Accident: ఘోర బస్సు ప్రమాదం.. ఆరుగురు భారతీయ పౌరుల దుర్మరణం

Bus accident: నేపాల్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో ఆరుగురు భారతీయ పౌరులతో పాటు మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

Updated : 24 Aug 2023 16:36 IST

కాఠ్‌మాండూ: నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మాదేశ్‌ ప్రావిన్స్‌లోని పర్వత మార్గంలో యాత్రికులతో వెళ్తున్న బస్సు బోల్తాపడిన ఘటనలో ఏడుగురు మరణించారు. వీరిలో ఆరుగురు భారత పౌరులు ఉన్నట్టు అక్కడి మీడియా వెల్లడించింది. బారా జిల్లాలో యాత్రికులతో వెళ్తున్న బస్సు సిమారా సబ్‌ మెట్రోపాలిటన్‌ సిటీలోని చురియమై ఆలయానికి దక్షిణాన ఉన్న నదీ ఒడ్డున రహదారిపై గురువారం ఉదయం బోల్తా పడింది. ఈ బస్సులో రాజస్థాన్‌కు చెందిన యాత్రికులతో పాటు మొత్తం 26మంది ఉన్నారు. అయితే, ఈ ప్రమాదంలో ఆరుగురు భారతీయులు, ఒక నేపాలీ మృతిచెందగా.. 19మందికి గాయాలైనట్టు కాఠ్‌మాండూ పోస్ట్‌ పేర్కొంది.

విజయవాడలో భారీ అగ్నిప్రమాదం

మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌ జిలామి ఖాన్‌తో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు బారా జిల్లా పోలీస్‌ అధికారి హోబింద్ర బొగాటి వెల్లడించారు. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు మరికొందరికి గాయాలు కాగా.. వారికి చికిత్స చేయించి.. అదుపులోకి తీసుకొన్నట్లు వెల్లడించారు. మిగతా క్షతగాత్రుందరిని పలు ఆస్పత్రుల్లో చేర్పించి వైద్యం చేయిస్తున్నట్లు వెల్లడించారు. నేపాల్‌లో రోడ్ల పరిస్థితి ఘోరంగా ఉండటంతో అక్కడ ఇలాంటి ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. బుధవారం కూడా ఓ ప్రమాదం చోటుచేసుకుంది. బాగ్మతి ప్రావిన్స్‌లో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడటంతో ఎనిమిది మంది మృతిచెందగా.. 15మందికి పైగా గాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని