ఫైరోటెక్‌ పరిశ్రమలో అగ్ని ప్రమాదం

అనకాపల్లి జిల్లా పరవాడ పరిధిలోని ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు లేకుండా నడుపుతున్న ఓ పరిశ్రమలో సోమవారం తెల్లవారుజామున 3.45 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. ఈ

Published : 09 Aug 2022 04:25 IST

పరవాడ, న్యూస్‌టుడే: అనకాపల్లి జిల్లా పరవాడ పరిధిలోని ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు లేకుండా నడుపుతున్న ఓ పరిశ్రమలో సోమవారం తెల్లవారుజామున 3.45 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయాలు కాగా మరో ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. మంటలు ఎగిసిపడి దట్టమైన పొగ కమ్మేయడంతో పాటు తీవ్ర దుర్వాసన రావడంతో పరిసర కంపెనీల కార్మికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానిక పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పరవాడ మండలం ఈ.భోనంగిలోని ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో ఫైరోటెక్‌ పరిశ్రమ ప్లాస్టిక్‌ వ్యర్థాల ద్వారా ఫైరింగ్‌ ఆయిల్‌ను ఉత్పత్తి చేసి విక్రయిస్తోంది. దీన్ని తారును వేడి చేయడానికి ఉపయోగిస్తారు. ఆయిల్‌ తయారుచేసే రియాక్టర్‌ వద్ద సోమవారం వేకువజామున ఒక్కసారిగా మంటలు చెలరేగి పక్కనున్న స్టోరేజ్‌ ట్యాంకుకు అంటుకోవడంతో స్వల్ప పేలుడు సంభవించింది. కంపెనీ పరిసరాల్లో నిల్వ ఉంచిన ప్లాస్టిక్‌ వ్యర్థాలు, బొగ్గు, కట్టెలకు మంటలు వ్యాపించాయి. సమీపంలో ఉన్న ఆయిల్‌ లారీ ట్యాంకర్‌ కాలిపోయింది. పరిశ్రమలో ఎటువంటి అగ్నిమాపక పరికరాలు లేకపోవడంతో.. రాంకీ, అనకాపల్లి, ఎన్టీపీసీ అగ్నిమాపక శకటాలతో సుమారు 2 గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రియాక్టర్‌ వద్ద అధిక ఉష్ణోగ్రత కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

పరిశ్రమలో కార్యకలాపాలకు అనుమతుల్లేవు

ప్రమాదంలో హెల్పర్‌ నూరుల్‌ఇస్లాంకు వీపు కాలి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడికి అగనంపూడి సీహెచ్‌సీలో ప్రాథమిక చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు తరలించారు. ఆపరేటర్‌ రహీముద్దీన్‌, మరో హెల్పర్‌ హసన్‌మియా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పీసీబీ అధికారులు నమూనాలను సేకరించారు. కంపెనీలో కార్యకలాపాలకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని పీసీబీ అధికారులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని