తిహాడ్‌ జైలుకు సీబీఐ నకిలీ అధికారి శ్రీనివాసరావు

సీబీఐ అధికారినంటూ మోసాలకు పాల్పడుతున్న కొవ్విరెడ్డి శ్రీనివాసరావుకు దిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది.

Published : 04 Dec 2022 04:42 IST

14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించిన సీబీఐ ప్రత్యేక కోర్టు

ఈనాడు, దిల్లీ: సీబీఐ అధికారినంటూ మోసాలకు పాల్పడుతున్న కొవ్విరెడ్డి శ్రీనివాసరావుకు దిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. మోసాలకు పాల్పడుతున్న కేసులో శ్రీనివాసరావును సీబీఐ అధికారులు నవంబరు 26న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 8 రోజుల కస్టడీ అనంతరం ప్రత్యేక కోర్టులో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ దీపక్‌ కుమార్‌ ఎదుట శనివారం ఆయనను అధికారులు హాజరుపరిచారు. శ్రీనివాసరావును విచారించేందుకు మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఆరుగురు సాక్షులను విచారించామని, అందులో తెలంగాణకు చెందిన వీఐపీలు (మంత్రి గంగుల కమలాకర్‌, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర) ఉన్నారని తెలిపారు. ఇంకా పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులను నిందితుని సమక్షంలో విచారణ చేయాల్సి ఉందన్నారు. సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ పేరుతో శ్రీనివాసరావు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్‌ వ్యక్తులు, వ్యాపారవేత్తలను మోసం చేస్తూ భారీ కుట్రకు పాల్పడుతున్నారని మేజిస్ట్రేట్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ దశలో నిందితుడి తరఫు న్యాయవాది జోక్యం చేసుకుని సీబీఐ తప్పుడు ఆరోపణలు మోపుతోందని, లేని ఆధారాల కోసం ప్రయత్నిస్తోందన్నారు. ఇన్ని రోజులు కస్టడీలో ఉంచుకొని సీబీఐ ఏ సమాచారమూ సేకరించలేదని, సాక్షుల విచారణలో శ్రీనివాసరావు ఉండాల్సిన అవసరం లేదన్నారు. కస్టడీలో ఆయన్ను వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. వాదనల అనంతరం నిందితున్ని సీబీఐ కస్టడీకి ఇవ్వడానికి మెజిస్ట్రేట్‌ నిరాకరించారు. ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధిస్తూ తదుపరి విచారణను డిసెంబరు 16కు వాయిదా వేశారు. కోర్టు ఆదేశాల మేరకు శ్రీనివాసరావును సీబీఐ అధికారులు తిహాడ్‌ జైలుకు తరలించారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు