Hyderabad News: అన్నను కలిపిస్తే... పరువు దక్కిందేమో అడుగుతా?

‘మా నాన్నకు ఆడపిల్లలంటే ఇష్టం. చాలా బాగా చూసుకునేవారు. నాన్నకు చెప్పి నాగరాజును పెళ్లి చేసుకోవాలనుకున్నా. మా సోదరుడు మోబిన్‌ తీవ్రంగా కొట్టడం వల్లే నాలుగేళ్ల కిందట ఆయన మరణించారు. ఆయనే బతికుంటే ఈ ఘటన జరిగేది కాదు. జైలులో ఉన్న మా అన్నతో

Updated : 09 May 2022 06:47 IST

హత్యకు గురైన నాగరాజు భార్య ఆశ్రిన్‌

ఈనాడు, వికారాబాద్‌: ‘మా నాన్నకు ఆడపిల్లలంటే ఇష్టం. చాలా బాగా చూసుకునేవారు. నాన్నకు చెప్పి నాగరాజును పెళ్లి చేసుకోవాలనుకున్నా. మా సోదరుడు మోబిన్‌ తీవ్రంగా కొట్టడం వల్లే నాలుగేళ్ల కిందట ఆయన మరణించారు. ఆయనే బతికుంటే ఈ ఘటన జరిగేది కాదు. జైలులో ఉన్న మా అన్నతో అయిదు నిమిషాలు మాట్లాడే అవకాశం ఇప్పించండి. ఈ హత్య చేశాక పరువు దక్కిందేమో అడుగుతా’ అంటూ ఆశ్రిన్‌ సుల్తానా కోరుతున్నారు. సోదరి తమకు నచ్చని ప్రేమపెళ్లి చేసుకున్నారనే కక్షతో ఈ నెల 4న హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో సయ్యద్‌ మోబిన్‌ అహ్మద్‌ తన బావతో కలిసి నాగరాజును దారుణంగా కొట్టి హతమార్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆశ్రిన్‌ వికారాబాద్‌ జిల్లా మర్పల్లిలో మెట్టినింట ఉన్నారు. ఆమెను కలిసి ఓదార్చేందుకు ప్రజాసంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు వస్తున్నారు. ఈ సందర్భంగా వచ్చిన వారికి ఆమె తన ఆవేదనను, కుటుంబ పరిస్థితులను, తన సోదరుడి మనస్తత్వం గురించి వివరిస్తున్నారు. ఆదివారం ఆమె ‘ఈనాడు’కు తన ఆవేదనను వినిపించారు. ఇంటర్‌ నుంచి ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడిందన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కలిసి జీవించాలనే కోరికతో తాము పెళ్లి చేసుకున్నామని చెప్పారు. వివాహం చేసుకుంటే అన్న తమను కచ్చితంగా చంపేస్తాడని తన తల్లి కూడా జాగ్రత్తలు చెప్పారన్నారు. మోబిన్‌ ప్రవర్తన చిన్ననాటి నుంచి క్రూరంగానే ఉండేదని ఆశ్రిన్‌ చెప్పారు. తండ్రిని చాలా సార్లు కొట్టాడని, తమ్ముడిని కూడా ఇష్టమొచ్చినట్లు కొడుతూ ఉండేవాడన్నారు. నాన్న మరణించాక ఈ ప్రవర్తన మరీ పెరిగిందన్నారు. హత్యకు కారకులను కఠినంగా శిక్షించాలని ఆశ్రిన్‌ వేడుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని