Macharla: మాచర్లలో పోలీసుల హైడ్రామా.. హత్య కేసులో సాక్షే నిందితుడయ్యాడు!

హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వ్యక్తి కోర్టుకు వస్తుండగా పల్నాడు జిల్లా మాచర్లలో పోలీసులు బలవంతంగా తీసుకెళ్లడం చర్చనీయాంశమైంది.

Updated : 02 Nov 2022 08:43 IST

మాచర్ల, న్యూస్‌టుడే: హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వ్యక్తి కోర్టుకు వస్తుండగా పల్నాడు జిల్లా మాచర్లలో పోలీసులు బలవంతంగా తీసుకెళ్లడం చర్చనీయాంశమైంది. అనూహ్యంగా సాక్షిగా ఉన్న అదే కేసులో... అతని పేరును కూడా నిందితుడిగా చేర్చడం గమనార్హం. అయిదు నెలల కిందట దుర్గి మండలం జంగమహేశ్వరపాడులో వైకాపా నాయకుల చేతిలో తెదేపా నాయకుడు జల్లయ్య హత్యకు గురయ్యారు. నాటి దాడిలో ఆయనకు మామ వరుసయ్యే మంగయ్య గాయపడ్డారు. ఇరువర్గాల వారు పరస్పరం కేసులు పెట్టుకున్నారు. మంగయ్య కొన్ని వాయిదాలకు హాజరయ్యారు. ఈ క్రమంలో మంగళవారం మాచర్ల కోర్టుకు వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను అపహరించారు. హత్య కేసుకు సంబంధించి ఏదో జరుగుతోందని స్థానికులు అనుమానించారు. ఇదే విషయాన్ని తెదేపా నాయకులు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చాలాసేపటి తర్వాత... మంగయ్యను కారంపూడి పోలీసులు తీసుకెళ్లినట్లు తేలింది. వెంటనే తెదేపా మాచర్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి తమ శ్రేణులతో కలిసి దుర్గి పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. జల్లయ్యను హత్య చేసిన అధికార పార్టీకి చెందిన నిందితులను వదిలేసిన పోలీసులు.. బాధితులనే ఇరికించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడిలో గాయపడిన జల్లయ్య మామ మంగయ్య, అతని సోదరుడిని నిందితులుగా చేర్చారని ఆరోపించారు. బాధితులు కోర్టుకు వస్తుండగా వెంటాడి పట్టుకున్నట్లు డ్రామాకు తెర లేపారని తెలిపారు. దీనిపై సీఐ జయకుమార్‌ మాట్లాడుతూ... జల్లయ్య హత్య కేసులో మంగయ్య నిందితుడని స్పష్టం చేశారు. పరారీలో ఉన్న అతన్ని మాచర్లలో అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచామని, ఇందులో ఆరోపణలకు అవకాశం లేదని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని