎస్సై భాస్కర్‌రావు ఇతర సిబ్బంది పరిశీలించారు. క్లూస్‌ టీం ఆధారాలను సేకరించింది.

భార్య తరఫు బంధువులపైనే అనుమానం

హత్య జరిగిన పద్మశ్రీ అపార్ట్‌మెంట్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీ టీవీ పుటేజీలను పరిశీలించిన పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. హత్యలో చంద్రశేఖర్‌రాజు భార్య లక్ష్మీగౌరి దగ్గరి బంధువుల ప్రమేయంపై పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు ఓ ప్రత్యేక బృందాన్ని పంపారు. హత్యకు పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకుంటామని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని