ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది.

Published : 26 Apr 2024 04:29 IST

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన

సిరిసిల్ల గ్రామీణం, తంగళ్లపల్లి, న్యూస్‌టుడే: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన ఆంకారపు మల్లేశం (54) గ్రామంలో సాంచాలు నడుపుతూ కుటుంబాన్ని పోషించేవారు. భార్య భారతి బీడీలు చుడుతూ చేదోడు వాదోడుగా ఉండేది. గత నెల రోజులుగా పని లేకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో తీవ్ర మనోవేదనకు గురైన మల్లేశం గ్రామ శివారులోని చెట్టుకు నూలు పోగుతో ఉరేసుకొన్నారు. మృతునికి భార్య భారతి, కుమారుడు మహేశ్‌, కూతురు మనీషా ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శిక్షణ ఐపీఎస్‌ రాహుల్‌రెడ్డి తెలిపారు.

సిరిసిల్ల పట్టణంలోని పద్మనగర్‌కు చెందిన అడిచర్ల కైలాసం- లక్ష్మి(పద్మ) దంపతులకు ఇద్దరు కుమారులు. తండ్రి కైలాసంకు పక్షవాతం కాగా, తల్లి బీడీలు చుడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. చిన్న కుమారుడు సాయి వార్పిన్‌ కార్మికుడిగా పని చేస్తూ తల్లికి ఆసరగా ఉండేవారు. నెల రోజులుగా పని లేకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన సాయి రేకుల షెడ్డులో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ రఘుపతి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని