ఫోన్లు చేశారు... కోట్లు కొల్లగొట్టారు

అనర్గళంగా హిందీ, ఇంగ్లిష్‌లో సంభాషణ.. అనుకూలంగా మారిన సాంకేతిక పరిజ్ఞానం.. బ్యాంకింగ్‌ రంగంపై ఉన్న పట్టుతో ఘరానా మోసానికి తెగబడ్డారు వారు. ఏడాది వ్యవధిలోనే వందల కోట్ల రూపాయలు కొట్టేశారు. పోలీసుశాఖను కూడా విస్మయానికి గురిచేశారు.

Updated : 03 Dec 2021 13:42 IST

ఎస్‌బీఐ కాల్‌ సెంటర్‌ పేరుతో దోపిడీ
దిల్లీ కేంద్రంగా సైబర్‌ నేరగాళ్ల ఘరానా మోసం
దేశంలోనే పెద్ద  నేరమన్న సీపీ రవీంద్ర

వివరాలు వెల్లడిస్తున్న సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర, చిత్రంలో స్వాధీనం సెల్‌ఫోన్‌లు, పరికరాలు

ఈనాడు, హైదరాబాద్‌: అనర్గళంగా హిందీ, ఇంగ్లిష్‌లో సంభాషణ.. అనుకూలంగా మారిన సాంకేతిక పరిజ్ఞానం.. బ్యాంకింగ్‌ రంగంపై ఉన్న పట్టుతో ఘరానా మోసానికి తెగబడ్డారు వారు. ఏడాది వ్యవధిలోనే వందల కోట్ల రూపాయలు కొట్టేశారు. పోలీసుశాఖను కూడా విస్మయానికి గురిచేశారు. కొత్త తరహాలో నేరానికి తెరతీసిన 28 మంది ముఠా సభ్యులను సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. దేశంలోనే అతి పెద్ద సైబర్‌ నేరంగా చెబుతున్న ఈ దందా వివరాలను గురువారం సీపీ స్టీఫెన్‌ రవీంద్ర వెల్లడించారు.

దిల్లీ ఉత్తమ్‌నగర్‌కు చెందిన నిఖిల్‌ మదాన్‌ డిగ్రీ వరకు చదువుకున్నాడు. బ్యాంకు లావాదేవీలపై పూర్తిగా పట్టుంది. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసిన ఈయన తేలిక మార్గంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. బిహార్‌లోని ముర్షీద్‌ ఆలం అనే వ్యక్తి ద్వారా బ్యాంకు ఖాతాదారుల సమాచారం రాబట్టాడు. యూపీకు చెందిన ఫర్మాన్‌ హుస్సేన్‌ నుంచి లక్షలాది ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు ఖాతాదారుల వివరాలు తీసుకున్నాడు. వికాస్‌ అనే మరొకరి ద్వారా వివిధ బ్యాంకుల్లో 49 ఖాతాలు తెరిచాడు. వీరంతా దిల్లీకి చెందిన పింకీ కుమారి అనే టెలీకాలర్స్‌ శిక్షకురాలితో కలిసి.. ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి? ఎటువంటి వివరాలు రాబట్టాలి? ఖాతాదారులను బుట్టలో పడేసి సొమ్ము స్వాహా చేసేంత వరకూ టెలీకాలర్స్‌ ఎలా నడచుకోవాలి? అనే అంశాలపై కొందరు యువతీ, యువకులకు శిక్షణ నిచ్చి మోసాలకు తెరలేపారు. ఏడాది క్రితం నకిలీ కాల్‌సెంటర్‌ కార్యకలాపాలు మొదలుపెట్టారు.

స్పూఫింగ్‌ అప్లికేషన్స్‌తో బురిడీ

సిల్వర్‌ డయలర్‌ స్పూఫింగ్‌ అప్లికేషన్స్‌ (ఎంవోఎస్‌ఐపీ) ద్వారా అసలైన +18601801290 ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు కస్టమర్‌ కేర్‌ నంబరు నుంచే ఖాతాదారులకు కాల్‌ చేసేవారు. క్రెడిట్‌ లిమిట్‌ పెంచుతామని, ఇన్సూరెన్స్‌, రెన్యువల్‌, కొత్త కార్డు తదితర సేవలు అందిస్తామంటూ ఖాతాదారులను బురిడీ కొట్టించేవారు. టోల్‌ఫ్రీ నంబరు కూడా నిజమైనదే కావడం...టెలీకాలర్స్‌ చెప్పే వివరాలు, ఫోన్‌ నంబరు, చిరునామా సరైనదే కావడంతో ఖాతాదారులు తేలిగ్గా నమ్మేవారు. కార్డు నంబర్లు, గడువు ముగింపు తేదీ, సీవీవీ వివరాలను పంచుకునేవారు. అవన్నీ చేజిక్కించుకుని ఓటీపీ వచ్చాక క్రెడిట్‌ కార్డులోని సొమ్మును వికాస్‌ బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించి ఏటీఎం కేంద్రాల ద్వారా విత్‌డ్రా చేసుకునేవారు.

రోజుకు రూ.కోటి...

టెలీకాలర్లకు లక్ష్యాన్ని నిర్దేశించి వీలైనంత పెద్దమొత్తంలో సొమ్ము కొల్లగొట్టారు. ఒకేరోజు రూ.కోటి వరకూ కాజేసిన సందర్భాలున్నాయి. ఏడాదిలోనే దేశవ్యాప్తంగా ఎస్‌బీఐ క్రెడిట్‌కార్డు ఖాతాదారులకు 33,000 ఫోన్‌కాల్స్‌ చేసి వందల కోట్ల రూపాయలు కాజేశారు. ఎస్‌బీఐ అధికారుల దృష్టికి వచ్చినా పసిగట్టడం కష్టమైంది. ఈ దందాపై దేశంలోని వివిధ నగరాల్లో 209, సైబరాబాద్‌ పరిధిలో 14 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది అక్టోబరు 2న సైబరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులకు ఒకరు రూ.1,03,832, మరొకరు రూ.60,780 పోగొట్టుకున్నట్టు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన దర్యాప్తు బృందం 20-25 రోజులపాటు శ్రమించి మాయగాళ్ల జాడ గుర్తించారు. ముఠా సభ్యులను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి కారు, ద్విచక్ర వాహనం, 30 మొబైల్‌ ఫోన్లు, 3 ల్యాప్‌టాప్‌లు,  ఒక రూటర్‌ స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు ఖాతాలను నిలుపుదల చేశారు. బ్యాంకు లావాదేవీలపై ఫోరెన్సిక్‌ ఆడిటింగ్‌ చేయనున్నారు. ఎస్‌బీఐ క్రెడిట్‌కార్డు ఖాతాదారుల సమాచారం బయట వ్యక్తులకు చేరడంపై ఆరా తీస్తున్నట్టు సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. ఈ వ్యవహారంలో బ్యాంకు సిబ్బంది ప్రమేయంపై కూడా దర్యాప్తు చేస్తామని స్పష్టంచేశారు. వినియోగదారులు కార్డు వివరాలు, ఓటీపీ ఎవరికీ వెల్లడించవద్దని, కొత్త క్రెడిట్‌, డెబిట్‌కార్డులు చేతికి అందగానే పిన్‌ నంబరు మార్చాలని సూచించారు. దేశంలోనే అతిపెద్ద సైబర్‌ నేరాన్ని ఛేదించిన బృందంలో సభ్యులైన సైబర్‌ క్రైం ఏసీపీ జి.శ్రీధర్‌, ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాస్‌, ఎస్సైలు ఎస్‌.రాజేందర్‌, జి.శేఖర్‌, ఏఎస్సై వెంకటరెడ్డి, కానిస్టేబుళ్లు నందూ యాదవ్‌, కె.శ్యామ్‌కుమార్‌, రాజు రాథోడ్‌, బి.ప్రభాకర్‌, రాజా రమేష్‌, సందీప్‌రెడ్డి, మహేశ్‌గౌడ్‌, నరేష్‌, ఎండీ అర్హద్‌, పి.కవితలను అభినందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని