ఊపిరి తీసిన బావి

రోజులాగే ఆ ముగ్గురు జీవాలను మేపేందుకు పొలం బాట పట్టారు. మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉండటంతో వాటికి ఉపశమనం కల్పించాలన్న ఉద్దేశంతో వ్యవసాయ బావిలోకి తరలించే క్రమంలో ముగ్గురు నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు.

Published : 02 Jun 2023 05:04 IST

నీట మునిగి ముగ్గురి మృత్యువాత
మృతుల్లో తండ్రీ కుమారుడు
శోకసంద్రంలో మోర్జంపాడు

మాచవరం, న్యూస్‌టుడే: రోజులాగే ఆ ముగ్గురు జీవాలను మేపేందుకు పొలం బాట పట్టారు. మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉండటంతో వాటికి ఉపశమనం కల్పించాలన్న ఉద్దేశంతో వ్యవసాయ బావిలోకి తరలించే క్రమంలో ముగ్గురు నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. ఈ విషాద సంఘటన పల్నాడు జిల్లా మాచవరం మండలం మోర్జంపాడులో గురువారం చోటుచేసుకుంది. తండ్రి, కుమారుడితోపాటు వారి బంధువు వ్యవసాయ బావిలో పడి చనిపోవడంతో ఆ పల్లె శోకసంద్రంలో మునిగింది. బాధితుల వివరాల మేరకు.. మోర్జంపాడుకు చెందిన ఎనుముల నాగులు(45)కు జీవాలు (గొర్రెలు) ఉన్నాయి. గురువారం తనతోపాటు కుమారుడు నాగార్జున (15), బంధువు ఎనుముల ఆంజనేయులు (60), ముంగి లక్ష్మయ్యతో కలిసి జీవాలు మేపేందుకు పొలం వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో మోర్జంపాడు-కొత్తపాలెం గ్రామాల మధ్యనున్న వ్యవసాయ బావిలో జీవాలను కడిగేందుకు వారు ప్రయత్నించారు. ఈ క్రమంలో నాగార్జున కాలుజారి బావిలో పడిపోయాడు. కుమారుడిని రక్షించేందుకు తండ్రి నాగులు బావిలోకి దూకారు. వారిద్దరినీ కాపాడేందుకు ఆంజనేయులు బావిలోకి దిగారు. ఎంతసేపటికి ముగ్గురు రాకపోవడంతో లక్ష్మయ్య సమీపంలో జీవాలు మేపుతున్న వ్యక్తి వద్దకు వెళ్లి విషయం చెప్పారు. ఆయన ఫోన్‌ ద్వారా కుటుంబీకులు, బంధువులకు సమాచారమిచ్చారు. ఈలోపు ముగ్గురు నీట మునిగి ఊపిరాడక చనిపోయారు.

అందరూ అయినవాళ్లే..

ఎనుముల నాగార్జున మోర్జంపాడు ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి వరకు చదివాడు. పదిలో చేర్పించేందుకు తండ్రి నాగులు ఇటీవల పిడుగురాళ్లలోని ఓ ప్రైవేటు పాఠశాలకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. వేసవి సెలవులు కావడంతో జీవాలను మేపేందుకు వెంట తీసుకెళ్లారు. ఆంజనేయులుకు సెంటు భూమి లేదు. జీవాల కాపరిగా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. నాగులుకు ఆంజనేయులు వరుసకు బాబాయి అవుతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని