icon icon icon
icon icon icon

LS polls: ‘ఓటు వేయండి - లడ్డూ, దోశ ఉచితంగా తినండి’!

ఓటు వేసి వచ్చిన వారికి దోశ, లడ్డూ, కాఫీతో పాటు ఇతర ఆహార పదార్థాలను బెంగళూరు హోటళ్లు ఉచితంగా లేదా సబ్సిడీ రూపంలో అందజేశాయి.

Updated : 26 Apr 2024 17:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) భాగంగా పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘంతోపాటు ఇతర సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకోసం వివిధ భాగస్వామ్య పక్షాలతో కలిసి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో బెంగళూరులోని వివిధ హోటళ్లు ఇందుకు శ్రీకారం చుట్టాయి. ఓటు వేసి వచ్చినవారికి దోశ, లడ్డు, కాఫీతో పాటు ఇతర ఆహార పదార్థాలను ఉచితంగా లేదా సబ్సిడీ రూపంలో అందజేశాయి. దీంతో పలు రెస్టారంట్ల వద్ద భారీ సంఖ్యలో జనం క్యూ కట్టిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

బెంగళూరు నగరంలో పోలింగ్‌ శాతాన్ని పెంచే ఉద్దేశంతో బృహత్‌ బెంగళూరు హోటల్స్‌ అసోసియేషన్‌ (బీబీహెచ్‌ఏ)కు అనుబంధంగా ఉన్న పలు రెస్టారంట్లు తమవంతు ప్రయత్నం చేయాలని భావించాయి. ఇందులోభాగంగా ఓటు వేసి వచ్చినవారికి ఉచితంగా ఆహార పదార్థాలు అందించగా.. మరికొన్ని మాత్రం బిల్లులో డిస్కౌంట్‌ ఇచ్చాయి. నృపతుంగా రోడ్డులో ఉన్న నిసర్గ గ్రాండ్‌ హోటల్‌.. ఓటు వేసి వచ్చినవారికి బటర్‌ దోశ, లడ్డూ, జ్యూస్‌ వంటివి ఉచితంగా అందించింది. ‘ఓటు వేయండి-ఫుడ్‌ తినండి’ అనే నినాదంతో వీటిని అందించింది. దీంతో ఉదయం నుంచే అనేకమంది ఓటర్లు హోటల్‌ ముందు బారులు తీరారు. దాదాపు 2వేల మందికి వీటిని ఫ్రీగా అందించారట.

‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు

నగరంలోని అనేక రెస్టారంట్లు, బేకరీలు.. వినోద కేంద్రాలు, పార్కులు, ర్యాపిడో వంటి టాక్సీ సర్వీసులు కూడా 20 నుంచి 30శాతం డిస్కౌంట్‌ ప్రకటించాయి. అంతేకాదు అనేక బార్లు కూడా ఇటువంటి ఆఫర్‌తో ముందుకొచ్చాయి. కొన్ని బార్లు (పరిమిత సంఖ్యలో కస్టమర్లకు) బీర్లను ఉచితంగా ఇస్తామని ప్రకటించగా, మరికొన్ని డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్లు తెలిపాయి. అయితే, పోలింగ్‌ రోజు వైన్స్‌, బార్‌లు మూసివేసి ఉన్నందున, మరుసటి రోజు (శనివారం) ఈ ఆఫర్‌ ఇవ్వనున్నట్లు సమాచారం.

గత లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరులో పోలింగ్‌ 54శాతంగా నమోదైంది. ఈవిషయాన్ని ప్రస్తావించిన బీబీహెచ్‌ఏ అధ్యక్షుడు పీసీ రావు.. ఎంతోమంది ఉన్నత విద్యావంతులు ఉన్న ఈ నగరంలో పోలింగ్‌ శాతం తక్కువగా ఉండటం నిరాశ కలిగించే అంశమన్నారు. అందుకే పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు తమవంతు ప్రయత్నంగా ఈ ఐడియాతో ముందుకు వచ్చామన్నారు. ఇందుకోసం కర్ణాటక హైకోర్టు నుంచి అనుమతి పొందినట్లు సమాచారం. ఎన్నికల కోడ్‌ నిబంధనలకు లోబడి వీటిని అమలుచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే, కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలు ఉండగా.. రెండో దశలో భాగంగా 14 సీట్లలో శుక్రవారం పోలింగ్‌ జరుగుతోంది. బెంగళూరు సౌత్‌, సెంట్రల్‌, నార్త్‌, రూరల్‌ నియోజకవర్గాలు ఇందులో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img