Cyber crime: ఒక్క వీడియో కాల్‌కు మూల్యం ₹5.35 లక్షలు!

Cyber crime: గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలియజెప్పే ఘటన ఇదీ. రాత్రి పూట వచ్చిన ఓ వీడియో కాల్‌ను లిఫ్ట్‌ చేసినందుకు రూ.5 లక్షలు మూల్యం చెల్లించుకున్నాడు.

Published : 12 Mar 2023 01:42 IST

అంబాలా: ఓ 25 ఏళ్ల అబ్బాయికి రాత్రి 10 గంటలకు  గుర్తు తెలీని నంబర్‌ నుంచి వాట్సాప్‌ కాల్‌ (Whatsapp video call) వచ్చింది. తీరా మాట కలిపితే అటు నుంచి మాట్లాడుతున్నది మహిళ. చాలాసేపు మాట్లాడాక... అవతలి కాల్‌లో ఉన్న మహిళ నగ్నంగా ప్రత్యక్షమైంది. అంతలోనే కాల్‌ కట్ అయ్యింది. తిరిగి చేస్తే బ్లాక్‌ అయినట్లు తెలిసింది. కానీ, మరుసటి రోజు అనూహ్యంగా మరో నంబర్‌ నుంచి కాల్‌ వచ్చింది. ఆ తర్వాత ఏకంగా రూ.5.35 లక్షలు వదిలించుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన హరియాణాలో జరిగినప్పటికీ.. సైబర్‌ నేరగాళ్ల (Cyber Fraud) నయా మోసాల పట్ల అప్రమత్తమవ్వాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది. పూర్తి వివరాలివీ..

హరియాణాలోని అంబాలా కంటోన్మెంట్‌కు చెందిన యువకుడికి ఫిబ్రవరి 9న ఓ మహిళ వాట్సాప్‌లో కాల్‌ చేసింది. కాసేపు నగ్నంగా కనిపించి అంతలోనే కాల్‌ కట్‌ చేసింది. నంబర్‌ను బ్లాక్‌ చేసింది. ఆ మరుసటి రోజు ఆ యువకుడికి మరో ఫోన్‌ నంబర్‌ నుంచి వాట్సాప్‌ కాల్‌ వచ్చింది. తాను దిల్లీ పోలీసు అధికారినని చెప్పాడు. ‘వీడియో కాల్స్‌ చేస్తూ మోసం చేస్తున్న మహిళ సహా ముఠాను పట్టుకున్నాం. ఆ లిస్ట్‌లో నీ పేరు ఉంది. నీపై కేసు లేకుండా చేయాలంటే వెంటనే డబ్బులు చెల్లించు’ అని చెప్పాడు

పోలీసులమని చెప్పగానే భయపడిపోయిన సదరు యువకుడు తొలుత సదరు ‘పోలీసు అధికారికి’ రూ.51 వేలు చెల్లించాడు. మరికొన్ని సార్లూ బెదిరింపులు రావడంతో విడతల వారీగా రూ.5.35 లక్షలు చెల్లించాడు. తీరా ఐదు లక్షలు వదిలాక గానీ అతగాడికి విషయం బోధ పడలేదు.. పోలీసునని చెప్పిన వ్యక్తి కూడా ఆ మహిళకు చెందిన గ్యాంగేనని! దీంతో మోసపోయానని గ్రహించిన యువకుడు సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి కొత్త నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ పట్ల జర జాగ్రత్త!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని