ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌

తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపుర్‌ జిల్లాలో శనివారం భద్రతా బలగాలు-మావోయిస్టు దళాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.

Published : 27 Nov 2022 04:59 IST

నలుగురు మావోయిస్టుల మృతి

బీజాపుర్‌-దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపుర్‌ జిల్లాలో శనివారం భద్రతా బలగాలు-మావోయిస్టు దళాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్‌ ఎస్పీ ఆంజనేయ వైష్ణవ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం(పీఎల్‌జీఏ) వారోత్సవాలకు సంబంధించి మావోయిస్టులు సమావేశం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి నుంచి సీఆర్పీఎఫ్‌, డీఆర్జీ(డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్స్‌), ఎస్టీఎఫ్‌(స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌) బలగాలు కూంబింగ్‌ చేపట్టాయి. శనివారం ఉదయం 7.30 గంటల సమయంలో భద్రతా బలగాలకు తారసపడిన మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఆత్మరక్షణ కోసం భద్రతా బలగాలు సైతం కాల్పులు జరిపాయి. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు డివిజనల్‌ కమిటీ సభ్యుడు మోహన్‌ కడ్తి(40), మట్వారా ఎల్‌వోఎస్‌ సభ్యుడు రమేష్‌(32), మహిళా మావోయిస్టు నేత సుమిత్ర(28), మరో మహిళా మవోయిస్టు మృతి చెందారు. మరో ఇద్దరు సైతం మరణించగా.. మిగిలిన మావోయిస్టులు వారి మృతదేహాలను భుజాలపై మోసుకొని వెళ్లిపోయినట్లు సమాచారం. మరికొందరు గాయపడి పారిపోయారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి మావోయిస్టు మృతదేహాలతో పాటు రెండు రైఫిళ్లు, పేలుడు సామగ్రి, కిట్‌ బ్యాగులు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని