వారి కలలు... కల్లలయ్యాయి

ఆ ఇద్దరు యువకులూ ఎస్సై కావాలని అహోరాత్రాలూ శ్రమించారు. పరీక్షలు రాసి కలలు నెరవేర్చుకునే తరుణంలో విధి చిన్నచూపు చూసింది. రోడ్డు ప్రమాదాలు వారి

Updated : 08 Aug 2022 09:34 IST

ఎస్సై పరీక్షకు వెళుతూ ఒకరు.. పరీక్ష రాసి మరొకరి దుర్మరణం

వేర్వేరు రోడ్డు ప్రమాదాలతో రెండు కుటుంబాల్లో విషాదం

కమలాపూర్‌, జీడిమెట్ల, న్యూస్‌టుడే: ఆ ఇద్దరు యువకులూ ఎస్సై కావాలని అహోరాత్రాలూ శ్రమించారు. పరీక్షలు రాసి కలలు నెరవేర్చుకునే తరుణంలో విధి చిన్నచూపు చూసింది. రోడ్డు ప్రమాదాలు వారి ఆశలను, కలలను ఛిద్రం చేశాయి. ఒకరు పరీక్ష రాసి వస్తూ.. మరొకరు పరీక్షకు వెళ్తూ మృత్యువాత పడ్డారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం అంబాల, హైదరాబాద్‌లోని జీడిమెట్లలో జరిగిన ఈ విషాద ఘటనలు రెండు కుటుంబాలను శోకసంద్రంలో ముంచాయి. కమలాపూర్‌ సీఐ సంజీవ్‌ తెలిపిన వివరాల ప్రకారం శనిగరం గ్రామానికి చెందిన గూడూరు నాగేందర్‌-భాగ్యలక్ష్మి దంపతుల రెండో కుమారుడు హరికృష్ణ (31) శనివారం ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యేందుకు ద్విచక్రవాహనంపై వెళుతుండగా, అంబాల గ్రామ శివారులో ఎదురుగా అతివేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. తలకు, ముఖానికి తీవ్రగాయాలై హరికృష్ణ అక్కడికక్కడే మృతి చెందినట్లు సీఐ వివరించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్థులు ధర్నా చేశారు. ఆర్టీసీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి బస్సును ఠాణాకు తరలించారు. అదే బస్సు హరికృష్ణ వెనక వస్తున్న మరో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో అంబాల గ్రామానికి చెందిన జి.చంద్రమౌళికి తీవ్ర గాయాలయ్యాయి.

ట్యాంకర్‌ రూపంలో
ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష రాసి వెళుతున్న సమయంలో నీటి ట్యాంకర్‌ ఓ నిండు ప్రాణాన్ని చిదిమేసింది. ఆదివారం జీడిమెట్ల ఠాణా పరిధిలోని టీఎస్‌ఐఐసీ కూడలిలో ఈ విషాద ఘటన జరిగింది. ఎస్సై మన్మథరావు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలం అచ్చంపేట గ్రామానికి చెందిన మారు అంజయ్య (34) హైదరాబాద్‌లో ఉండి ఎస్సై నియామక పరీక్షకు సిద్ధమవుతున్నారు. ఆదివారం దుండిగల్‌లో ప్రాథమిక పరీక్ష రాశారు. పరీక్ష పూర్తయ్యాక ద్విచక్రవాహనంపై సోదరుడి కుమారుడి పెళ్లి కోసం నిజాంసాగర్‌ వెళుతుండగా టీఎస్‌ఐఐసీ కూడలి వద్ద వెనుక నుంచి వచ్చిన నీటి ట్యాంకర్‌ ఢీకొట్టడంతో వాహనంతో సహా కిందపడిపోయారు. అతనిపై నుంచి ట్యాంకర్‌ వెళ్లడంతో తల చిధ్రమై అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న భార్య, కుటుంబ సభ్యులు జీడిమెట్ల ఠాణాకు చేరుకున్నారు. మృతుడికి మూడేళ్ల కుమారుడున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని