Road Accident: ఒకరి తప్పు.. తొమ్మిది ప్రాణాలు బలి

అతివేగం కారణంగా తొమ్మిది నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. డ్రైవర్‌ చేసిన తప్పు వారందరి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పోలీసు స్టేషన్‌

Updated : 09 May 2022 11:14 IST

మరో ఇద్దరి పరిస్థితి విషమం.. 14 మందికి గాయాలు
అతివేగంతో లారీని ఢీకొట్టిన వాహనం
టాటా ఏస్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యంతో దారుణం
కామారెడ్డి జిల్లాలో విషాదం

ఈనాడు డిజిటల్‌ - కామారెడ్డి, న్యూస్‌టుడే - ఎల్లారెడ్డి, నిజాంసాగర్‌: అతివేగం కారణంగా తొమ్మిది నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. డ్రైవర్‌ చేసిన తప్పు వారందరి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పోలీసు స్టేషన్‌ పరిధిలోని హసన్‌పల్లి గేటు వద్ద ఆదివారం సాయంత్రం టాటా ఏస్‌ వాహనం.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. వాహనంలో 25 మంది ప్రయాణిస్తుండగా, వారిలో తొమ్మిది మంది మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన 14 మందికి కూడా గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పిట్లం మండలం చిల్లర్గికి చెందిన సౌదర్‌పల్లి మాణిక్యం గత గురువారం మరణించారు. దశదినకర్మ అనంతరం ఆచారం ప్రకారం వారి కుటుంబ సభ్యులను ఆదివారం టాటా ఏస్‌ వాహనంలో ఎల్లారెడ్డి పట్టణంలోని వారపుసంతలో అంగడిదింపుడు కార్యక్రమానికి తీసుకెళ్లారు. తిరుగుప్రయాణంలో, వీరి వాహనాన్ని డ్రైవర్‌ అతివేగంగా నడిపి.. నిజాంసాగర్‌ మండలం హసన్‌పల్లి వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టాడు. ప్రమాదాన్ని తప్పించేందుకు లారీ డ్రైవర్‌ రోడ్డుకిందకు దూసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. డ్రైవర్‌ సాయిలు (25), లచ్చవ్వ (45) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను బాన్సువాడ, ఎల్లారెడ్డి ఆసుపత్రులకు తరలించారు. అక్కడ అంజవ్వ (40), వీరమణి (38), సాయవ్వ(40) మరణించారు. కొందరిని నిజామాబాద్‌ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా అక్కడ వీరవ్వ (70), గంగామణి(45) మృతి చెందారు. బాన్సువాడ ఆసుపత్రి నుంచి నిజామాబాద్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా ఎల్లయ్య (45), పోచయ్య (44) దారిలోనే చనిపోయారు. ప్రమాద స్థలాన్ని ఎల్లారెడ్డి సీఐ శ్రీనివాస్‌ పరిశీలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. టాటా ఏస్‌ను డ్రైవర్‌ అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని బాధితులు చెబుతున్నారు.

అంగడిదింపుడు అంటే?

మరణించిన వ్యక్తి దశదిన కర్మ పూర్తయిన మరుసటి రోజు ఈ తంతు చేపడతారు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు, బంధువులను వారపుసంతకు తీసుకెళ్తారు. మృతుని చితికి నిప్పంటించిన వ్యక్తికి సంతలోని దినుసులు, నిత్యావసర వస్తువులను ముట్టించడమే అంగడిదింపుడుగా పేర్కొంటారు. ఈ ఆచారాన్ని పూర్తిచేసేందుకే వీరంతా ఎల్లారెడ్డికి వెళ్లారు. తిరిగి స్వస్థలాలకు ప్రయాణిస్తుండగా, ప్రమాదం బారిన పడ్డారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని