MS DHONI - IPL 2024: గాయమా? వ్యూహమా? ధోనీ ‘9’లో రావడంపై ఫ్లెమింగ్‌ స్పందన ఇదీ!

చెన్నై ఎక్కడ మ్యాచ్‌ ఆడినా ప్రత్యేక ఆకర్షణ ఎంఎస్ ధోనీ. రెండు మ్యాచుల్లో మినహా ప్రతిసారీ అతడి బ్యాట్‌ నుంచి బౌండరీల వర్షం కురిసింది. మరోసారి అలాంటి ఇన్నింగ్స్‌లను చూడాలనేది అభిమానుల ఆకాంక్ష.

Published : 10 May 2024 15:55 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చే ఎంఎస్ ధోనీ (MS Dhoni).. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఎక్కువగా లోయర్‌ ఆర్డర్‌కే పరిమితమవుతున్నాడు. చెన్నై తరఫున చివరి ఓవర్‌ ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు వచ్చి ధనాధన్‌ షాట్లతో విరుచుకుపడ్డాడు. కానీ, పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఆశ్చర్యపరిచాడు. తొలి బంతికే క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. దీంతో ధోనీ స్థానంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరిగింది. భారత మాజీ క్రికెటర్లు కొందరు అతడికి బదులు మరొక పేసర్‌ను తీసుకుంటే బాగుండేదన్న అభిప్రాయమూ వ్యక్తంచేశారు. అసలు ధోనీ ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడనే దానికి ‘గాయం’ కూడా కారణమనేవారూ లేకపోలేదు. ఆ జట్టు వ్యూహాత్మకంగా ఇలాంటి నిర్ణయం తీసుకుందనేది కొందరి వాదన. ధోనీ బ్యాటింగ్‌ స్థానంపై చెన్నై ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు. ఇవాళ గుజరాత్‌తో చెన్నై తలపడనున్న నేపథ్యంలో ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఫ్లెమింగ్‌ మాట్లాడాడు. 

‘‘ప్రస్తుత సీజన్‌లో సిక్స్‌లు, ఫోర్లను అలవోకగా బాదేయడం ప్రతిఒక్కరూ చూశారు. జట్టుకు అతడెంతో బలం. మెగా లీగ్‌లో పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది.  కొన్నిసార్లు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వొచ్చు. అన్నివేళలా అది సాధ్యం కాకపోవచ్చు. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం వల్ల జట్టుపై అతడి ప్రభావం తక్కువగా ఉందని భావించనక్కర్లేదు. ప్రతీ దానికి సమయం అనేది కీలకం. జట్టుకు అతడు ఏం ఇవ్వగలడనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాం. గాయం వల్లే అతడిపై ఎక్కువ భారం మోపడం లేదనేది సరైంది కాదు. అతడి ఫిట్‌నెస్‌ ఓకే. కానీ, గతేడాది అతడి గాయానికి శస్త్రచికిత్స అయింది. కాబట్టే, ధోనీపై ఒత్తిడి లేకుండా చూస్తున్నాం. జట్టును సమతూకంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆటపై అతడికి ఉన్న అవగాహన, ఆసక్తి మరెవరికీ లేదు. జట్టు కోసం అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాడు’’ అని ఫ్లెమింగ్‌ వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని