Sanju Samson: సంజు టైమొచ్చింది!.. ప్రపంచకప్‌ ముంగిట కేరళ కుర్రాడి డ్రీమ్‌ ఫామ్‌

రాజస్థాన్‌ కెప్టెన్ సంజు శాంసన్‌ ఎట్టకేలకు మళ్లీ జాతీయజట్టులోకి వచ్చాడు. పొట్టి కప్‌ కోసం ప్రకటించిన జట్టులో అతడికి చోటు దక్కిన విషయం తెలిసిందే.

Published : 10 May 2024 15:24 IST

పరిమిత ఓవర్ల క్రికెట్లో ఏదైనా ముఖ్యమైన సిరీస్‌ లేదా పెద్ద టోర్నీకి భారత జట్టును ఎంపిక చేస్తుంటే.. సంజు శాంసన్‌ను (Sanju Samson) ఎంపిక చేయాలన్న సామాజిక మాధ్యమాల్లో బలంగా డిమాండ్లు వినిపిస్తుంటాయి. అతడికి చోటు దక్కలేదంటే నిరసన వ్యక్తమవుతుంటుంది. కొన్నేళ్ల నుంచి ఇదే వరస. గత పర్యాయం టీ20 ప్రపంచకప్‌లో అతడికి అవకాశం దక్కనపుడు అతని అభిమానులు సెలక్టర్లపై విరుచుకుపడ్డారు. తన పేరు ట్విట్టర్లో ట్రెండ్‌ అయింది. ఈసారి పొట్టి కప్పు జట్టును ఎంపిక చేయబోతుండగా సంజు కోసం డిమాండ్‌ గట్టిగానే వినిపించింది. అయితే సెలక్టర్లు ఈసారి అతడికి మొండిచేయి చూపించకుండా అవకాశమిచ్చారు. ఐపీఎల్‌లో ఈసారి కేరళ కుర్రాడు ఎన్నడూ లేనంత నిలకడగా ఆడుతుండడంతో ప్రపంచకప్‌లోనూ రెచ్చిపోతాడనే ఆశలు కలుగుతున్నాయి.

కొన్ని రోజుల కిందట టీ20 ప్రపంచకప్‌ కోసం భారత జట్టును ప్రకటించినపుడు ఒక మీమ్‌ వైరల్‌ అయింది. అందులో సంజు ‘సింపతీ కోటా’లో అవకాశం దక్కించుకున్నట్లు పేర్కొన్నారు. నిజానికి సంజు తన ప్రదర్శన ఆధారంగానే అవకాశం దక్కించుకున్నప్పటికీ.. మిగతా యువ ఆటగాళ్లతో పోలిస్తే సంజుకు చాలినన్ని అవకాశాలు ఇవ్వలేదని అతడిపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు నిజంగానే జాలిపడుతుంటారు. ఐపీఎల్‌లో చాలా ఏళ్ల నుంచి శాంసన్‌ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. కాకపోతే ప్రతీ సీజన్లో కొన్ని మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడడం.. ఆ తర్వాత నిలకడ తప్పడం.. ఇదీ వరస. కానీ ఈసారి మాత్రం ఐపీఎల్‌లో మామూలుగా రెచ్చిపోవట్లేదు సంజు. మధ్యలో ఫామ్‌ కోల్పోకుండా నిలకడగా రాణిస్తున్నాడు.  ఈ సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌ల్లో 471 పరుగులు సాధించాడు శాంసన్‌. అతడి సగటు 67.28 కాగా.. స్ట్రైక్‌ రేట్‌ 163.54 కావడం విశేషం. ఇన్ని మ్యాచ్‌ల తర్వాత ఇలాంటి సగటు, స్ట్రైక్‌ రేట్‌ నమోదు చేయడం చిన్న విషయం కాదు. ప్రపంచకప్‌లో చోటు ఖాయమయ్యాక కూడా రిలాక్స్‌ అయిపోకుండా దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 86 పరుగుల సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు సంజు. ఐపీఎల్‌-17 అత్యధిక పరుగుల వీరుల్లో సంజు స్థానం 4. ఈసారి రాజస్థాన్‌ పాయింట్ల పట్టికలో దూసుకెళ్తుండడానికి ప్రధాన కారణం సంజూనే అనడంలో సందేహం లేదు. ప్రపంచకప్‌ ముంగిట శాంసన్‌ ఫామ్‌ భారత అభిమానులకు ఎంతో ఉత్సాహాన్నిస్తోంది.

ముద్ర వేస్తాడా?

ఐపీఎల్‌లో ఎప్పట్నుంచో రాణిస్తున్నప్పటికీ.. టీమ్‌ఇండియాలో సంజుకు దక్కిన అవకాశాలు తక్కువే. ఆ అవకాశాలను కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ముందుగా టీ20ల్లో అతడికి అవకాశాలు రాగా ఆ ఫార్మాట్లో 25 మ్యాచ్‌లు ఆడి 18.70 సగటుతో 374 పరుగులే చేశాడు. అందులో ఒక్క అర్ధశతకమే ఉంది. వన్డేల్లో సంజు ప్రదర్శన బాగానే ఉంది. 16 మ్యాచ్‌ల్లో 56.66 సగటుతో 510 పరుగులు సాధించాడు. అందులో దక్షిణాఫ్రికాపై దక్షిణాఫ్రికాలోనే సాధించిన శతకం (108) కూడా ఉంది. గత ఏడాది చివర్లో సాధించిన ఆ శతకమే సంజు అంతర్జాతీయ కెరీర్లో కీలక మలుపు. దీంతో అతడిపై సెలక్టర్లకు నమ్మకం కుదిరింది. ఇక ఈ ఐపీఎల్‌లో సంజు రెచ్చిపోవడంతో అతడికి జట్టులో చోటివ్వక తప్పలేదు. రిషబ్‌ పంత్‌ తర్వాత రెండో వికెట్‌ కీపర్‌గా కేఎల్‌ రాహుల్, ఇషాన్‌ కిషన్, జితేశ్‌ శర్మ లాంటి ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ.. నిలకడగా రాణిస్తున్న సంజుకే ఛాన్సిచ్చారు. ఇప్పటివరకు తన ప్రతిభకు పూర్తి న్యాయం చేయలేకపోతున్నాడని, వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోలేదని సంజుపై విమర్శలున్నాయి. అయితే ప్రస్తుత ఫామ్‌ చూస్తుంటే అతడి టైం వచ్చినట్లే అనిపిస్తోంది. టీ20 ప్రపంచకప్‌లో ఇదే దూకుడు కొనసాగిస్తే వన్డే, టీ20 జట్లలో అతడి స్థానం సుస్థిరం కావడం ఖాయం.

- ఈనాడు క్రీడావిభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని