Viveka Murder Case: ‘శివశంకర్‌రెడ్డితో మీకు ప్రమాదం’

‘మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకా హత్య కేసులో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి జైలులో ఉన్నంతవరకే సీబీఐ బృందం సురక్షితంగా ఉంటుంది. అతను బెయిలుపై బయటకు రాగానే సీబీఐ బృందాన్ని చంపేస్తాడు’....

Published : 12 May 2022 08:23 IST

బయటకు రాగానే సీబీఐ బృందాన్ని చంపేస్తాడు..
గుర్తుతెలియని వ్యక్తి బెదిరించాడంటూ పోలీసులకు సీబీఐ డ్రైవరు ఫిర్యాదు

ఈనాడు, అమరావతి: ‘మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకా హత్య కేసులో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి జైలులో ఉన్నంతవరకే సీబీఐ బృందం సురక్షితంగా ఉంటుంది. అతను బెయిలుపై బయటకు రాగానే సీబీఐ బృందాన్ని చంపేస్తాడు’ అంటూ ముసుగు ధరించిన ఓ గుర్తు తెలియని వ్యక్తి తనను బెదిరించాడంటూ సీబీఐ అధికారుల వాహన డ్రైవరు షేక్‌ వలీ బాషా కడప పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీబీఐ బృందం వెంటనే కడప నుంచి విజయవాడకు తిరిగి వెళ్లిపోవాలని, లేకుంటే బాంబు వేసి పేల్చేస్తానని, విషయాన్ని వారికి చెప్పాలని ఆ ముసుగు మనిషి హెచ్చరించినట్లు ఫిర్యాదులో పొందుపరిచారు. ఆయన మంగళవారం ఫిర్యాదు చేయగా పూర్తి ప్రతి బుధవారం వెలుగు చూసింది. ‘సీబీఐ ఎస్సై అంకిత్‌ యాదవ్‌ ఆదేశాల మేరకు జీత్‌ పంజాబీ దాబా నుంచి భోజనం తేవడానికి ఈ నెల 8న మధ్యాహ్నం 1.40 గంటలకు కడప హరిత హోటల్‌ నుంచి నేను వెళ్లా. దారి మధ్యలో పాత బైపాస్‌ రోడ్డులోని పద్మావతి వీధిలో దస్తగిరి గ్రానైట్‌ షాప్‌ ఎదురుగా ముసుగు వేసుకున్న ఒక వ్యక్తి రోడ్డుకు అడ్డంగా వచ్చి నా వాహనాన్ని (ఏపీ 16టీఈ 0001) ఆపి నన్ను బెదిరించాడు. గత వారం రోజుల వ్యవధిలో నేను నడిపే వాహనంతోపాటు సీబీఐ ప్రోటోకాల్‌కు చెందిన మరో వాహనానికి సంబంధించిన కదలికల గురించి చెప్పాడు’ అని డ్రైవరు వెల్లడించారు. ‘ఈ నెల 6న విజయవాడ రైల్వేస్టేషన్‌ సమీపంలోని సీబీఐ క్యాంపు కార్యాలయం నుంచి స్పెషల్‌ పీపీ చెన్నకేశవులును కారులో ఎక్కించుకుని అమరావతి హైకోర్టుకు తీసుకెళ్లావు. నీ వాహనాన్ని అక్కడ పార్కింగ్‌లో నిలిపి ఉంచావు. ఆ తర్వాత బస్టాండు సమీపంలోని ఆర్టీవో కార్యాలయానికి వెళ్లావు. 7న విజయవాడలోని శైలజా ట్రావెల్స్‌ కార్యాలయానికి వెళ్లావంటూ నా ప్రతి కదలిక గురించీ చెప్పాడు. ఈ కేసులో ఉన్నత వ్యక్తుల ప్రమేయాన్ని చూసి ఈ విషయాల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. దీని ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయగలరు’ అని డ్రైవర్‌ అందులో వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని