బీఎస్‌ఎన్‌ఎల్‌ సొసైటీ నిధుల గోల్‌మాల్‌ వ్యవహారం

తెలంగాణ సీఐడీ విభాగంలో ఓ విచిత్ర కేసు   నమోదైంది. రెండేళ్ల క్రితం మృతిచెందిన ఒకరిపై సీఐడీ పోలీసులు తాజాగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. నల్గొండ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎంప్లాయీస్‌....

Updated : 26 Jun 2022 06:31 IST

మృతుడిపై సీఐడీ ఎఫ్‌ఐఆర్‌!
నల్గొండలో సుమారు రూ.7 కోట్ల గల్లంతుపై దర్యాప్తు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ సీఐడీ విభాగంలో ఓ విచిత్ర కేసు నమోదైంది. రెండేళ్ల క్రితం మృతిచెందిన ఒకరిపై సీఐడీ పోలీసులు తాజాగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. నల్గొండ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎంప్లాయీస్‌ క్రెడిట్‌ కోఆపరేటివ్‌ సొసైటీలో వెలుగుచూసిన నిధుల గల్లంతు వ్యవహారంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ కోఆపరేటివ్‌ సొసైటీ సుమారు 22 ఏళ్ల క్రితం ఏర్పాటైంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులే సభ్యులు. ఈ సొసైటీలో భారీఎత్తున ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు సేకరించారు. దీనికి బీఎస్‌ఎన్‌ఎల్‌లోనే పనిచేసిన షణ్ముఖచారి 2010వరకు కోశాధికారి. తర్వాత 2020 వరకు కార్యదర్శిగా పనిచేశారు. చాలాకాలం తర్వాత ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని సభ్యులు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం బహిర్గతమైంది. ఈ అక్రమాలపై సహకారశాఖ విచారణ చేపట్టింది. సొసైటీ సుమారు రూ.17 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను సేకరించినట్లు తేలింది. సుమారు రూ.7 కోట్లకు ఇంకా లెక్క తేలలేదు.

విచారణ క్రమంలోనే షణ్ముఖచారి అనుమానాస్పద మృతి

2020 జనవరిలో స్వచ్ఛంద పదవీవిరమణ చేసిన షణ్ముఖచారి అదే ఏడాది జూన్‌ చివరివారంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. చౌటుప్పల్‌ మండలం మల్కాపూర్‌ శివార్లలో సగం కాలిన స్థితిలో ఆయన విగతజీవిగా కనిపించారు. ఓవైపు విచారణ కొనసాగుతుండగా సొసైటీలో కీలకమైన వ్యక్తి మరణించడంతో సొసైటీలో అక్రమాలను నిగ్గు తేల్చాలని పలువురు సభ్యులు విన్నవించడంతో ప్రభుత్వం సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. ఆర్థిక లావాదేవీల్లో అక్రమాలపై ఇటీవలే కేసు నమోదు చేసిన సీఐడీ.. సహకార శాఖ నుంచి కీలక సమాచారం సేకరించింది. ఈ క్రమంలోనే తొలుత మృతిచెందిన షణ్ముఖచారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని