Madanapalle: నడిరోడ్డుపై ప్రైవేటు అధ్యాపకురాలి దారుణహత్య

అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో గురువారం సాయంత్రం ఓ అధ్యాపకురాలు దారుణ హత్యకు గురయ్యారు. తనకు ప్రత్యర్థుల నుంచి ప్రమాదం పొంచి ఉందని ఆమె పలుమార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

Updated : 04 Aug 2023 07:06 IST

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో దారుణం
పోలీసులకు ముందస్తుగా ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో గురువారం సాయంత్రం ఓ అధ్యాపకురాలు దారుణ హత్యకు గురయ్యారు. తనకు ప్రత్యర్థుల నుంచి ప్రమాదం పొంచి ఉందని ఆమె పలుమార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వేంపల్లె విద్యుత్తు ఉపకేంద్రంలో డ్యూటీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న మదనపల్లె పట్టణంలోని శివాజీనగర్‌కు చెందిన కదీర్‌ అహ్మద్‌కు మదనపల్లెలోని బీకేపల్లెకు చెందిన రుక్సానా (32)తో ఆరేళ్ల కిందట వివాహమైంది. ఆమె మదనపల్లెలోని శ్రీజ్ఞానాంబిక జూనియర్‌ కళాశాలలో ఆంగ్ల అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. వివాహమైన మూడేళ్ల అనంతరం కూడా ఆమెకు పిల్లలు కలగకపోవడంతో ఆమె అనుమతితోనే కదీర్‌ అహ్మద్‌ మదనపల్లె పట్టణంలోని అప్పారావుతోటకు చెందిన ఆయేషాను రెండో వివాహం చేసుకున్నారు. కొన్ని రోజులు వీరి కాపురం సజావుగా సాగింది. సుమారు 18 నెలల కిందట మొదటి భార్య రుక్సానాకు ఆడపిల్ల పుట్టింది.

దీంతో అప్పటి నుంచి కదీర్‌ అహ్మద్‌ ఆమె వద్దనే ఉంటున్నారు. ఈ విషయమై ఆయనకు, రెండో భార్యకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రుక్సానా వల్లనే తన భర్త తన వద్దకు రావడం లేదని, మొదటి భార్య విషయం చెప్పకుండా తనను వివాహం చేసుకున్నాడని రుక్సానా ఇంటికి తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఆయేషా గొడవ పెట్టుకుంది. మొదటి భార్య ఉండగా తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని ఆమె భర్త, రుక్సానాతో పాటు వారి కుటుంబ సభ్యులపై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. దీనిపై కోర్టులో కేసు నడుస్తోంది. ఇదిలా ఉండగా గత రెండు నెలలుగా ఆయేషా సోదరులు, కుటుంబ సభ్యులు రుక్సానా పని చేస్తున్న కళాశాలకు వద్దకు వెళ్లి రెక్కీ నిర్వహిస్తున్నారు. ఇది తెలిసి రుక్సానా ఈ ఏడాది ఫిబ్రవరి 1న రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం సాయంత్రం తాను పనిచేస్తున్న కళాశాల నుంచి ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ప్రశాంత్‌నగర్‌ సమీపంలోని ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమెకు అడ్డుగా ఉండి కారం జల్లి ఆమె గొంతులో పొడిచారు.

అటుగా వస్తున్న విద్యార్థులు  వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా వారు పరారయ్యారు. రుక్సానా గొంతులో పొడవడంతో ఆమె నడిరోడ్డుపైనే కన్నుమూసింది. విషయం తెలుసుకున్న డీఎస్పీ కేశప్ప, సీఐలు మురళీకృష్ణ, మహబూబ్‌బాషా ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న రుక్సానా తండ్రి మహమ్మద్‌ ఆలీ, సోదరి మస్తానీ సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతోనే తమ బిడ్డ హత్యకు గురైందని ఆరోపించారు. పోలీసులు వారిని వారించే ప్రయత్నం చేయగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలీసులు రుక్సానా మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హత్య విషయం తెలుసుకున్న ఎస్పీ గంగాధర్‌రావు మదనపల్లెకు చేరుకుని మృతురాలి బంధువులను విచారించారు. నిందితులను త్వరగా పట్టుకోవాలని డీఎస్పీని ఆదేశించారు.

పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు

రుక్సానా హత్య పథకం ప్రకారమే జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. గంటల వ్యవధిలోనే ఆయేషా సోదరుడు సులేమాన్‌, అతడి స్నేహితులు అహ్మద్‌, ప్యారేజాన్‌లను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ కేశప్ప వెల్లడించారు. తన సోదరికి అడ్డుగా ఉన్న రుక్సానాను హత్య చేసేందుకు పథకం ప్రకారమే ఆమెను వెంబడించి చంపినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని