దేవాదాయశాఖ పర్యవేక్షకురాలి ఆత్మహత్యాయత్నం

భారాస పార్టీ మండల అధ్యక్షుడు తనతో అనుచితంగా మాట్లాడారని ఆరోపిస్తూ దేవాదాయ శాఖ ఖమ్మం డివిజన్‌ పర్యవేక్షకురాలు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఇది.

Published : 08 Feb 2023 04:08 IST

భారాస నేత వేధింపులే కారణమని ఆరోపణ

ఖమ్మం సాంస్కృతికం, న్యూస్‌టుడే: భారాస పార్టీ మండల అధ్యక్షుడు తనతో అనుచితంగా మాట్లాడారని ఆరోపిస్తూ దేవాదాయ శాఖ ఖమ్మం డివిజన్‌ పర్యవేక్షకురాలు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఇది. బాధితురాలి కథనం ప్రకారం.. ఉమ్మడి ఖమ్మం జిల్లా దేవాదాయ, ధర్మాదాయశాఖ ఖమ్మం డివిజన్‌ పర్యవేక్షకురాలు రెంటల సమతకు మంగళవారం ఖమ్మం గ్రామీణ మండల భారాస అధ్యక్షుడు బెల్లం వేణు (ఎంపీపీ భర్త) ఫోన్‌ చేశారు. మారెమ్మ దేవాలయ ట్రస్టు బోర్డు నోటిఫికేషన్‌ విషయం తనకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. దేవాలయం, ఎంపీడీవో, తహసీల్దార్‌, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో నోటిఫికేషన్‌ వివరాలను అంటించామని సమత సమాధానమిచ్చారు. తనకు చెప్పాల్సిన బాధ్యత లేదా అంటూ ఆయన దురుసుగా మాట్లాడడంతో మనస్తాపానికి గురైన సమత తన కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. మహిళ అని చూడకుండా బెల్లం వేణు ఇష్టారీతిన మాట్లాడారని ఆరోపించారు. ఫోన్‌ రికార్డింగ్‌ వినిపించారు. మనస్తాపంతో బీపీ సహా ఇతర మాత్రలు 20 వేసుకున్నట్లు ఆమె విలేకర్లతో చెప్పారు. అప్పటికే అస్వస్థతకు గురైన ఆమెను సహచర ఉద్యోగులు ఖమ్మం సర్వజనాసుపత్రికి తరలించారు. సూర్యాపేట నుంచి దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ ఎ.సులోచన వచ్చి సమతను పరామర్శించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు.

ఆసుపత్రి వద్ద ఆందోళన

సమతకు న్యాయం చేయాలని, కారకుడైన బెల్లం వేణును అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద దేవాదాయ శాఖ ఉద్యోగులు, అర్చకులు, టీఎన్జీవోస్‌ నాయకులు ఆందోళన నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ గౌతమ్‌, సీపీ విష్ణులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు బెల్లం వేణుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

* ఈ విషయమై నిందితుడు వేణు మాట్లాడుతూ.. నోటిఫికేషన్‌ గురించి సమతకు మంగళవారం ఫోన్‌ చేసి అడిగానన్నారు. నవంబరులోనే నోటిఫికేషన్‌ వచ్చిందని, సమయం ముగిసిందని ఆమె చెప్పారని, ఆలయ ఈవోను అడిగితే నోటిఫికేషన్‌ రాలేదన్నారని వివరణ ఇచ్చారు. ఎంపీపీకి ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించగా.. చెప్పాల్సిన అవసరం లేదంటూ సమత ఫోన్‌ కట్‌ చేశారని వేణు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని