పీజీ చదువుకు ఆర్థిక ఇబ్బందులు.. యువ వైద్యుడి ఆత్మహత్య!

ఏపీలోని పెద్దాపురానికి చెందిన ఓ యువ వైద్యుడు హైదరాబాద్‌లోని ఓ లాడ్జిలో అధిక మోతాదులో మాత్రలు మింగి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు విడిచారు. ఎంబీబీస్‌ పూర్తిచేసి, పీజీ సీటు అన్వేషణలో ఉన్న ఆయన అనూహ్యంగా దూరం

Published : 27 May 2022 06:10 IST

బేగంబజార్‌, న్యూస్‌టుడే: ఏపీలోని పెద్దాపురానికి చెందిన ఓ యువ వైద్యుడు హైదరాబాద్‌లోని ఓ లాడ్జిలో అధిక మోతాదులో మాత్రలు మింగి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు విడిచారు. ఎంబీబీస్‌ పూర్తిచేసి, పీజీ సీటు అన్వేషణలో ఉన్న ఆయన అనూహ్యంగా దూరం కావడంతో కుటుంబీకులు విషాదంలో మునిగిపోయారు. అఫ్జల్‌గంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.రవీందర్‌రెడ్డి, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ జిల్లా, పెద్దాపురం పట్టణానికి చెందిన కె.రాముకు  అనిల్‌కుమార్‌(31)తో పాటు మరో కుమార్తె ఉంది. అనిల్‌ ఇంటర్‌ వరకు స్థానికంగా చదివి, ఖమ్మం జిల్లాలోని మమతా మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ పూర్తిచేశారు. అనంతరం పీజీ సీటు అన్వేషణలో ఉన్నారు. తండ్రికి పెద్దాపురంలో లాడ్జీల వ్యాపారం ఉంది. ఈనెల 22న అనిల్‌కుమార్‌ అఫ్జల్‌గంజ్‌లోని పెరల్‌ సిటీ లాడ్జిలో దిగారు. గురువారం మధ్యాహ్నం రూమ్‌బాయ్‌.. అనిల్‌ గదికి వెళ్లి తలుపు తట్టారు. ఎంతకీ తీయకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి వెళ్లిన పోలీసులు తలుపులు బద్దలుగొట్టి లోపల ప్రవేశించారు. విగతజీవిగా పడి ఉన్న అనిల్‌కుమార్‌ బీపీ, షుగర్‌, అల్బుమిన్‌ వంటి మాత్రలు మితిమీరి మింగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మాత్రల ఖాళీ స్ట్రిప్పులను, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకొన్నారు. ఆత్మహత్యకు పాల్పడక ముందు అనిల్‌ తన తల్లిదండ్రులు, స్నేహితులకు వాట్సప్‌ కాల్‌ చేశారని తెలిసింది. మేనేజ్‌మెంట్‌ కోటాలో పీజీ సీటు కోసం సుమారు రూ.కోటి అవసరమని అనిల్‌ భావించగా.. తల్లిదండ్రులు రూ.20లక్షల వరకు సమకూర్చారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మృతుడు విషాహారం తిన్నాడా? బలప్రయోగం జరిగిందా?.. అనే కోణాల్లో ఫోరెన్సిక్‌ వైద్యులు నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని