మాటలు కలిపి... ఖాతాలు కొల్లగొడుతున్నారు!

హిందీ మాట్లాడే, అర్థం చేసుకునేవారు ఎక్కువగా ఉండడం... సాంకేతిక పరిజ్ఞానం వినియోగం.. ఇవి తెలంగాణను దక్షిణాది రాష్ట్రాల్లో ప్రత్యేకంగా నిలిపాయి. సరిగ్గా ఇవే పరిస్థితులు ఉత్తరాది నేరగాళ్ల పంట పండిస్తున్నాయి...

Published : 17 Aug 2022 05:49 IST

హిందీ మాట్లాడే, అర్థం చేసుకునేవారు ఎక్కువగా ఉండడం... సాంకేతిక పరిజ్ఞానం వినియోగం.. ఇవి తెలంగాణను దక్షిణాది రాష్ట్రాల్లో ప్రత్యేకంగా నిలిపాయి. సరిగ్గా ఇవే పరిస్థితులు ఉత్తరాది నేరగాళ్ల పంట పండిస్తున్నాయి...

ఈనాడు, హైదరాబాద్‌: గత ఏడాది రాష్ట్రంలో 8వేలకు పైగా సైబర్‌ నేరాలు నమోదయ్యాయి. జాతీయ నేరాల నమోదు సంస్థ (ఎన్సీఆర్బీ) లెక్కల ప్రకారం 2020లో దేశంలో 50,035 సైబర్‌ నేరాలు నమోదు కాగా ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్రల తర్వాత తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో 13.4 శాతం సైబర్‌ నేరాలే ఉంటున్నాయి. సంప్రదాయ నేరాలకు దీటుగా సైబర్‌ మోసాలు పెరిగిపోతున్నాయని దీన్నిబట్టి అర్థమవుతోంది. బ్యాంకుల సర్వర్‌లోకి చొరబడి డబ్బు తమ ఖాతాల్లోకి మళ్లించడం మొదలు ఖాతాదారుల వివరాలు తస్కరించి, వారి ఖాతాలు ఖాళీ చేయడం... పలు సంస్థలకు చెందిన కంప్యూటర్లను హ్యాక్‌చేసి ర్యామ్‌సమ్‌వేర్‌ దాడులకు పాల్పడి డబ్బు కొల్లగొట్టడం వరకు వందలకొద్దీ కేసులు నమోదవుతున్నాయి. వీటికి తోడు మీకు లాటరీ తగిలిందని, కౌన్‌ బనేగా కరోడ్‌పతిలో అవకాశం వచ్చిందని, నో యువర్‌ కస్టమర్‌ వివరాలు నమోదు చేయకపోతే బ్యాంకు ఖాతా లావాదేవీలు ఆపుతామని ఫోన్‌చేసి ఉచ్చులోకి దించి మరీ సైబర్‌ నేరగాళ్లు కొల్లగొడుతున్నారు. రాజస్థాన్‌, ఝార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలు, నొయిడా ప్రాంతానికి చెందినవారు వీటికి సూత్రధారులుగా ఉంటున్నారు. తెలంగాణలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా వీరిక్కడ నేరాలు తేలిగ్గా చేయగలుగుతున్నారు. ఈ నేరాలకు పాల్పడే వారంతా హిందీలోనే మాట్లాడతారు. హిందీ మాట్లాడే ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ వంటి రాష్ట్రాల్లో బ్యాంకు లావాదేవీలు తక్కువగా జరుగుతాయి. వెనకబాటుతనం కారణంగా ఆన్‌లైన్‌ లావాదేవీలు, ఈకామర్స్‌ సైట్ల ద్వారా కొనుగోళ్లవంటివి కూడా పరిమితంగానే జరుగుతాయి కాబట్టి వీరు దృష్టిపెట్టలేరు. దక్షిణాది రాష్ట్రాల్లో జీవన ప్రమాణాలు, ఆదాయ వ్యయాలు ఎక్కువే. కానీ కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లలో హిందీ మాట్లాడేవారు తక్కువ. కాబట్టి ఆయా రాష్ట్రాల ప్రజలతో సైబర్‌ నేరగాళ్లు మాట కలపలేరు, ముగ్గులోకి దింపలేరు. ఎటొచ్చీ తెలంగాణ... అందులోనూ హైదరాబాద్‌లో ఎక్కువ మంది ప్రజలు హిందీ మాట్లాడతారు. అర్థం చేసుకుంటారు. ఇక్కడ కూలి పనులు చేసుకునేవారు కూడా గూగుల్‌పే వంటివి వినియోగిస్తున్నారు. అందుకే ఉత్తరాది సైబర్‌ నేరగాళ్లు ఇక్కడ తేలిగ్గా మోసాలకు పాల్పడుతున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే ఏటా రూ.వంద కోట్ల వరకూ దోచుకుంటున్నారని, రాష్ట్రం మొత్తం తీసుకుంటే ఇది రూ.250 కోట్ల వరకూ ఉంటుందని పోలీసుల అంచనా. అవగాహన పెంపొందించడం ద్వారానే వీటిని కట్టడి చేయగలమని అధికారులు భావిస్తున్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని