TS News: అరగంటలో తిరిగొస్తామని వెళ్లి..ఇద్దరు యువకుల సజీవదహనం

అరగంటలో తిరిగొస్తామని ఇంట్లో చెప్పి జాతీయ రహదారిపైకి ద్విచక్రవాహనంపై వచ్చిన యువకులు అతివేగం కారణంగా జరిగిన ప్రమాదంలో వాహనం సహా సజీవ దహనమయ్యారు. ఈ ఘటన మెదక్‌ జిల్లా టేక్మాల్‌ మండల పరిధి

Updated : 31 Dec 2021 07:50 IST

ద్విచక్రవాహనం ట్యాంకు పగిలి ఘటన

     వాసుదేవ్‌                   దత్తు   

టేక్మాల్‌, న్యూస్‌టుడే: అరగంటలో తిరిగొస్తామని ఇంట్లో చెప్పి జాతీయ రహదారిపైకి ద్విచక్రవాహనంపై వచ్చిన యువకులు అతివేగం కారణంగా జరిగిన ప్రమాదంలో వాహనం సహా సజీవ దహనమయ్యారు. ఈ ఘటన మెదక్‌ జిల్లా టేక్మాల్‌ మండల పరిధి బొడ్మట్‌పల్లి శివారులో 161వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి జరిగింది. టేక్మాల్‌ పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్ద మండలం ఎస్గి గ్రామానికి చెందిన వాసుదేవ్‌(22) నారాయణ్‌ఖేడ్‌ మండలం మంగల్‌పేట గ్రామంలో స్థిరపడ్డారు. అదే గ్రామానికి చెందిన దత్తు(23), వాసుదేవ్‌లు మంచి స్నేహితులు. బుధవారం రాత్రి వారిద్దరూ నారాయణ్‌ఖేడ్‌కు వెళ్లి అక్కడ తెలిసిన వారి అవెంజర్‌ ద్విచక్ర వాహనాన్ని తీసుకుని సంగారెడ్డికి వస్తున్నారు. టేక్మాల్‌ మండలం బొడ్మట్‌పల్లి సమీపంలో 161వ నంబరు జాతీయ రహదారిపై అతివేగంగా అపసవ్య దిశలో వచ్చారు. దత్తు వాహనం నడుపుతుండగా, వాసుదేవ్‌ వెనుక కూర్చున్నారు. బొడ్మట్‌పల్లి వద్దకు రాగానే వాహనం అదుపు తప్పి రోడ్డు మధ్యలో డివైడర్‌ కోసం తవ్విన గుంతలో పడ్డారు. వాహనం పెట్రోల్‌ ట్యాంకు పగిలి పెద్దఎత్తున మంటలు చెలరేగగా.. ఇద్దరికీ మంటలంటుకున్నాయి. ఆ మార్గంలో వెళుతున్నవారు ‘100’కు ఫోన్‌ చేయగా.. టేక్మాల్‌ పోలీసులు చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే దత్తు పూర్తిగా కాలిపోయారు. సగానికి పైగా మంటలు అంటుకొన్న వాసుదేవ్‌ను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించేలోపు ప్రాణాలొదిలారు. వాసుదేవ్‌ కేబుల్‌ ఆపరేటర్‌ వద్ద కార్మికుడిగా, దత్తు గ్యాస్‌ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నారు. వాసుదేవ్‌ తండ్రి కాశీనాథ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు   పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

దగ్ధమైన ద్విచక్రవాహనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని