Fraud alert!: అయోధ్య దర్శనం పేరిట ఫేక్‌ మెసేజ్‌లు.. పోలీసుల అలర్ట్‌!

Cyber Fraud alert: అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో సైబర్‌ నేరగాళ్లు కొత్త మోసాలకు తెరతీశారు. నకిలీ సందేశాలతో సొమ్ములు దోచుకునేందుకు యత్నిస్తున్నారు.

Updated : 20 Jan 2024 19:39 IST

Fraud alert | ఇంటర్నెట్ డెస్క్‌: రీఛార్జులు, కంపెనీ స్పెషల్‌ ఆఫర్లు అంటూ అమాయక ప్రజలకు వల వేసే సైబర్‌ నేరగాళ్లు (Cyber criminals).. ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తారు. అయోధ్యలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ (Ram temple event) కార్యక్రమం వేళ కొత్త మోసాలకు తెరతీస్తున్నారు. అయోధ్య దర్శనం, ప్రసాదం, ఫొటోలు అంటూ నకిలీ మెసేజులు పంపిస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా భక్తుల నమ్మకాలు, విశ్వాసాలను ఆసరాగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. రామ మందిరానికి డొనేషన్ల పేరిట క్యూఆర్‌ కోడ్‌లు పంపిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలను పట్టించుకోవద్దని, ధ్రువీకరించుకోకుండా ఎవరికీ సొమ్ములు పంపొద్దని సూచిస్తున్నారు.

రూ. 98 లక్షలు కొల్లగొట్టారు.. క్షణాల్లో 11 ఖాతాలకు మళ్లించారు

సైబర్‌ నేరగాళ్లు ‘అయోధ్య ప్రసాదం’ అంటూ మరోతరహా మోసాలకూ పాల్పడుతున్నారు. అయోధ్య ప్రసాదం డెలివరీ పేరిట తమకు తోచిన నంబర్లకు సైబర్‌ నేరగాళ్లు సందేశాలు పంపుతున్నారు. చిరునామా వివరాల పేరిట మోసపూరిత లింకులు క్లిక్‌ చేయించి ఫోన్లను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. ఫోన్ ఒకసారి వారి చేతిలోకి వెళితే కొన్ని క్షణాల్లోనే నగదు మాయం చేస్తున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఫోన్‌ రీఛార్జి పేరిట ఇదే తరహా మోసాలు జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

అయోధ్య కార్యక్రమం నేపథ్యంలో రాములోరి చిత్రాలు చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతుండటంతో ఇంకొన్ని సైబర్‌ గ్యాంగులు శ్రీరాముడి లైఫ్‌ ఫొటోస్‌, అయోధ్య లైవ్‌ ఫొటోస్‌, అయోధ్య దర్శనం అంటూ సందేశాలు పంపిస్తున్నారు. ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్లను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు హెచ్చరిస్తున్నారు. కొవిడ్‌ సమయంలోనూ ఇలానే వ్యాక్సిన్‌ డోసులు, పీఎం కేర్స్‌కు విరాళాల పేరిట సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఇప్పుడు అయోధ్య సందర్భాన్నీ తమకు అనుకూలంగా మార్చుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్‌మీడియా, వాట్సాప్‌లలో వచ్చే సందేశాలపై అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని