Train Accident: పట్టాలపై మృత్యుఘోష..

శ్రీకాకుళం జిల్లా సిగడాం, విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలాల మధ్య బాతువ సమీపంలో సోమవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం సంభవించింది. కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ ఐదుగురు ప్రయాణికులను ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

Updated : 12 Apr 2022 06:08 IST

చీపురుపల్లి- బాతువ మధ్య ప్రమాదం
రైలు ఢీకొని ఐదుగురు అక్కడికక్కడే మృతి
జి.సిగడాం, చీపురుపల్లి, న్యూస్‌టుడే

శ్రీకాకుళం జిల్లా సిగడాం, విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలాల మధ్య బాతువ సమీపంలో సోమవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం సంభవించింది. కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ ఐదుగురు ప్రయాణికులను ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కోయంబత్తూరు నుంచి సిల్‌చెర్‌ వెళ్తున్న గువాహటి ఎక్స్‌ప్రెస్‌ చీపురుపల్లి దాటిన తర్వాత ఒక బోగీ లోంచి పొగలు వచ్చాయి. ఆందోళనకు గురైన ప్రయాణికులు చైన్‌ లాగి రైలు ఆపేశారు. కొందరు కిందకు దిగి పట్టాలపై నిల్చున్నారు. ఇదే సమయంలో భువనేశ్వర్‌ నుంచి విశాఖ వైపు వెళ్తున్న కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ వేగంగా దూసుకొచ్చి పట్టాలపై ఉన్న ప్రయాణికులను ఢీకొట్టింది. ఈ ఘటనలో మృతుల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. మృతుల్లో ఇద్దరు అస్సాంకు చెందినవారుగా గుర్తించారు. మిగిలిన వారు ఎక్కడివారనేది తెలియరాలేదు. గాయపడిన వ్యక్తిని శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇతను ఒడిశా రాష్ట్రంలోని బ్రహ్మపుర ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆ ప్రాంతమంతా చిమ్మచీకటిగా ఉండటంతో సహాయక చర్యలకు ఇబ్బందిగా మారింది. రైల్వే, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ శ్రీకేష్‌ బి లఠ్కర్‌ సహాయక చర్యల్లో పాల్గొనాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. 

రైలు ప్రమాదంపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి

ఈనాడు-అమరావతి: రైలు ఢీకొని పలువురు మృతిచెందిన ఘటనపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు అన్నివిధాలా సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించిన ప్రాథమిక వివరాలను అధికారులు, సీఎంకు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని