Crime News: భర్తే కిరాతకుడు!

కారుతో తొక్కించి.. బండరాళ్లతో మోది.. సిగరెట్లతో కాల్చి ఓ మహిళను దారుణంగా హతమార్చిన కేసు కీలక మలుపు తిరిగింది.భర్తే కిరాతకుడు!

Updated : 21 May 2023 12:05 IST

రాధ హత్య కేసులో కీలక మలుపు
భార్య స్నేహితుడి పేరుతో సిమ్‌ కొనుక్కుని చాటింగ్‌
డబ్చిస్తానని సందేశం పంపిందీ అతడే..

ఒంగోలు నేరవిభాగం, కనిగిరి- న్యూస్‌టుడే: కారుతో తొక్కించి.. బండరాళ్లతో మోది.. సిగరెట్లతో కాల్చి ఓ మహిళను దారుణంగా హతమార్చిన కేసు కీలక మలుపు తిరిగింది. ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జిల్ల్లెళ్లపాడు గ్రామ శివారులో కోట రాధ(35) అనే వివాహిత ఈ ఉదంతంలో ప్రాణాలు కోల్పోయారు. భర్తే ఆమెను కిరాతకంగా హతమార్చినట్లు సమాచారం. రాధ వద్ద అప్పు తీసుకున్న ఆమె చిన్ననాటి స్నేహితుడు కేతిరెడ్డి కాశిరెడ్డి డబ్బు ఇస్తాను రమ్మని నమ్మకంగా పిలిపించి కిరాతకంగా అంతమొందించి ఉంటాడనే అనుమానాలు తొలుత రేకెత్తాయి. రాధ తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దీంతో అతని కోసం పోలీసులు సైతం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ తరుణంలో కేసు అనూహ్యంగా మలుపు తిరిగింది. రాధ అంత్యక్రియలు తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడలో శుక్రవారం సాయంత్రం ముగిశాయి. ఆ వెంటనే ఆమె భర్త, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కోట మోహన్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రకాశం జిల్లాకు తరలించినట్టు సమాచారం.

స్నేహితుడి పేరుతో ఛాటింగ్‌

రాధను ఆమె భర్త మోహన్‌రెడ్డే మరికొందరితో కలిసి అత్యంత కిరాతకంగా హత్య చేసినట్టు పోలీసులు ధ్రువీకరించుకున్నట్టు తెలిసింది. ఉద్యోగం కోల్పోయి కష్టాల్లో ఉన్న స్నేహితుడికి చేయూత పేరిట రూ.80 లక్షల వరకు అప్పు ఇవ్వడం, ఆ మొత్తం తిరిగి రాకపోవడంతో భార్యాభర్తల మధ్య కొన్నాళ్లుగా తీవ్ర విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే కాశిరెడ్డితో ఆమెకు సన్నిహిత సంబంధం ఉందంటూ మోహన్‌రెడ్డి అనుమానించాడు. కాశిరెడ్డి పేరిట సిమ్‌ కార్డులు కొనుగోలు చేసి, అతని పేరుతోనే తన భార్యతో సెల్‌ఫోన్‌లో మోహన్‌రెడ్డి ఛాటింగ్‌ చేసినట్టుగా గుర్తించినట్లు తెలుస్తోంది. డబ్బులిస్తామని అతని పేరుతోనే సందేశం పంపి ఈ నెల 17న ఆమెను స్వగ్రామం నుంచి కనిగిరి రప్పించాడు. అనంతరం రాధను కారులో తీసుకెళ్లి తీవ్రంగా హింసించి హత్య చేసినట్టుగా భావిస్తున్నారు.


పట్టించిన అనుమానాస్పద ప్రవర్తన

కనిగిరిలోని పామూరు బస్టాండు సెంటరులో వేచి ఉన్న రాధ వద్దకు వచ్చిన ఎరుపు రంగు కారు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిదిగా పోలీసులు గుర్తించారు. భార్య హతమైన తర్వాత మోహన్‌రెడ్డి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో అతని పాత్రపై అనుమానాలు రేకెత్తి మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. తన స్నేహితుడికి ఇచ్చిన అప్పు వసూలుకు  వేధింపులు తాళలేక తన తల్లిదండ్రులు, బంధువుల వద్ద నుంచి రూ.25 లక్షలు తీసుకెళ్లి భర్తకు రాధ ఇచ్చినట్టు తెలిసింది. అదే సమయంలో రుణం తీసుకున్న కేతిరెడ్డి కాశిరెడ్డి అజ్ఞాతంలో ఉండటంతో తొలుత కేసు దర్యాప్తు.. అందరి దృష్టి అతని వైపే మళ్లింది. రాధ హత్యలో మోహన్‌రెడ్డికి సహకరించిన వారు ఎవరనే కోణంలో పోలీసులు ప్రస్తుతం నిశితంగా దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని