Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్‌ పిడిగుద్దులు.. ఆపై హత్య

వన్‌ టైం పాస్‌వర్డ్‌ (ఓటీపీ) విషయంలో చెలరేగిన వివాదంలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి హతమయ్యాడు.......

Published : 06 Jul 2022 02:24 IST

చెన్నై: వన్‌ టైం పాస్‌వర్డ్‌ (ఓటీపీ) విషయంలో చెలరేగిన వివాదంలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి హతమయ్యాడు. కారు డోరును తన్నాడన్న కోపంతో ఓలా డ్రైవర్.. టెకీపై పిడిగుద్దులు కురిపించి దారుణంగా హత్య చేశాడు. తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అయిన ఉమేంద్ర కోయంబత్తూర్‌లోని ఓ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. గత ఆదివారం భార్యాపిల్లలతో కలిసి చెన్నైలోని బంధువుల ఇంటికి వెళ్లాడు.

ఓ థియేటర్‌లో సినిమా చూసి ఇంటికి వచ్చే క్రమంలో ఓలాలో క్యాబ్‌ బుక్‌ చేసుకున్నారు. అయితే సెల్‌ఫోన్‌కు వచ్చే ఓటీపీపై గందరగోళం నెలకొంది. అప్పటికే ఉమేంద్ర కుటుంబం క్యాబ్‌లో కూర్చోగా.. కిందకు దిగాలని డ్రైవర్‌ గద్దించాడు.  సరైన ఓటీపీ చెప్పిన తర్వాతే క్యాబ్‌ ఎక్కాలని స్పష్టం చేశాడు. అయితే దిగే క్రమంలో క్యాబ్‌ డోర్‌ను ఉమేంద్ర తన్నడంతో కోపోద్రిక్తుడైన డ్రైవర్‌.. అతడిపై దాడికి పాల్పడ్డాడు. ముఖంపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాధితుడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్‌ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని